శ్రీశైలం, సెప్టెంబర్ 17: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి జలాశయం నీటిమట్టం 871 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 191.66 టిఎంసిలుగా నమోదైంది. ఎగువ జూరాల నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. రెండు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 8.157 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా దిగువకు 51,845 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 3,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడనద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో చెదురు మదురు వర్షాలు పడతాయి. జార్ఘండ్ పరిధిలో ఉపరితల ఆవర్తనం ఉంది. విశాఖ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం నాలుగు సెంటీమీటర్లు కాగా, వాల్తేరులో రెండు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.