విజయనగరం, సెప్టెంబర్ 14: మహాకవి గురజాడ అప్పారావు జిల్లాకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహాకవి గురజాడ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం రూపొందించిన పోస్టర్లు, దేశభక్తిగేయాల సిడీలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పండుగ వాతావరణంలో గురజాడ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని, మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర సహాయ మంత్రి హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాకు కీర్తి తెచ్చిన గురజాడను జ్ఞాపకాలను పదిలపరచుకునే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా గురజాడ నివసించిన గృహాన్ని 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించనున్నట్టు తెలిపారు. అలాగే గురజాడ పేరిట గురజాడ కళాక్షేత్రంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఆత్యాధునిక ఆడిటోరియం నిర్మాణానికి ఆయన జయంతి రోజున శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమెల్సీ వి.వరదరామారావు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 19 గురజాడ జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తారు. అనంతరం గురజాడ స్వగృహ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే గురజాడ ఫోటో ఎగ్జిబిషన్‌తో పాటు ఆయన రచనల ప్రదర్శన ప్రారంభిస్తారు. సాయంత్రం గురజాడ కళాభారతిలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అదేరోజు సాయంత్రం బి.రాధికారాణి బృందంచే తెలుగుమహోద్యమం, ఎల్.రవికుమార్ బృందంచే గురజాడ రచన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నృత్యరూపకం ప్రదర్శన ఉంటాయి. గురజాడ సమకాలీన కవులు, వాగ్గేయ కారుల పాత్రలతో గురజాడ దర్బార్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమాలకు జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, ఎం.పి బొత్స ఝాన్సీలక్ష్మి, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణమూర్తి, ఎమ్మెల్యే పి.అశోగ్‌గజపతిరాజు, రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు రమణాచారి పాల్గొంటారు.
20వ తేదీ ఉదయం స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ రచనలు, వ్యాసంగాలపై పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ నిర్వహిస్తారు. సాయంత్రం ఇదే యూనివర్శిటీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉంటుంది. రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నృత్యరూపకం ఏర్పాటు చేశారు. అనంతరం గురజాడకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిన కన్యాశుల్కం నాటకాన్ని స్థానిక సుజాత ఆర్ట్స్ వారు ప్రదర్శిస్తారు. చివరగా గురజాడ జయంతి రోజైన 21న ఉదయం గురజాడ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వేలాది మంది పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. విద్యార్థులచే గురజాడ రచన దేశభక్తిగీతం 3దేశమును ప్రేమించుమన్నా2 సామూహికంగా ఆలపిస్తారు. ఈకార్యక్రమాన్ని ప్రఖ్యాత గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో స్థానిక సంగీత కళాశాల వారిచే కన్యక నృత్యరూపకం, రమణ కుమారి బృందంచే గురజాడ జీవన విధానం ప్రదర్శన ఉంటుంది. చివరగా ముగింపు ఉత్సవం సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మహాకవి గురజాడ అప్పారావు జిల్లాకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టారని రాష్ట్ర రవాణాశాఖ
english title:
posters, cds released
Date:
Saturday, September 15, 2012