శ్రీకాకుళం, సెప్టెంబర్ 16: మహాకవి గురజాడ వెంకటప్పారావు 150వ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాల పోస్టర్‌ను ఆదివారం స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కళాశాలలో జరిగిన గురజాడ జయంతి ఏర్పాట్ల సభలో విజయనగరం జిల్లా సాంస్కృతిక శాఖ రూపొందించిన గోడపత్రిక, బ్రోచర్, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, జయంతి ఉత్సవాల కమిటీ ప్రతినిధి, డిపిఆర్వో డి.రమేష్, తెలుగు రచయితల వేదిక గౌరవ అధ్యక్షులు బరాటం కామేశ్వరరావులు విడుదల చేశారు. విజయనగరంలో ఈ నెల 19 నుండి 21వ తేదీవరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. 19వ తేదీ సాయంత్రం నాలుగుగంటలకు గురజాడ జీవిత విశేషాలపై ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని కమిటీ ప్రతినిధి రమేష్ తెలిపారు. 21వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగు రచయితల వేదిక కార్యదర్శి పొట్నూరు వెంకట్రావు, సమన్వయకర్త కోనే శ్రీ్ధర్, భాషాభిమానులు అప్పారావు, ఎస్.శంకర్రావు, ఆర్.రమణమూర్తి, రౌతు శ్రీనివాసరావు, ఆర్.ఎల్.వి.ఎస్ ప్రసాద్, ఎం.వి.మల్లేశ్వరరావు, ఎన్ని గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
15 సూత్రాల అమలు పథకం సభ్యుడిగా ముస్తాక్
శ్రీకాకుళం, సెప్టెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే 15 సూత్రాల అమలు పథకం జిల్లా చైర్మన్‌గా, కేంద్ర సభ్యునిగా జిల్లాకు చెందిన ముస్తాక్‌మహ్మద్‌ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి తెలిపారు. ఆదివారం స్థానిక ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ముస్తాక్ మహ్మద్ సత్కార సభలో ఆమె మాట్లాడారు. మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సానుకూల ధృక్పథంతోనే పనిచేస్తుందని చెప్పారు. 2014 ఎన్నికలు నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. సత్కార గ్రహీత ముస్తాక్ మహ్మద్ మాట్లాడుతూ జిల్లా మైనారిటీ శాఖ చైర్మన్‌గా, 15 సూత్రాల అమలు పథకం సభ్యునిగా తనను నియమించడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని తెలియజేశారు. తను, తన కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాలుగా పార్టీకి విధేయులమై సేవలందించినందుకు తగిన గుర్తింపు కల్పించినందున ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావుకు, డిసిసి అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు ఎస్.గోపాల్, మాజీ ఎమ్మెల్యే కె.ఎ.ఎన్.్భక్తా, ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, పాలవలస కరుణాకర్, డిఎస్‌కె.ప్రసాద్, రత్నాల నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యుని దర్శించుకున్న సినీనటి వాణిశ్రీ
శ్రీకాకుళం, సెప్టెంబర్ 16: అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం సినీనటి వాణిశ్రీ తన కుమార్తె అనుపమతో దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మర్యాదలతో ఆమెను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె తన కుమార్తెతో కలిసి అనివేటి మండపం వద్ద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
కానరాని ఎమ్మార్పీ విక్రయాలు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 16: అబ్కారీ విధానాన్ని మార్చామని సర్కారు చెప్పిన మాటల్లో నిజం లేదనడానికి విచ్చలవిడిగా బెల్టుషాపులే ఓ తార్కాణమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) ధ్వజమెత్తారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా గ్రామ స్థాయిలో ఎమ్మార్పీ అమలయ్యే దాఖలాలు కానరావడం లేదని ఆయన విమర్శించారు. గ్రామాల్లో వీధివీధిన బెల్టుషాపులు వెలసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో 230 షాపులకు లైసెన్సులు ఉన్నప్పటికీ గతంలో ఉన్న బెల్టుషాపుల్లో 95 శాతం ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లో లూజు విక్రయాలు బారుల్లో ఫుల్‌బాటిళ్లు మినహా చిన్నబాటిళ్లు అమ్మకూడదని నిబంధనలకు నీళ్లొదులుతున్నారని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీలకు విక్రయిస్తున్నా గ్రామ, మండల కేంద్రాల్లో ఇవేవీ కానరావడం లేదన్నారు. ఎమ్మార్పీ కంటే ఐదు నుంచి పది రూపాయల వరకు పెంచి విక్రయిస్తున్నారని ఆరోపించారు. బెల్టుషాపుల్లో అమాంతంగా 15 రూపాయల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారే తప్ప నిబంధనలు పాటించాలన్న ధ్యాస కొరవడడం విచారకరమన్నారు. అధిక ధరలకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు తెలుగుదేశం పార్టీ తరపున వినతిపత్రాన్ని అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించకుంటే గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేసి బెల్టుపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.
