సీతంపేట, సెప్టెంబర్ 16: గిరిజనాభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రంలో మిగతా ఐటిడి ఎల కంటే సీతంపేట ఐటిడి ఎ ప్రథమ స్థానంలో ఉందని ప్రాజెక్టు అధికారి సునీల్ రాజ్‌కుమార్ చెప్పారు. ఆదివారం ఆంధ్రభూమికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై ముచ్చటించారు. ఈ ప్రగతి వెనుక అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో ఉందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సిఎం చేతుల మీదుగా ప్రశంసా అవార్డును తీసుకున్నప్పటికీ, గిరిజన సమస్యల పరిష్కారంలో మరింత బాధ్యతలు పెంచినట్లయిందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై దృష్టిసారిస్తుండగా మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయడం ద్వారా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికల రూపకల్పనకు విశాఖలో గిరిజన సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలోనిర్వహించిన మూడు రోజుల వర్క్‌షాప్ మరింత దోహదపడిందని పి ఓ చెప్పారు. గిరిజన విద్యార్థుల ప్రయోజనార్థం మొట్టమొదటిసారిగా సీతంపేట ఐటిడి ఎలో గ్రూప్ 1 కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఐ ఎపి నిధులతో రోడ్ కనక్టవిటీ ద్వారా వందలాది గ్రామాలకు అనుసంధానం చేసామన్నారు. రోజువారీ సమీక్షలు నిర్వహించడం ద్వారా మందగమనంలో ఉన్న శాఖలను ప్రగతి పథం వైపు నడిపించడానికి మాస్టర్ ప్రణాళిక రూపొందించామన్నారు. స్వయం ఉపాధి పథకాల అమలుకు నిధులు కోరినంత లేనప్పటికీ, ఉన్న నిధులతోనే అత్యంత ప్రాధాన్యత క్రమంలో యూనిట్లను గ్రౌండ్ చేయడం ద్వారా ఫలితాలు వచ్చేలా యువతకు అవకాశాలు కల్పించినట్లు పి ఓ సునీల్ రాజ్‌కుమార్ చెప్పారు. ట్రైకార్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఈ ఏడాది కోటి రూపాయిలు వరకు రుణాలు ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రాపౌట్ల నిర్మూలనకు గిరిజన గ్రామాల్లో ఖాళీగా ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహించి వారిని పాఠశాలల్లో చేర్పించడానికి ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఎపిడిమిక్ సీజన్‌లో వ్యాధుల నివారణకు పక్కాగా వైద్య బృందాలను నియమించడం ద్వారా నిరంతరం ఆసుపత్రుల్లో సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవడం మూలంగా జ్వరాల మరణాలు తగ్గించినట్లు పి ఓ చెప్పారు. అలాగే జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలతో పాటు, అక్టోబర్ 26వ తేది వరకు ఐటిడి ఎ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక మెగా వైద్య శిభిరాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ శిబిరాల ద్వారా దీర్ఘకాలిక, ఎపిడిమిక్ వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే పి ఎమ్మార్సీ కేంద్రంగా నిరుద్యోగుల కోసం భవిత అనే కార్యక్రమాన్ని రూపొందించి 6 వేల మందికి వివిధ రంగాల్లో శిక్షణలు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే గిరిజన రైతులకు చెందిన బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు కొత్తగా ఐదు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునాది, క్వెస్ట్ కార్యక్రమాల ద్వారా గిరిజన విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో పదవ తరగతి పాస్ కాని విద్యార్థులను గుర్తించి దిశ ద్వారా వీరికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో అందరి సహకారంతో మరిన్ని అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా పి ఓ సునీల్ రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
గిరిజనాభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రంలో మిగతా ఐటిడి ఎల కంటే
english title:
tribal development
Date:
Monday, September 17, 2012