గాలే, సెప్టెంబర్ 27: మహిళల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఇందుకు సమాధానంగా బరిలోకి దిగిన ఆసీస్ 17.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. మెగ్ లానింగ్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జెస్ కామరాన్ అజేయంగా 36 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ ఇన్నింగ్స్‌లో పూనమ్ రావత్ 21 పరుగులతో టాప్ స్కోరర్ కావడం మిగతా బ్యాట్స్ ఉమెన్ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నది. మూడు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ ఎరిన్ ఓస్బర్న్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పాక్ చిత్తు..
మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొన్న పాకిస్తాన్ 43 పరుగుల భారీ తేతాతో చిత్తయింది. లారా మార్ష్ (54), కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ (45) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 133 పరుగులు సాధించింది. పాక్ బౌలర్ సనా మీర్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.4 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. జవేరియా ఖాన్ (23) తప్ప మిగతా క్రీడాకారిణుల్లో ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ హోలీ కొల్విన్ 3.4 ఓవర్లలో తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టింది.
మహిళల టి-20 ప్రపంచ కప్
english title:
a
Date:
Friday, September 28, 2012