వేపాడ, సెప్టెంబర్ 14: వేపాడ మండలం జగ్గయ్యపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన కోటా డీలర్ రొంగలి శ్రీదేవి (30), మరో రైతు ఎం.అప్పడు (45) గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారు. స్థానికంగా చికిత్స చేయించినప్పటికీ నయం కాకపోవడంతో వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం వీరికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. డెంగ్యూ వ్యాధి విషయమై స్థానిక వైద్యాధికారులు మాత్రం పెదవిప్పట్లేదు. ఇక ఇదే మండలం ఆతవ గ్రామంలో కూడా పలువురు జ్వరంతో బాధ పడుతున్నారు. కె.బంగారమ్మ, డి.చినతల్లి, బి.వెంకటరావుతో పాటు మరికొంత మంది గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవలే ఆతవ గ్రామంలో వైద్య శిబిరాన్ని సైతం అధికారులు నిర్వహించారు. అయినప్పటికీ జ్వర పీడితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో పలు గ్రామాల్లో ప్రజానీకం భయాందోళనలు వ్యక్తం చేస్తోంది.
వేపాడ మండలం జగ్గయ్యపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు
english title:
vepada
Date:
Saturday, September 15, 2012