విజయనగరం , సెప్టెంబర్ 14: పెంచిన డీజిల్, గ్యాస్‌ధరలను తగ్గించాలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ డిమాండ్ చేశారు. డీజిల్, గ్యాస్‌ధరల పెంపుదలకు నిరసనగా శుక్రవారం ఇక్కడ మయూరి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొన్న పెట్రోల్ ధరలను పెంచిన కేంద్రం ఇప్పుడు డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్‌పార్టీలో తుదిఘడియలు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుదల ప్రజలపై విపరీతంగా భారం పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రజా రవాణావ్యవస్థ కొలుకోలేని దెబ్బ తింటుందన్నారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే, ఇప్పుడు పెరిగిన డీజల్, వంటగ్యాస్ ధరల వల్ల మరింత భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజల రవాణాభారం కూడా పెరుగుతుందన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్‌పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలు అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని జగదీష్ విమర్శించారు. ఒకవైపు విద్యుత్‌కోతలతో ప్రజలు సతమతమవుతుంటే, మరొవైపుమంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీయాత్రలు సాగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రైతుల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎరువుల కొరతతో రైతులు సతమతమవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, పార్టీ నాయకులు ప్రసాదుల రామకృష్ణ, ఐ.వి.పి.రాజు, సైలాడ త్రినాధరావుతదితరులు పాల్గొన్నారు.
‘పింఛన్ మొత్తాన్ని పెంచాలి’
విజయనగరం, సెప్టెంబర్ 14: వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్‌దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత సూరిబాబు డిమాండ్ చేశారు. పింఛన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు నెలకు 200 రూపాయలు, వికలాంగులకు 500 రూపాయల నామమాత్రపు పింఛన్ చెల్లిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న పింఛన్ ఏమాత్రం చాలడంలేదన్నారు. అందువల్ల వృద్ధులకు, వితంతువులకు 2000 రూపాయలు, వికలాంగులకు 2,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగవైకల్యం 20 శాతం ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తించి పింఛన్ మంజూరు చేయాలన్నారు. మహిళలు, పురుషులకు పింఛన్ పొందే అర్హతను 50 సంవత్సరాలుగా గుర్తించాలన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్‌దారుల కుటుంబాలకు 30కిలోల బయ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వృద్థులు, వితంతువులు, వికలాంగులు పాల్గొన్నారు.
‘ఆటో కార్మికులపై అదనపు భారం’
విజయనగరం, సెప్టెంబర్ 14: పెంచిన డీజిల్ ధరల వల్ల ఆటో కార్మికులపై మరింత అదనపు భారం పడుతోందని ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు ఆరోపించారు. పెంచిన డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆటోకార్మికులు శుక్రవారం నాడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ పెంచిన డీజిల్ ధరల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలపై సుమారు 500 కోట్ల రూపాల అదనపు భారం పెరుగుతోందన్నారు. అదేవిధంగా ఆర్టీసిపై 250 కోట్ల మేర అదనపు భారం పెరుగిందన్నారు. దీని వల్ల ప్రయాణ ఛార్జీలు పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పెట్రోల్, ఢీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని, మరోసారి ధరలను పెంచి మరింత భారాన్ని పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢీజిల్ ధరలు పెంచడ వల్ల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అలాగే ఏడాదికి ఆరు గ్యాస్ సిలెండర్లను మాత్రం రాయితీపై ఇస్తామని ప్రకటించడం సరైన విధానం కాదని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి సగటున 12 సిలెండర్ల అవసరం ఉన్నందున 12 సిలెండర్లను రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధరలను తగ్గించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆటో వర్క్స యూనియన్ ప్రెసిడెంట్ అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ పెంచిన ఢీజిల్ ధరల కారణంగా ఆటోకార్మికులు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులంతా మానవహారంగా ఏర్పడి, తాడుతో ఆటోలను లాగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోవర్క్స్ యూనియన్ నాయకులు ఎం.సన్యాసిరావు, ఆటోకార్మికులు పాల్గొన్నారు.
