హైదరాబాద్, సెప్టెంబర్ 17: విపక్ష సభ్యులు నిరసనలు, నినాదాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా పరిస్థితిపై శాసనసభ సమావేశాల తొలి రోజు సోమవారం నాడు ఒక నోట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఘోరంగానే ఉందని అంగీకరించింది. గ్రామాల్లో పట్టణాల్లో కోత అనివార్యమని, విద్యుత్ పొదుపు చర్యలు పాటించడం ద్వారా పరిస్థితిని అధిగమించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. రానున్న కాలానికి మే 2016 వరకూ 880 మెగావాట్లా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఖరారు చేసినట్టు పేర్కొంది. 2014 మార్చినాటికి ఎపిజెన్‌కో, సెంట్రల్ జనరేషన్స్ స్టేషన్స్, ప్రైవేటు రంగంలో 6279 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించామని శాసనసభలో ఇచ్చిన నోట్‌లో పేర్కొంది. సదరన్ రీజియన్ గ్రిడ్‌ను కొత్త గ్రిడ్‌తో అనుసంథానం చేయడానికి 765 కెవి సబ్‌స్టేషన్లు, లైన్లు నిర్మాణాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేపడుతుందని, ఈ పనులు 2014 జనవరి నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుబాటులో ఉన్న పవన విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2017 నాటికి 5259 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రతిపాదించామని సిఎం పేర్కొన్నారు.
విద్యుత్ డిమండ్ రోజరోజుకూ పెరుగుతోందని, ప్రస్తుతం 264 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా, గత ఏడాదితో పోలిస్తే 8.2 శాతం ఇది అధికమని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం, గృహవినియోగదారుల నుండి విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, దానికి తోడు నైరుతిపవనాలు రాకపోవడం వల్ల విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. డిస్కామ్‌లు ప్రతి రోజు 49 మిలియన్ యూనిట్లు తగ్గుదలతో 215 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నాయని, ఏప్రిల్ 2012 నుండి ఆగస్టు 2012 వరకూ డిస్కాంలు 40,148 మిలియన్ యూనిట్లు సరఫరా చేయాల్సి ఉండగా 13.9 శాతం తగ్గుదలతో 34,485 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాయని నివేదికలో పేర్కొన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి ప్రతిరోజు 38 మి.యూ తగ్గిపోవడం, కెజి డి-6 నుండి గ్యాస్ సరఫరా తగ్గడంతో ఈ ఏడాది గత నెలలో 15 మి.యూ తక్కువగా ఉండటం, ఒరిస్సా బొగ్గు గనుల నుండి వచ్చిన బొగ్గులో నాణ్యత లేకపోవడం, తడిసిపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి 710 మెగావాట్లు తగ్గిందని అన్నారు. గత ఏడాది నుండి మే 2012 వరకూ విద్యుత్ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు చర్యలు తీసుకుందని అన్నారు. ఎన్‌టిపిసి జజ్జర్ ప్రాజెక్టు నుండి వచ్చే ఏడాది మే వరకూ వంద మెగావాట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అలాగే దక్షిణ రీజనల్ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ నుండి ఎవరికీ కేటాయించని 500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు కనీసం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని అన్నారు. అలాగే పట్టణాలు, మండల హెడ్‌క్వార్టర్లులో పగటిపూట లోడ్ రిలీఫ్‌ను పాటించడం జరుగుతుందని అన్నారు. పరిశ్రమలకు 40 శాతం లోడ్ రిలీఫ్ ఇవ్వడం జరిగిందని, గ్రిడ్ సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ రిలీఫ్ తప్పనిసరి అవుతుందని అన్నారు.
రానున్న కాలానికి 880 మెగావాట్ల కొనుగోలు * ఉత్పత్తి సామర్థ్యం 6279 మె.వాకు పెంపు నాలుగేళ్లలో 20వేల కోట్లతో వౌలిక సదుపాయాలు * శాసనసభకు ప్రభుత్వం నివేదిక
english title:
power cut unavoidable
Date:
Tuesday, September 18, 2012