శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: మంచి శకునాలకి ఆదిత్యుడు కొలువైన సిక్కోల్ శుభసూచికమని రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రానికి ఈశాన్యంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఓ సంప్రదాయం! ఇదే బాటను ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీ నుంచి పాదయాత్ర శ్రీకాకుళం నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే - ధర్మల్ సెగలు ఎగిసిపడుతున్న కాకరాపల్లి నుంచి కులచిచ్చురేగిన లక్ష్మీపేట వరకూ బాబు పాదయాత్ర జిల్లాలో 125 కిలోమీటర్లు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబర్ 2 నుంచి గణతంత్రవేడుకలు నిర్వహించే జనవరి 26 వరకూ రాష్టమ్రంతా ఈ పాదయాత్ర సాగనుంది. దీనిని శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడతారని అందరూ భావిస్తుండగా తెలుగుతమ్ముళ్లలో కాకరాపల్లి లొల్లి అడ్డుతగులుతోంది. ఇప్పటికే థర్మల్ పుణ్యమా అంటూ కింజరాపు, తమ్మినేని, శివాజీ వంటి సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తమ్మినేని వర్గం కాకరాపల్లి నుంచి బాబు పాదయాత్రను ఆరంభించి కింజరాపు సోదరల ప్రతిష్ఠను దెబ్బతీసేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీనిని పసిగట్టిన జిల్లా దేశం బిగ్‌బాస్ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర రూటునే మార్చి సిక్కోల్‌లో శుభంకార్డు వేసేలా ఎత్తుకుపైఎత్తు వేస్తూ కొత్త రూటును ప్రతిపాదించినట్లు బోగట్టా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక పదవులు అనుభవించిన సీనియర్లు నేడు అధికార పార్టీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎటువంటి ఉద్యమాలు చేపట్టకుండా అనునిత్యం కోల్డ్‌వార్‌కు దిగుతూ వీధికెక్కుతున్నారు. కాకరాపల్లి థర్మల్ ప్రాజెక్టు వద్దంటూ మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గళం వినిపిస్తుంటే - అక్కడే ఉంటున్న కింజరాపు సోదరులు కాకరాపల్లిపై నోరుమెదపడం లేదు. దీనికి ప్రతీకార చర్యగా ఆమదాలవలస చక్కెర పరిశ్రమ మూతపడకుండా నాడు తమ్మినేని అడ్డుకోలేకపోయారంటూ పాత కథకు కొత్త వివాదాన్ని జోడించి మేనళ్లుడు కూన రవికుమార్‌తో తమ్మినేనికి బస్తీమే సవాల్ అన్న వాతావరణాన్ని కింజరాపు సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకేఒక్కడుగా గుర్తింపు గల ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ థర్మల్ యుద్ధంలో జైలుపాలై విడుదలైన నేపధ్యంలో ఎర్రన్న నాడు లచ్చన్న - నేడు సాయిరాజ్ అంటూ మాటజారిన వెనువెంటనే శివాజీ శివమెత్తారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జిల్లా దేశం పార్టీ కూరుకుపోయింది. ఇక, ప్రతిభా, కళా మధ్య ప్రతికూల వాతావరణమే సుస్పష్టమవుతుంది. రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులుకు తగిన గుర్తింపులేదని జగన్ పార్టీవైపు చూస్తున్న తరుణంలో లక్ష్మీపేట వరకూ బాబు పయనం ఏలా సాగుతుందని తెలుగుతమ్ముళ్లే మూతులుకొరుక్కుంటున్నారు. అయినదానికి - కానిదానికి దేశం ముదుర్లు రచ్చకెక్కడం ఎన్టీఆర్ అభిమానులు సైతం వీరిని ఈసడించుకోవడం షరామామ్ములే! ఇటువంటి పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించాలని బాబు యత్నించినా ఫలితం దక్కడం లేదు. ప్రతి చిన్న విషయానికి గ్రూపులు కడుతూ మీడియా ముందు వేర్వేరు అజెండాలను వెల్లడించడం సామాన్య కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కాకరాపల్లి కాల్పు ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బాబును వద్దని చెప్పిన వినకుండా తమ్మినేని మాటతో నాడు అధినేత కాకరాపల్లిలో అడుగుపెట్టి బాధితులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అయితే, ఆ సమయంలో కింజరాపు సోదరులు బాబుతో కాకరాపల్లి పర్యటకు ముఖం చాటేయడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.ఇదిలా ఉండగా, తాజాగా కాకరాపల్లిలో ధర్మల్ యాజమాన్యం కింజరాపు సోదరులు సూచించినలకే విలువలిస్తూ అధికార పార్టీనే కాకుండా, దేశంలో సీనియర్ నేత తమ్మినేని ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వైనం బాబు పాదయాత్రను రూటుమార్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. థర్మల్ ఉద్యమాల్లో తెలుగుదేశం పార్టీ నేతల్లో స్పష్టమైన వైఖరి కొరవడిందని బాధిత గ్రామాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో బాబు పాదయాత్ర తొలిరోజే గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని విజన్‌ను ఎర్రన్న అధినేతకు చూపించినట్లు తెలిసింది. కాని - కింజరాపు సోదరులను చెక్ పెట్టేందుకు జిల్లాలో తమ్ముళ్ల తృతీయ కూటమి ఏర్పడింది. కళా, శివాజీ, తమ్మినేని వంటి నేతలు బాబు పాదయాత్ర ఆరంభమే కాకరాపల్లి నుంచి జరగాలని అధినేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నివేదించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాల సమాచారం. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో చేపట్టనున్న ఈ పాదయాత్ర వాతావరణాన్ని దేశం ముదర్లు కలుషితం చేసే ప్రమాదం పోంచివుంది. అధినేత చంద్రబాబునాయుడు సీనియర్లను వదులుకోలేక, వారి సూచనలను వినలేక చివరికి తెలంగాణ తంతూ అంటూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచే బాబు పాదయాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యిందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
మంచి శకునాలకి ఆదిత్యుడు కొలువైన సిక్కోల్
english title:
closing in skl
Date:
Saturday, September 15, 2012