దేశంలో దుష్పరిపాలన
విజయనగరం, సెప్టెంబర్ 14: యుపిఎ ప్రభుత్వం దుష్పరిపాలన చేస్తోందని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పాకలపాటి సన్యాసిరాజు విమర్శించారు. పెంచిన డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపిఎ పాలనలో మునుపు ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కేంద్రం మరోసారి డీజిల్‌పై అయిదు రూపాయలు పెంచి తమ చేతగాని తనాన్ని మరోసారి నిరూపించుకున్నారన్నారు. పెట్రోల్, ఢీజిల్ సంస్థల నుంచి కేంద్రానికి కోట్లాది రూపాయలు ముడుపులు అందుతున్నందునే ధరలు పెంచుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పాలనలో అవినీతికి అంతులేకుండా పోయిందని, ఏ మూల చూసినా అవినీతి తప్ప ప్రజాసంక్షేమం ఎక్కడా కన్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం యుపిఎ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి బవిరెడ్డి శివప్రసాద రెడ్డి, పి.వి.వి గోపాలరాజు, బి.మన్మధరావు, పి.అశోక్, కె.ఎన్.ఎం కృష్ణారావు పాల్గొన్నారు.
అదృశ్యం కేసుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
విజయనగరం, సెప్టెంబర్ 14: పోలీస్ స్టేషన్‌లలో నమోదవుతున్న అదృశ్యకేసులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా ఎస్పీ కార్తికేయ సూచించారు. మాసాంతరపు నేర సమీక్షా సమావేశాన్ని స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్తికేయ మాట్లాడుతూ, అదృశ్యకేసుల పరిష్కారానికి అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన ప్రాంతీయ, కూడలిలు వద్ద ట్రాపిక్‌కమబద్దీకరణకు పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు. పెండింగ్ కేసులు పరిష్కారానికి దర్యప్తు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గత నెలలో పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు విచారణలో ఉన్న కేసులుపై ఎస్పీ సమీక్ష జరిపారు. సమావేశాల్లో ఎ.ఎస్.పి. టి.మోహనరావు, విజయనగరం డి.ఎస్పీ ఇషాక్‌మహ్మద్, పార్వతీపురం ఎ.ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, అర్మ్‌డ్ రిజర్వు డి.ఎస్పీ రామకృష్ణతో పాటు సి.ఐ.లు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, న్యాయ సలహాదారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయనగరం, సెప్టెంబర్ 14: ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ స్థానిక జెఎన్‌టియు కళాశాలలో శుక్రవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.స్వామినాయుడు తెలిపారు. తొలిరోజు ఫిజికల్ సైన్స్ విభాగంలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు ఒరిజనల్ సర్ట్ఫికెట్లను పరిశీలించారు. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రెండు రోజులపాటు వెబ్‌ఆఫ్స్‌న్ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 15న ఒకటి నుంచి పదివేల ర్యాంకు వరకు, అలాగే 16న 10వేల ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 17న బయలాజికల్ సైన్స్‌లో ఒకటి నుంచి పదివేల వరకు, 18న పదివేల ఒకటి నుంచి 22,500 వరకు, 19న 22,501 నుంచి చివరి ర్యాంకు వరకు మూడు రోజులపాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా సోషల్ స్టడీస్ విభాగంలో 21న ఒకట్నుంచి 10 వేల ర్యాంకు వరకు, 22న 10వేల ఒకటి నుంచి 20 వేల వరకు, 23న 20 వేల ఒకట్నుంచి 32 వేల 500 వరకు, 24న 32వేల 501 నుంచి 48 వేల వరకు, అలాగే 48వేల ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు నాలుగు రోజులపాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. చివరిగా 25న ఇంగ్లీషు విభాగంలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సిలింగ్ చేపడతారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు రెండు రోజులపాటు వెబ్ ఆఫ్సన్‌లో కళాశాలలను ఎంపిక చేసుకున్న తర్వాత ఈ నెల 30న కళాశాలల కేటాయింపును పూర్తి చేస్తారు.