వైద్య సేవలకు అధిక ప్రాధాన్యం
హిరమండలం, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అటవీ శాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. ఆదివారం మండలంలోని చొర్లంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనాన్ని ఎన్ ఆర్ హెచ్ ఎం 40 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కార్పోరేట్ వైద్యం లభించిందన్నారు. 104,108 పథకాల వలన పేద, బడుగు వర్గాల వారికి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ధ్యేయంతో పలు అభివృద్ధి పథకాలు చేపడుతన్నామన్నారు. చొర్లంగి పిహెచ్‌సి సొంత భవనం నిర్మాణం వలన 20వేల జనాభాకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.
చొర్లంగికి ఎత్తిపోతల పథకానికి కృషి
చొర్లంగి పరిసర గ్రామాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం మంజూరుకు కృషిచేస్తున్నట్లు మంత్రి విజయరామరాజు తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గం పరిథిలో అధిక సంఖ్యలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశామన్నారు. చొర్లంగి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పిహెచ్‌సికి ప్రహరీగోడ, రహదారి నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని ఐటిడి ఎ పి ఒను కోరారు. ఐటిడి ఎ పి ఒ సునీల్ రాజ్‌కుమార్ , డి ఎం హెచ్ ఒ గీతాంజలి, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ ఎం.రాజగోపాలనాయుడు, తహశీల్దార్ డి.చంద్రశేఖర్, ఎంపిడి ఒ ఎ.శ్రీనాధస్వామి, వైద్యాధికారి డి.కిషోర్, ఎ ఇ సింహాచలం, మాజీ ఎంపిపి సలాన మోహనరావు, మాజీ సర్పంచ్ రాజులనాయుడు, ఐకెపి ఎపి ఎం రవిరాజు తదితరులు పాల్గొన్నారు.
విషజ్వరాలతో విలవిల
లావేరు, సెప్టెంబర్ 16: మండలంలో జ్వరాల తీవ్రత పలు గ్రామాలను వేధిస్తోంది. వరుస జ్వరాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి. మండలంలో అదపాక, భట్టుపాలెం, గుర్రాలపాలెం గ్రామాలలో 50 మంది వరకు జ్వరపీడుతులున్నారు. టైఫాయిడ్, మలేరియా బారిన పడి కన్నుతెరవక రోగులు మంచానికి అతుక్కుపోతున్నారు. అదపాక గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ, గోవింద, కెల్ల అసిరినాయుడు, లోలుగు సత్యం, ఆనంద్, గుడ్ల నర్సింగరావు, ఎం.రూప, నడిమింటి మల్లేశ్వరరావులు తీవ్రమైన జ్వరపీడితులుగా మారి విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. రక్త్ఫలికలు తగ్గడం తదితర కారణాలతో వేలాది రూపాయలు వీరు వెచ్చించాల్సి వచ్చింది. అలాగే అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబ వాసులు ముల్లు సూర్యనారాయణ, దమయంతి, జగ్గురోతు జ్యోతిప్రకాష్‌లు విషజ్వరాలతో మంచంపట్టారు. శివరామకృష్ణ జ్వరంతో విలవిల్లాడుతున్నారు. అదపాకలో మరో 25 మంది వరకు జ్వరం బారిన పడి అవస్థలు పడుతున్నారు. భట్టుపాలెం గ్రామానికి చెందిన వాయిబోయిన సాయి, రేగాన రమణ, రాజేశ్వరి, బంగారమ్మలతోపాటు మరో ఆరుగురు జ్వరాల బారిన పడ్డారు. గుర్రాలపాలెంకు చెందిన కె.శేఖర్‌తో పాటు మరో ఐదుగురు జ్వరపీడితులు ఉన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు సరిగా అందకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
కరణం మల్లేశ్వరి తల్లి మృతి
విశాఖపట్నం , సెప్టెంబర్ 16: ప్రముఖ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి మాతృమూర్తి కరణం శ్యామల మృతి చెందారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించి జాతికే గర్వకారణంగా నిలిచిన కరణం మల్లీశ్వరితో పాటు ముగ్గురు మహిళా లిఫ్టర్లు అయిన కరణం కృష్ణవేణి, కరణం కృష్ణకుమారి, కరణం కళ్యాణీలు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఎంతో శ్రమించారు. ఆమె గత నెల రోజులుగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని కేర్ హాస్పిటల్‌లో కన్నుమూసారు. ఆదివారం జరిగిన ఆమె అంత్యక్రియలకు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ, ఒలింపియన్ ఎం.వి. మాణిక్యాలు, అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కోదండరామయ్య, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యులు హాజరై సంతాపాన్ని ప్రకటించారు.
