భారతీయ రైల్వేలో తొలి డీజిల్ ఇంజన్ డ్రైవర్‌గా ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన ముంతాజ్ కాజీ గృహిణిగా ఇంటి బాధ్యతలనూ నిర్వహిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది. డీజిల్ ఇంజన్ నడుపుతున్న తొలి మహిళగా ఈమె ఘనతను 1995లో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’ ప్రపంచానికి చాటి చెప్పింది. విద్యుత్, డీజిల్ ఇంజన్లను నడపడంలోనూ ముంతాజ్ తన ప్రతిభను చాటుకోవడం విశేషం. భారతీయ రైల్వేలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి 1989లో చేసిన మార్పులు ఈమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పాయి. తదేక దీక్షతో చదివి రాత, వౌఖిక పరీక్షల్లో ముంతాజ్ అద్భుత ప్రతిభ చూపి రైల్వేలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగ బాధ్యతల్లో ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత రద్దీ ప్రాంతమైన ముంబైలో ఉంటూ లోకల్ ట్రెయిన్లను సమర్థవంతంగా నడుపుతోంది.
ముంబైలో పుట్టి పెరిగిన ముంతాజ్ జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను చవిచూసినప్పటికీ ఏనాడూ నిరాశ చెందలేదు. ఆశావహ దృక్పథంతో జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనతో ముందుకు దూసుకుపోయింది. ముంబైలోని సేఠ్ ఆనందిలాల్ పొద్దార్ హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌సిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత రైల్వేలో ‘మోటార్‌మేన్’ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ప్లస్ టూ చదువు పూర్తయిన తర్వాత 1991లో ‘మోటార్‌మేన్’ ఉద్యోగానికి ఎంపికైంది. అయితే- ఆ ఉద్యోగంలో ముంతాజ్ చేరే విషయాన్ని ఆమె తండ్రి వ్యతరేకించారు. చర్చిగేట్ రైల్వే శాఖలో ట్రంక్ సూపరింటెండెంటుగా పనిచేస్తున్న ముంతాజ్ తండ్రి ఎ.ఐ. కతావాలాకు తన కుమార్తె మంచి ఉద్యోగం చేయాలని ఆశించేవారు. కఠినతరమైన ఉద్యోగంలో చేరే బదులు మంచి కోర్సులు పూర్తి చేయాలని ఆయన తన కుమార్తెపై వత్తిడి చేసేవారు. ఆయన స్నేహితులు మాత్రం రైల్వేశాఖలో ముంతాజ్ చేరాలని ప్రోత్సహించారు. స్నేహితులు పలు విధాలుగా నచ్చచెప్పడంతో చివరకు కతావాలా కూడా ఒప్పుకుని రైల్వేశాఖలో ముంతాజ్ చేరేందుకు అనుమతించారు. ‘ఉద్యోగ నిర్వహణలో నా కుమార్తె సాధించిన విజయాలకు నేనేంతో గర్వపడుతున్నా.. ఆమె మా కుటుంబ పరిస్థితులనే మార్చి వేసింది.. ఆమె సహకారంతోనే ముంబై మహానగరంలో సొంత ఇల్లు సమకూరింది.. నా ఇద్దరు కుమారులు ఇంతియాజ్, ఫెరోజ్ బాగా చదువుకునే అవకాశం కలిగింది..’- అని కతావాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ ఇచ్చిన ప్రోత్సాహంతో కుమారులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి కెనడాలో ఉంటున్నారని ఆయన గర్వంగా చెబుతుంటారు.
ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ముం తాజ్ తన కుటుంబాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దింది. మహారాష్టల్రోని నందూర్బార్ జిల్లాకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ మసూద్ కాజాను ముంతాజ్ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అహ్మద్ (8), ఫతీన్ (4) సంతానం. గృహిణిగా, పిల్లల సంరక్షణను చూసే తల్లిగా ముం తాజ్ ఎంతగానో సేవలు చేస్తుందని ఆమె భర్త మసూద్ చెబుతుంటారు. పిల్లలను మరింత శ్రద్ధగా పెంచాలన్న ఉద్దేశంతో ఆమె పదోన్నతిని సైతం వదులుకునేందుకు సిద్ధపడిందని మసూద్ తెలిపారు. భారతీయ రైల్వేపై బిబిసి ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో ముంతాజ్ ఘనతను ప్రముఖంగా పేర్కొనడం ఎప్పటికీ మరచిపోలేనని ఆయన చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందినా ముంతాజ్‌లో గర్వం ఏ మాత్రం లేదని, స్నేహానికి ఆమె ఎంతో విలువ ఇస్తుందని సెంట్రల్ రైల్వేలో తొలి మహిళా స్టేషన్ మాస్టర్ అయిన మమతా కులకర్ణి అంటున్నారు. కాగా, తన ఇద్దరు పిల్లలను బాగా చదివిస్తున్నానని, జీవితంలో అన్ని విధాలా వారు ముందంజలో ఉండాలన్నదే తన నిరంతర తపన అని ముంతాజ్ అంటోంది. కుటుంబం కన్నా గృహిణి కోరుకునేది ఏమీ ఉండదని, మాతృత్వంలోని మమకారం ఎంతో గొప్పదని చెబుతున్న ఈమె మిగతా ఉద్యోగులకూ స్ఫూర్తిదాతగా నిలిచింది.
భారతీయ రైల్వేలో తొలి డీజిల్ ఇంజన్ డ్రైవర్‌గా ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన ముంతాజ్ కాజీ గృహిణిగా ఇంటి బాధ్యతలనూ నిర్వహిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది.
english title:
engin
Date:
Wednesday, September 26, 2012