
‘ధనమూలమిదం జగత్’-అని అందరికీ తెలుసు. సమా జంలో ఘోరాలూ, నేరాలూ ఇంత ఇదిగా జరిగిపోవడానికీ ఈ ధనమే కారణం అని తేలినప్పుడు, దేవుడు సృష్టించిన మనిషి కన్నా మనిషి సృష్టించిన డబ్బుకి ఎంత విలువ వుందో? అని ఆశ్చర్యం వేస్తుంది. కొందరు డబ్బుకోసం ఎన్ని విధాలా గడ్డి తింటున్నారో అని అవాక్కయిపోతున్నాం. ఎన్నో స్కాములు. పెద్ద పెద్ద విద్యావంతులు, మంచి ఉద్యోగంలోనూ హోదాలోనూ ఉన్న వాళ్లూ, అష్టకష్టాల్లో వున్న మధ్యతరగతి కుటుంబీకులూ, పూటకి గతిలేని నిరుపేదలూ, బిచ్చగాళ్లూ అందరికీ అంత ఆశ డబ్బంటే! ఎలాగైనా డబ్బు సంపాదించాలి. అదీ- అతి స్వల్పకాలంలో లక్షలు గడించాలి. ఈ కోవలోకి చెందినవే నేడు జరుగుతున్న భ్రూణహత్యలు కూడా. లక్షలూ కోట్లు వున్న కుటుంబాలలోనివాళ్లు ఆడపిల్ల పుడితే వాళ్ల కోట్లలో కొంత డబ్బు కూతురి పెళ్లికి కట్నంగా కరిగిపోతుందని వద్దనుకుంటున్నారు. అందుకే ఆధునిక విజ్ఞానంతో సంపాదించిన తెలివితేటలతో ఆడపిల్లలని తెలీగానే, ‘అబార్షన్’ అంటున్నారు. ‘లా’ ప్రకారం అది చట్టబద్ధం కాదని వాళ్ళకీ తెలుసు. డాక్టర్లకీ తెలుసు. కాస్త లకారాలలో ఆశ చూపించగానే, డాక్టర్లూ ఓకే అని ‘అబార్షన్’లు గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళతో గొడవ లేదు. వాళ్లు పరువుకోసం పడి చస్తారు, పాపభీతి ఎక్కువ. పూజలూ, పునస్కారాలు అంటూ గడిపేస్తారు. ‘ఖర్మ’ సిద్ధాంతాన్ని నమ్మడంతో, వాళ్లు ఏ కష్టాన్నైనా, ఎన్ని కన్నీళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వాళ్లూ కాస్త పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడుతున్నారు. ఇంటికొకరూ ఇద్దరూ అమెరికాలో వుండడంవల్ల, డాలర్లు రూపాయిల్లో కళ్లముందు కదలాడ్డంవల్ల ఆర్థిక వెసులుబాటు పెరగడంతో, హోదా పెంచుకుని, మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. దాంతో మగ పిల్లాడు ప్లస్, ఆడపిల్ల మైనస్- అనే లెక్కలు వాళ్ళకూ సోకి, ఆ వ్యవహార శైలినే పాటిస్తూ ‘ఆడపిల్ల బాబోయ్.. బోలెడు కట్నాలూ కానుకలూ సమర్పిస్తేగానీ గడపదాటదు. తరవాత పురుళ్లూ పుణ్యాలూ, ఇవన్నీ సంపాదించినదంతా హారతి పట్టేస్తుంద’ని అంటున్నారు. ఇలా ఆలోచించడం చాలా ప్రమాదకరమైన, ఘోరమైన నేరం. ఇప్పటికే, మన జనాభా లెక్కల్లో ప్రతీ వెయ్యిమంది మగాళ్లకి తొమ్మిది వందల వరకూ ఆడవాళ్లుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఆడపిల్లల సంఖ్య మరీ తగ్గిపోతుంది! అది మరో రకమైన సామజిక పరిస్థితికి దారితీస్తుంది. సమస్యకి సరైన పరిష్కారాన్ని ఆలోచించాలే కానీ, చంపేసి ఆనందించడం దారుణం కాదూ?
వివాహాది కార్యక్రమాలలో మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటే, ఈ భ్రూణహత్యలని అరికట్టడం అసాధ్యమేమీ కాదు. వీటన్నిటికీ ఎంత పోరాటం జరిగినా ఫలితాలు కనిపించడం లేదు. ఆడవాళ్ల వల్లే ఈ పని సాధ్యమవుతుంది. భర్త, అత్తమామలు ఎవరు నచ్చచెప్పినా ఆజ్ఞాపించినా, ప్రాణం పోయినా సరే భ్రూణహత్యలకు మాత్రం ఒప్పుకోనని స్ర్తి పోరాడాలి. ఆడవాళ్లూ అన్ని రంగాలలో దూసుకుపోతున్నట్టే, ఈ విషయంలోనూ ముందే వుండండి! విజయం మనదే!