జనరిక్ మందులషాపు ప్రారంభానికి చర్యలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 16: జిల్లా ప్రజానీకానికి అందుబాటులో జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలపారు. 45వ ఇంజనీరుడేను పురస్కరించుకుని ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుబాటులో తక్కువ ధరలకు మందులు అందించడానికి జనరిక్ మందులషాపును ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా సోంపేట వద్ద రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావును ఆదేశించారు. గృహనిర్మాణ ఇంజనీరింగ్ సిబ్బంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. దీనిని స్పూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులంతా ఉత్సాహం చూపించాలని కోరారు. రెడ్‌క్రాస్ చైర్మెన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు వంద మంది గృహనిర్మాణ శాఖ సిబ్బంది, శ్రీకాకుళం వాసవీ క్లబ్ సభ్యులు కూడా సుమారు పదిమంది రక్తదాన శిభిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పిడి పి.శ్రీరాములు, ఆ శాఖ ఇంజనీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, వాసవీక్లబ్ ప్రతినిధులు ఎం.నాగేశ్వరరావు, పి.అప్పలరావు, ఎం.మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
కూర్మనాథుని సన్నిధిలో కలెక్టర్
గార, సెప్టెంబర్ 16: మండలం శ్రీకూర్మం లోని కూర్మనాథ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ కుటుంబీకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కూర్మనాథ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ దంపతులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ పట్నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అర్చకులు చామర్ల మురళి కృష్ణతో పాటు అర్చకులు కలెక్టర్‌కు పరివేట్టం చుట్టి స్వాగతించారు. ఆలయ బేడా మండపంలోని గోడలపై ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చిత్రాలు విశిష్టత, చారిత్రక కథనాన్ని అర్చకులు మురళికృష్ట వివరించారు. కూర్మనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసారు. అదేవిధంగా క్షేత్ర మహత్యాన్ని వివరించారు. కూర్మనాథుని సన్నిధిలో గల లక్ష్మీదేవికి విశేష పూజలు అనంతరం బేడా మండపంలో వీరికి అర్చకులు ఆశీర్వచనాలు పలికి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం క్షేత్రానికి ఆనుకొని టూరిజం నిధులతో నిర్మింపజేసిన డార్మెటరీస్‌ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనులు నిర్వహణ, ఇతరత్రా పలు అంశాలుపై ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ పట్నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు, అనంతరం కళింగపట్నం బీచ్‌లో కుటుంబీకులతో కాసేపు గడిపారు.
అగ్రికెమ్‌పై సహాయ నిరాకరణ
* పోరాట కమిటీ వెల్లడి
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 16: కాలుష్య భూతానికి కారణమైన నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమను శాశ్వతంగా మూసేందుకు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం చిలకపాలెం శివాలయంలో వారంతా సమావేశం నిర్వహించి పరిశ్రమ అవసరాలకు ట్యాంకర్ల ద్వారా తోడ్కొని వెళ్లే నీరును కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిసర గ్రామాల్లో కొంతమంది పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గుర్తించి వారి తీరుపై కరపత్రాలు ప్రచురిస్తామని స్పష్టం చేశారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వర్కర్స్, ఉద్యోగులు కూడా పోరాట కమిటీ పిలుపులకు అనుకూలంగా వ్యవహరించేలా అవగాహన పెంపొందిస్తామన్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి పరిశ్రమ లోపల సిసి రోడ్డు నిర్మాణాలు సాగిస్తున్నారని, వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలో భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద, మాజీ జెడ్పీటిసి సనపల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు ఎం.మురళీధర్‌బాబా, గట్టెం రాములు, గాడు నారాయణరావు, డొంక అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.