శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీవ్యాధి బారిన పడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్న రోగులను జిల్లా కేంద్రానికి డయాలసిస్ కోసం రప్పించడాన్ని కేంద్ర ఆరోగ్యబృందం తప్పుపట్టింది. కిడ్నీ రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవలందించాలని ఆదేశించింది. గత రెండురోజులుగా కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఎస్‌కె జైన్, హిమాన్సు మహాపాత్రో, ఎన్‌ఎస్ మాధూర్, డి త్రిప్తికన్నా, మనోజ్‌కుమార్‌తో కూడిన కేంద్ర బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాంజలి తదితరులతో కలిసి పర్యటించింది. కిడ్నీ బాధితులు, స్థానిక పెద్దలు పెద్దఎత్తున బృందం తీరును తప్పుపట్టారు. కిడ్నీ రోగులపై అధ్యయనం చేసిన కేంద్ర ఆరోగ్య బృంద సభ్యులు సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను కలిసి, తమ పర్యటన వివరాలను తెలియచేశారు. ఉద్దానం ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలను కలిశామని, కిడ్నీవ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యక్తులతో పాటు సాధారణ వ్యక్తుల నుండి రక్తపు నమూనాలను సేకరించామని చెప్పారు. వ్యాధి వ్యాప్తిలోనున్న గ్రామాలను, వ్యాప్తిలో లేని గ్రామాలను సందర్శించామని బృందం వివరించింది.
కుటుంబాలు వినియోగిస్తున్న నీరు, ఆహారపు అలవాట్లు, వంట చేసే విధానం గూర్చి అన్ని అంశాలలో వారి జీవన విధానాలను పరిశీలించామని పేర్కొన్నారు. ఎండుచేపల వినియోగం, వాటిలో ఉప్పుశాతం, అధికంగా పచ్చళ్లు వాడకంపై అధ్యయనం జరిపామన్నారు. ప్రజలు ఉపయోగిస్తున్న నీటి నమూనాలను సేకరించామన్నారు. అనేక కారణాల వలన వ్యాధి సంక్రమిస్తున్నట్టుగా అనుమానాలున్నాయన్నారు. అయితే ఈ సందర్భంగా డయాలసిస్ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని రోగుల చెప్పిన తీరు తీవ్రంగా కలచివేసిందన్నారు. వ్యవసాయంలో ఎండోసల్ఫేట్ వంటి మందుల వినియోగం అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఎండోసల్ఫేట్ ఏరియల్ స్ప్రే చేసేవారని, తద్వారా దుష్పరిణామాలు సంభవించాయన్నారు. ఆ ప్రాంతానికి అందుబాటులోని పలాస, సోంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలకు లేబ్‌లు అవసరమన్నారు. కిడ్నీ వ్యాధిపై సిబ్బందికి కొద్దిపాటి శిక్షణ కల్పించి వారిని ఆ ప్రాంతంలో నియమించడం వలన ప్రాథమిక పరీక్షలను నిర్వహించగలరని ఆరోగ్యబృందం సూచించింది. కాగా రిమ్స్ ఆసుపత్రి ఆవరణంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌకర్యాలను కేంద్ర ఆరోగ్య బృందం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేంద్రానికి మరిన్ని వౌళిక సౌకర్యాలు ఏర్పాటు చేసి కిడ్నీరోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. పలువురు రోగులతో వైద్య సేవల అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఉద్దానం కిడ్నీ బాధితులకు కేంద్ర బృందం పరామర్శ
english title:
central team
Date:
Tuesday, September 18, 2012