విజయనగరం, సెప్టెంబర్ 16: పట్టణంలో ఆర్.అండ్.బి.గెస్ట్‌హౌస్ రైతుబజారు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రైతుబజారు ప్రత్యేక అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎన్.గోపాలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం రైతుబజారును ఆకస్మీకంగా ఆయన తనిఖీ చేశారు. రైతుబజారు రికార్డులను పరిశీలించి, వినియోగదారులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుబజారులో ధరల వివరాలను గురించి ఆరా తీశారు. వినియోగదారులతో మాట్లాడుతూ కూరగాయల నాణ్యత, సౌకర్యాలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్.అండ్.బి.గెస్ట్‌హౌస్ రైతుబజారుకు అధిక సంఖ్యలో వినియోగదారులు వస్తున్నందున దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వినియోగదారులకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబజారు విస్తరణ గురించి జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ దృష్టికి తీసుకువెళతామన్నారు. రైతుబజారులో గోధుమ, గోధుమపిండి విక్రయించే ఆలోచన ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. రైతుబజారులో ఉన్న కిరాణా షాపులను కూడా తనిఖీ చేశారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతుబజారు ఎస్టేట్ అధికారి సిహెచ్.వి.సత్యనారాయణ (సతీష్)ను ఆదేశించారు. రైతుబజారులో సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిని సారించాలన్నారు. రైతుబజారులో తాజా కూరుగాయలను విక్రయిస్తున్నారని వినియోగదారులు చెప్పడంతో ప్రత్యేక అధికారి గోపాలనాయుడు సంతోషించారు. ధరల నియంత్రణ, తాజా కూరగాయలను విక్రయించడం, వినియోగదారులకు, రైతులకు ఎటువంటి అన్యాయంజరగకుండా చేసేందుకు ప్రభుత్వం రైతుబజార్లను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
పశుగణన ప్రారంభం
విజయనగరం, సెప్టెంబర్ 16: దేశ భవిష్యత్‌కు ఉపకరించే పశుగణనను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కోరారు. కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో ఆదివారం పశుగణన సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో ఆరులక్షల కుటుంబాలు ఉన్నాయని, అన్ని కుటుంబాల వద్దకు వెళ్లి పశుసంపద వివరాలను సేకరించాలని ఆదేశించారు. పశుగణన సర్వే కోసం 491మంది ఎన్యూమరేటర్లను నియమించామన్నారు. ఒక్కొక్క ఎన్యూమరేటర్ ప్రతి రోజు 50 నుంచి 60 కుటుంబాలను సందర్శించి సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చేనెల 15వ తేదీవ నాటికి సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. జిల్లాలో ఇది 19వ పశుగణన అన్నారు. నెలరోజులపాటు జరిగే ఈ సర్వేను ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో పశుసంపదకు సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్లకు అందించాలని ఆయన ప్రజలను కోరారు. జిల్లాలో పాడిపరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువులు ఉన్న కుటుంబాలు సగటున నెలకు నాలుగువేల రూపాయలు సంపాదిస్తున్నాయని తెలిపారు. పశుసంవర్థకశాఖ జాయింట్‌కలెక్టర్ శ్రీ్ధర్‌కుమార్, స్థానిక బహుళార్థక పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ నర్సింహులు, అసిస్టెండ్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.రమణ పాల్గొన్నారు.