హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉచిత విద్యుత్ కోసం రైతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి పరిశ్రమలను రక్షించాలని పారిశ్రామికవేత్తలు చేస్తున్న ఆందోళనలతో విద్యుత్ సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ప్రకృతి సహకరించకపోయినా అందుబాటులో ఉన్న విద్యుత్‌ను హేతుబద్ధంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు ట్రాన్స్‌కో, డిస్కాంలు సరఫరా చేస్తున్నా అధికార, విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి మంగళవారం విద్యుత్‌పై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించనున్నారు. జల విద్యుత్ ఉత్పాదన ఆశాజనకంగా లేకపోవడం, థర్మల్ విద్యుత్‌పై వత్తిడి పెరగడం, గ్యాస్ కేటాయింపులు గణనీయంగా తగ్గిపోవడంతో వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో సమస్యలెదురవుతున్నాయి.
తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు నాణ్యమైన విద్యుత్ కోసం ధర్నాలు చేస్తున్నారు. మరో వైపు చాలినంత విద్యుత్ లేక పరిశ్రమలను మూసివేయాల్సి వస్తోందంటూ ఫ్యాప్సియా ఆధ్వర్యంలో ఎంఎంరెడ్డి, ఎపికె రెడ్డి నాయకత్వంలో పారిశ్రామికవేత్తలు చేపట్టిన ఆందోళన ఆరవ రోజుకు చేరుకుంది. విద్యుత్ కొరతతో రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ను ఎటువంటి అవరోధాలు కల్పించకుండా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విద్యుత్ శాఖాధికారులను ఆదేశించినా, చాలినంత విద్యుత్ లేక డిస్కాంలు సతమతమవుతున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరా చేసినా, నాణ్యమైన వ్యవసాయ పంపుసెట్లను అమర్చుకోవడంలో రైతులు విఫల కావడంతో కరెటు విపరీతంగా వినిమయమవుతోంది. ఉచిత విద్యుత్ స్కీంను ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు గడిచింది. ఇంతవరకు సబ్సిడీ కింద 37వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇందులో వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్‌కు పదివేల కోట్ల రూపాయలకుపైగా వ్యయం చేశారు. 2011-12 సంవత్సరంలో దాదాపు 20వేలకు పైగా మిలియన్ యూనిట్లు ఉచిత విద్యుత్ కోటాలో ఖర్చయింది. డిస్కాంలు 85 వేల ఎంయు విద్యుత్‌ను సరఫరా చేస్తే 20వేల ఎంయు విద్యుత్ ఉచితం కోటాలో సరఫరా చేశారు. రబీ, ఖరీఫ్ సీజన్‌లో రోజుకు సగటున 62 ఎంయు ఉచిత విద్యుత్ కోటాలో వినిమయమవుతోంది. ప్రామాణికమైన పంపుసెట్లు వాడితే కనీసం రోజుకు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాలో భాగంగా ట్రాన్స్‌కో 1154.80 కోట్ల రూపాయలతో హెచ్‌విడిఎస్ స్కీంను చేపట్టింది. జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జైకా)సహాయంతో ఈ స్కీంను అమలు చేయనున్నారు. మన రాష్ట్రంలో 6.97 లక్షల వ్యవసాయ పపుసెట్లు హెచ్‌విడిఎస్ కవరేజిలో ఉన్నాయి. ఈ పంపుసెట్ల వద్ద పంపిణీ నష్టాలు 25 నుంచి 10 శాతానికి తగ్గినట్లు ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. 2004-05లో 9వేల ఎంయును ఉచిత విద్యుత్ కింద పంపిణీ చేశారు. దీనికి ప్రభుత్వం సబ్సిడీగా 614 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. 2005-06లో 12వేల ఎంయుకు 878 కోట్ల రూపాయల సబ్సిడీని, 2006-07లో 15538 ఎంయుకు 912 కోట్ల సబ్సిడీని, 2007-08లో 14359 ఎంయుకు 736 కోట్ల రూపాయల సబ్సిడీని, 2008-09లో 15,881 ఎంయుకు 734 కోట్ల సబ్సిడీని, 2009-10లో 16511 ఎంయుగు 2,146 కోట్ల రూపాయల సబ్సిడీని, 2010-11లో 19వేల ఎంయుకు 2066 కోట్ల రూపాయల సబ్సిడీని, 2011-12లో 20వేల ఎంయుకు 2200 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం విద్యుత్ సబ్సిడీకి 5530 కోట్ల రూపాయలను కేటాయిస్తే, ఇందులో ఉచిత విద్యుత్‌కు 3622 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి సగటున రోజూ 900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లు పారిశ్రామివర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమలకు సాలీనా 20 వేల ఎంయు విద్యుత్‌ను డిస్కాంలు సరఫరా చేస్తున్నాయి. నెలకు 12 రోజులు పవర్‌హాలిడేస్, ప్రతి రోజూ సాయంత్రం పీక్ వేళల్లో నాలుగు గంటల విద్యుత్ కోతతో పాటు విద్యుత్ సరఫరాపై ఏపిఇఆర్‌సి ఆంక్షలు విధించడంతో పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం డిమాండ్‌కు, సరఫరాకు మధ్య సగటున రోజూ 70 ఎంయు వరకు విద్యుత్ లోటు ఉంది.
విద్యుత్‌పై నేడు ప్రభుత్వం సమీక్ష
english title:
energy department
Date:
Tuesday, September 18, 2012