విజయనగరం , సెప్టెంబర్ 16: ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండాయి. దింతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో ఉభాలు వేయడం పూర్తికావడంతో పొలాల్లో పనుల నుండి గట్టేక్కినట్లు తెలుపుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతంగం విచారం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు వలన పూర్తిస్థాయిలో చెరువులు నిండి రైతులకు అశలను చిగురించాయి. దింతో రైతాంగం అంతా ఉభాల పనిలో లీనమయ్యారు. వర్షాలు సంవృద్ధిగా పడక ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వరినారు పెరుగుదల తగ్గి అధిక శాతం నాటనందున పూర్తిస్థాయిలో నారు సరిపోలేదు. వరినారు వచ్చినంత ఉభాలు జరిపి మిగిలిన భూమిని వదిలేశారు. ఉభాలు అన్ని గ్రామాలల్లో పూర్తి చేసుకుని పొలం పనులు నుండి ఒడ్డుకు చేరుకున్నామని రైతులు ధీమావ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆలస్యంగా పడినప్పటికి చెరువుల్లో నీరు ఉన్నందున పంటలు పండే అవకాశం ఉందంటున్నారు. నెల రోజులు తరువాత పోలాలను దున్నుకుని అపరాలను వేయుటకు సిద్ధమవుతున్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
అరకొరగా బస్సులు.. వేలాడుతూ ప్రయాణం
బొబ్బిలి, సెప్టెంబర్ 16: పరిమితికి మించి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపుల్లో వేలాడుతూ ప్రతీ రోజు ప్రయాణం చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కోమటిపల్లి, చింతాడ, పిరిడి, కారాడ, నారశింహునిపేట, తదతర ప్రాంతాలకు వెళ్లే రహదారులలో ప్రయాణీకులు వేలాడుతూ ప్రయాణం చేయడం కనిపిస్తోంది. పలు పర్యాయాలు కొంత మంది జారిపడి ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల కోమటిపల్లి సమీపంలో ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి ఇంజనీరింగ్ విద్యార్థి జారిపడి కాలు విరిగిన విషయం విదితమే. అయినప్పటికీ ప్రయాణికులు, అధికారులలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు అదనంగా బస్సులను నడపాలని పలు పర్యాయాలు ఆయా గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి అధిక లోడులతో వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.