విజయనగరం , సెప్టెంబర్ 16: అక్కడ రాళ్ళను కదిపినా సంగీతంలో సప్తస్వరాలు పలుకుతాయన్నట్టు జిల్లలో ఏకార్యక్రమం తలపెట్టినా రాజకీయం కూడా ఒక భాగమే. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అయితే మాత్రం కాదు. ప్రస్తుత అధికార పక్షం పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాత్రం ఈ వరస కొనసాగుతోందట. మహాకవి గురజాడ స్వర్ణజయంతి ఉత్సవాల నిర్వహణను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని తలపెట్టినప్పటి నుంచి ఇదే కన్పిస్తోందంటూ గురజాడ అభిమానులు వాపోతున్నారు. విశ్వకవి రవీంద్రుని జయంత్సుత్సవాలను విశ్వవ్యాపితం చేసిన బెంగాల్ ప్రభుత్వం అట్టహాసంగా ఈవేడుకలను జరపడంతో పాటు అంతటి ఖ్యాతిని విశ్వకవికి చేకూర్చిపెట్టింది. ‘దేశమును ప్రేమించుకుమన్నా’.. అంటూ వ్యావహారికంలోనే సమాజ ప్రక్షాళనకు రచనలు చేసిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు 150వ జయంతిని అట్టహాసంగా చేయాలని సంకల్పించడం మహద్భాగ్యమే. జాతి గర్వించతగ్గ మహాకవి జయంతి వేడుకలను ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ పరంగా చేస్తూ అధికార పక్షానికి మాత్రమే అగ్రాసనం వేయడం రాజకీయం కాక మరేమిటంటూ మహాకవి అభిమానులు ముక్కును వేలేసుకుంటున్నారు. దీనిలో అధికార యంత్రాంగం పాత్రకూడా వారి మనసులను నొప్పిస్తోందట. గురజాడ జయంతి వేడుకల నిర్వహణ విషయంలో అధికారుల పాత్రను కూడా పరిమితం చేస్తూ అధికార పక్షం కర్రపెత్తనం చేస్తోందంటూ మహాకవి అభిమానులు కూడా వౌనముద్రకే పరిమితమయ్యారు. జయంతి వేడుకల నిర్వహణలో భాగంగా తలపెట్టిన ఏసమావేశంలోనూ విపక్షానికి కాని, సాంస్కృతిక సంస్థలకు కానీ కనీస ప్రాధాన్యత ఇవ్వలేదన్నది వీరి వాదన. అయితే అధికార పార్టీ చేపట్టే ఏకార్యక్రమమైనా రాజకీయ ముద్ర తప్పనిసరి అన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. జిల్లా ప్రజానీకం పండుగలా జరుపుకునే పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో సైతం అధికార పార్టీ రాజకీయాలను నెరపిన సందర్భాలు లేకపోలేదు. పూసపాటి వారి ఆడపడచు పైడితల్లి అమ్మవారి జాతరను తొలుత ఆవంశీయుల చేతుల మీదుగానే జరిగేవి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలతో ఈ ఉత్సవాల్లో సైతం మూడు రంగుల జెండాలను ప్రదర్శిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సందార్భలున్నాయి. మొత్తం మీద జిల్లాలో ఏకార్యక్రమం జరిపినా అది అధికార పార్టీ సొంత కార్యక్రమం మాదిరిగానే కొనసాగడం కొత్త సంప్రదాయానికి తెరతీస్తోందన్న వాదన మాత్రం విన్పిస్తోంది. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమాల్లో ఇటువంటి అవాంఛిత సంఘటనలు భవిష్యత్‌లో పలు ఇబ్బందికర పరిస్థితులకు దారితీయొచ్చన్నది శాంతి కాముకుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు.
అక్కడ రాళ్ళను కదిపినా సంగీతంలో సప్తస్వరాలు పలుకుతాయన్నట్టు
english title:
everthing politics
Date:
Monday, September 17, 2012