విజయనగరం, సెప్టెంబర్ 16: వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర ధోరణులు పెరిగిపోతున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో అధికారుల వాదన విన్నవారికి నవ్వు పుట్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గిరిజన, మైదాన ప్రాంతాల్లో జ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా ఇవన్నీ సాధారణ మరణాలుగానే పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల మరణాలు, మైదాన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న కేసుల విషయంలో వైద్యాధికారుల స్పందన వేరేవిధంగా ఉంటోంది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థుల మరణాలు వారు ఇంటివద్ద ఉండగా జ్వరంతో బాధపడుతూ పాఠశాలలకు వచ్చిన తర్వాత తీవ్రత పెరిగి మరణిస్తున్నారంటూ ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. అయితే మైదాన ప్రాంతంలో చోటుచేసుకుంటున్న మరణాల విషయంలో కూడా వైద్యాధికారుల వాదన కూడా ఇలాగే ఉంది. డెంగ్యూ లక్షణాలతో మరణిస్తున్నట్టు వైద్యం చేసిన వైద్యులు చెప్తుంటే అవన్నీ సాధారణ మరణాలుగానే వివరణ ఇస్తున్నారు. వేపాడ మండలం జగ్గయ్యపేటలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ విశాఖలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరిశీలించిన వైద్యులు డెంగ్యూ లక్షణాలున్నట్టు పేర్కొన్నప్పటికీ స్థానిక వైద్యాధికారులు మాత్రం అవి సాధారణ జ్వరాలుగానే పరిగణిస్తున్నారు. శనివారం గ్రామంలో పర్యటించిన జిల్లా మలేరియా అధికారి కె.కృష్ణమాచార్యులు జిల్లా వ్యాప్తంగా 128 జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, వీరిలో 10 మందికి డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వీరికి కూడా డెంగీ పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదంటూ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉండగా గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో నమోదవుతున్న జ్వర కేసులను పరిశీలిస్తే ఇక్కడ వైద్యాధికారులు పనితీరు అర్ధం అవుతుంది. 2009లో 3.59 లక్షల మంది జ్వరపీపడుతులను పరీక్షించగా, 10 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. 2010లో 3.56 లక్షల మంది జ్వర పీడితుల్లో 10 డెంగీ కేసులు, 2011లో 4.05 లక్షల మంది జ్వర పీడితోల్లో 95 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 1.5 లక్షల మంది జ్వర పీడితుల్లో 10కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. కేవలం డెంగీ కేసులను మాత్రమే తీసుకుంటే వ్యాధి తీవ్రత అధికంగానే ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. ఇక మలేరియా జ్వర పీడితుల విషయం చెప్పనవసరం లేదు. నమోదవుతున్న కేసులన్నీ జ్వరాలు, మరణాలను సాధారణ సంఘటనలుగానే వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డెంగీ కేసుల విషయంలో పలువురు బాధితులు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడంతో స్థానిక వైద్యాధికారులు తమ తప్పు లేదంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు కనికట్టు మాని వాస్తవాలను తెలుసుకుని, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర ధోరణులు పెరిగిపోతున్నాయి
english title:
dengue ? where is it?
Date:
Monday, September 17, 2012