విశాఖపట్నం, సెప్టెంబర్ 17: ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు రంగాల్లో రాణిస్తారని, కానీ టి సుబ్బరామిరెడ్డి అనేక రంగాల్లో రాణించి ప్రతిభ చాటుకున్నారని రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు. సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా విశాఖలో సోమవారం రాత్రి జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయ, వ్యాపార, ఆధ్యాత్మిక కళారంగాల్లో రాణించారన్నారు. టిఎస్సార్‌తో తనకు పాతికేళ్ళుగా పరిచయం ఉందని, ఆయన అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నారన్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు తీవ్రంగా పరిగణించకుండా వదిలేస్తేనే పరిష్కారమవుతుందని టిఎస్సార్ చెబుతుంటారని, దానిని అంతా పాటించాలన్నారు. కళాకారులను పోషించి, ఆత్మ సంతృప్తిని పొందడంలో ఆనందం కేవలం ఆయనకే తెలుసునన్నారు.
ఈ వేదికపై అనేక మంది కళాకారులు, గాయనీగాయకులు మనస్సు విప్పి మాట్లాడుకున్నారని, అది తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రతి పుట్టినరోజున ఆయన సర్వమత గురువులను సన్మానించి పూజించడం ఆయన దేశభక్తి,సర్వమత సౌభాతృత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన సేవలు విశాఖ ప్రజలకు ఎంతైనా అవసరమన్నారు. సినీ హాస్యనటుడు బ్రహ్మనందం మాట్లాడుతూ ఆయన శివనామస్మరణతో సభాసదులను అలరించారని, ఎంతో అథ్యాత్మిక దీక్ష ఉంటే తప్ప అది సాధ్యంకాదన్నారు. బ్రహ్మానందం తన హాస్యపుజల్లులతో సభికులను నవ్వించారు.
జానకికి విశ్వవిఖ్యాత గానకోకిల బిరుదు
ఈ సందర్భంగా ప్రముఖ గాయని ఎస్ జానకికి విశ్వవిఖ్యాత గాన కోకిల బిరుదు ప్రదానం చేశారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, తోట నరసింహం, ఎంపిలు కెవిపి రామచంద్రరావు, నంది ఎల్లయ్య, ఏఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు జానకిని పూలమాలలు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. వీణ, అమ్మవారి లోహ విగ్రహం, ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం వీరంతా సుబ్బరామిరెడ్డిని సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాలుగు దశాబ్ధాల కాలంగా నిర్వహిస్తున్న పలు సామాజిక, ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి, బ్రహ్మానందం, వాణిశ్రీ, నగ్మాలను సుబ్బరామిరెడ్డి ఘనంగా సత్కరించారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ 34 ఏళ్ళుగా విశాఖ ప్రగతికి కృషి చేస్తున్నానన్నారు. సామాజిక సేవ లక్ష్యంగా నగరంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. సర్వ ధర్మ సంభావన సమ్మేళన్‌లో భాగంగా ముక్కాముల క్షేత్రం పీఠాధిపతి శ్రీధర్‌స్వామిజీ, మదీనాకు చెందిన వౌలానా మహ్మాద్ అబ్దుర్ రెహ్మాన్ ఖాన్ ఖాదర్, ఫాదర్ జాకబ్, గురుద్వార సత్స సంఘట్ ప్రధాన అధిపతి కుల్‌దీప్ సింగ్‌జీ పాల్గొని టిఎస్సార్‌కు ఆశీస్సులు అందజేశారు. (చిత్రం) టిఎస్సార్ జన్మదినోత్సవం సందర్భంగా గాయని జానకికి విశ్వవిఖ్యాత గాన కోకిల పురస్కార ప్రదానం
సుబ్బరామిరెడ్డి అనేక రంగాల్లో రాణించి ప్రతిభ చాటుకున్నారని చిరంజీవి అన్నారు
english title:
janaki felicitated
Date:
Tuesday, September 18, 2012