హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేదీ ప్రత్యామ్నాయం కాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన 13 మంది మంత్రులు ఎఐసిసి అధ్యక్షురాలు, యుపిఎ చైర్‌పర్సన్ సోనియగాంధీకి సోమవారం లేఖ రాసారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్, కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎకె అంటోనితో పాటు, కేంద్ర మంత్రులు వాయిలార్ రవి, రాహుల్‌గాంధీకి పంపించారు. అయితే ఈ లేఖపై హైదరాబాద్ బ్రదర్స్‌గా పిలువబడే మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్ సంతకాలు చేయకపోవడం విశేషం. కాగా వీరిద్దరు నేరుగా అధిష్ఠానానికి లేఖ రాస్తామని చెప్పినట్టు మంత్రి బస్వరాజు సారయ్య మీడియాకు వివరించారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలనకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఒక్కటే పరిష్కారం తప్ప మరే ప్రత్యామ్నాయం వల్ల ప్రయోజనం లేదని వారు తమ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకుండా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజిగానీ, పదవులనుగానీ ఇవ్వనున్నట్టు మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని వారు ప్రస్తావిస్తూ, తెలంగాణ రాష్ట్రం తప్ప మరే ప్రత్యామ్నాయానికి ప్రజలు అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు.
సోనియాకు తెలంగాణ మంత్రుల లేఖ
english title:
telangana ministers
Date:
Tuesday, September 18, 2012