ముంబయి, సెప్టెంబర్ 27: ఊహకందని నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సంప్రదాయాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మొహిందర్ అమర్‌నాథ్‌ను ఎంపిక చేస్తారా లేక రోజర్ బిన్నీని నియమిస్తారా అని అంతా ఆసక్తి కనబరచిన నేపథ్యంలో అసలు చర్చల్లో లేని మాజీ టెస్టు క్రికెటర్ సందీప్ పాటిల్‌ను కృష్ణమాచారి శ్రీకాంత్ వారసుడిగా ఎంపిక చేసి తనకెవరూ సాటిరారని బోర్డు మరోసారి నిరూపించింది. గురువారం జరిగిన బోర్డు 83వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎమ్)లో సెలెక్టర్లుగా రోజర్ బిన్నీ (సౌత్ జోన్), విక్రమ్ రాథోడ్ (నార్త్ జోన్), సాబా కరీం (ఈస్ట్ జోన్), రాజీందర్ సింగ్ హాన్స్ (సెంట్రల్ జోన్) ఎంపికయ్యారు. సెలెక్షన్ ప్యానెల్‌లో అమర్‌నాథ్‌కు చోటు కూడా దక్కక పోవడం గమనార్హం. దీంతో సెలెక్టర్‌గా అతని పదవీకాలం సంవత్సరానికే ముగిసింది. నార్త్ జోన్‌లోని మూడు సంఘాలు అమర్‌నాథ్‌ను మళ్లీ ఎంపికచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. వెస్ట్‌జోన్ నుండి అభయ్ కురువిల్లాకు బదులు, సందీప్ పాటిల్, ఈస్ట్ జోన్ నుండి సాబా కరీంను ఎంపిక చేయడం మాత్రం ఆశ్చర్యపరిచే నిర్ణయమే. కాగా, భారత్ తరఫున సందీప్ పాటిల్ 29 టెస్టుల్లో 1,588 పరుగులు, 45 వనే్డల్లో 1,005 పరుగులు చేశాడు. రిటైరయ్యాక భారత్ ‘ఎ’ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత కెన్యా కోచ్‌గా ప్రపంచ కప్‌లో ఆ జట్టును సెమీస్‌కు చేర్చి సంచలనం సృష్టించాడు. అయితే, బోర్డును ధిక్కరించి నిర్వహించిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)లో ముంబయి చాంప్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 2009లో ఐసిఎల్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. మరో సెలెక్టర్ బిన్నీ 1979 నుండి 87 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఈ ఆల్‌రౌండర్ 27 టెస్టుల్లో 47 వికెట్లు, 72 వనే్డల్లో 77 వికెట్లు నేలకూల్చాడు. 1983 ప్రపంచ కప్‌లో భారత్ తరుఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో గోవా, కర్నాటక తరఫున ఆడాడు. కాగా, భారత జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ ఎంపికయ్యాడు. సీనియర్ సెలెక్టర్లకు అందించే వేతనాన్ని 40 లక్షల రూపాయల నుండి 60 లక్షలకు, జూనియర్ సెలెక్టర్లకు 20 లక్షల నుండి 40 లక్షలకు పెంచాలని ఎజిఎమ్ నిర్ణయించింది. పదవీకాలం ముగిసిన సెలెక్షన్ ప్యానెల్‌లో శ్రీకాంత్, అమర్‌నాథ్, నరేంద్ర హిర్వాణీ, సురేంద్ర భవే, రాజా వెంకట్ ఉన్నారు.
కొత్త రూపునివ్వాలనుకున్నాం: శ్రీనివాసన్
మాజీ సెలెక్టర్ అమర్‌నాథ్‌కు ఉద్వాసన పలకడానికి గల కారణాలను తెలపడానికి బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ నిరాకరించాడు. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడలేననీ, సెలెక్షన్ కమిటీకి కొత్తరూపును ఇవ్వాలని బోర్డు సభ్యులు భావించారని అతను పేర్కొన్నాడు. సెలెక్టర్లను గరిష్టంగా నాలుగేళ్లు కొనసాగించ వచ్చని అన్నాడు. అయితే, ప్రతీ సంవత్సరం పునర్నియమించాల్సి ఉంటుందని అతను తెలిపాడు. చర్చల ద్వారానే సెలెక్షన్ కమిటీని నియమిస్తామని చెప్పాడు. ఈ నిర్ణయం గురువారం తీసుకుంది కాదనీ, కొంత కాలంగా ఈ ప్రక్రియ కొనసాగిందని వెల్లడించాడు. బోర్డులో ఉన్న 30 మంది సభ్యుల మధ్య చర్చలు జరిగాయని తెలిపాడు. తుది నిర్ణయం మాత్రమే గురువారం తీసుకున్నామని శ్రీనివాసన్ చెప్పాడు.
అమర్‌నాథ్‌కు మొండిచేయిశబిసిసిఐ సంచలన నిర్ణయం
english title:
s
Date:
Friday, September 28, 2012