Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఘర్షణలకు కారణమైన వారిపై రౌడీషీట్స్

$
0
0

నంద్యాలటౌన్, అక్టోబర్ 10: పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌లో జరిగిన ఘర్షణలు ఇరువురి మధ్య మాత్రమేనని... ఇవి వ్యక్తిగత కక్షలే తప్ప ఇరు వర్గాలకు సంబంధించిన ఘర్షణలు కావని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సాయంత్రం విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంగళవారం రాత్రి నుంచి జరుగుతున్న ఘర్షణలకు కారణమైన ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అల్లర్లకు కారణం సంఘ విద్రోహుల చర్యగా ఆయన అన్నారు. ముఖ్యంగా అల్లర్లకు కారణమైన పెద్ద మార్కెట్‌ను వన్‌టౌన్ నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. గతంలో కూడా అల్లర్లు జరిగాయన్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. సాధారణ స్థితి వచ్చే వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా గురువారం కూడా మార్కెట్‌ను బంద్ చేయిస్తున్నట్లు చెప్పారు. రెచ్చగొట్టే అల్లరిమూకలను గుర్తించడం జరిగిందన్నారు. కేవలం ఓల్డ్‌టౌన్‌కే పరిమితమైన అల్లర్లను అదుపుచేశామన్నారు.

6వ విడత
భూపంపిణీకి శ్రీకారం చుట్టాలి
కర్నూలు, అక్టోబర్ 10: నవంబర్ 1 నుండి ఆరవ విడత భూపంపిణీకి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో రెవెన్యూ అంశాలపై అన్ని మండల తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపంపిణీకి ఆర్‌డిఓలు, మండల తహశీల్దార్లు సిద్ధంగా వుండాలని ఆదేశించారు. హైదరాబాదులో జరిగే జాయింట్ కలెక్టర్ల సమావేశానికి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని తెలిపారు. మండలాల వారీగా గుర్తించిన బోగస్ పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను త్వరగా పంపాలన్నారు. అలాగే ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్ భూములు దురాక్రమణకు గురైన వాటిని గుర్తించి సంబంధిత ఆస్తులను స్వాధీనం చేసుకోనేందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి రిజిస్ట్రేషన్ అయిన వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, శ్మశానవాటికిల స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రహారీ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించిన వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకుంటూ నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై వుందన్నారు. మీసేవా, ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న సేవలను మెరుగుపరిచి అర్జీదారుడు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు త్వరిగతిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నంద్యాల, ఆదోని ఆర్డీఓలు శంకర్, రాంసుందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఎఓ సంతప్‌కుమార్, అన్ని మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి : బైరెడ్డి
ఉయ్యాలవాడ, అక్టోబర్ 10: రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడివుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పాదయాత్రలో భాగంగా మండలంలోని అల్లూరు, మాయలూరు గ్రామాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బైరెడ్డి పాదయాత్రను పురస్కరించుకుని పార్టీలకతీతంగా అల్లూరు ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56 ఏళ్ల సమైక్యాంద్ర పాలనలో ఎంతో నష్టపోయామని, కర్నూలు రాజధానిగా వుంటే ఈ ప్రాంతం పంజాగుట్ట సెంటర్‌లా వుండేదని అన్నారు. రాయలసీమ అన్ని విధాలా వెనుకబడి వుందని జస్టిస్ శ్రీ క్రిష్ణ కమిటీ నిర్ధారించిందని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, రాయలసీమలో వున్న ఖనిజ సంపద లూటి చేసి ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్నా నోరు మూసుకుని కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ మన ఆస్తి అని, దాని ద్వారా రాయలసీమకు రావాల్సిన నీరు పైన తెలంగాణ, కింద కోస్తాకు అందుతున్నాయే తప్ప మనకు కరువైందన్నారు. బ్రజేజ్ కుమార్ కమిటీ ముందు మన వాదనలు వినిపించినా మన గోడు వినేవారు కరువయ్యారన్న బాధను వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే రాయలసీమకు ప్రత్యేక స్థానం వుందని, శ్రీక్రిష్ణ దేవరాయులు పాలించిన సీమను కొంత మంది స్వార్థపరులు అపఖ్యాతి పాలుజేస్తున్నారని అన్నారు. ఈ పాదయాత్రలో బివిప్రసాద్‌రెడ్డి, కుందూ పోరాట సమితి కన్వీనర్ కామినివేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ రైతు సంఘీభావ కమిటీ కన్వీనర్ జీవీసుధాకర్‌రెడ్డి, ఆరికట్లభాస్కర్‌రెడ్డి, కూలూరురామక్రిష్ణారెడ్డి, బోరెడ్డి ఓబుళరెడ్డి భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
16 నుంచి ఆదోనిలో బాబు పాదయాత్ర
ఆదోనిటౌన్, అక్టోబర్ 10: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలో ఈ నెల 16నుంచి ప్రారంభమవుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నారాయణపురం, ఢణాపురం, ఆరేకల్లు గ్రామాల వద్ద బాబు బస కోసం స్థల పరిశీలన చేశారు. టిడిపి నాయకులు ఉమాపతి నాయుడు, మల్లేష్‌గౌడు, ఎళిగే పాండురంగారావు, మదిరె భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గుంటెప్ప, సున్నంబట్టి లక్ష్మన్న, గోనేహాల్ గోపాల్‌రెడ్డి, బసాపురం రామస్వామి, ఫకృద్దీన్, ప్రముఖ న్యాయవాది కాశీంవలి, వడ్డేమాన్ గోపాల్‌లు పాల్గొన్నారు. బాబు చేపట్టిన పాదయాత్ర రూట్ మారిందని ఆలూరు నుంచి ఆస్పరి వైపు వెళ్లాల్సిన పాదయాత్ర ఆలూరు నుంచి ఆదోని మండలంలోని చాగి, నారాయణపురం, ఢణాపురం గ్రామాలకు ఈ నెల 16న చేరుకుంటుందని, అక్కడే బస ఉంటుందని పేర్కొన్నారు. 17న ఆయా గ్రామాలగుండా ఆదోని పట్టణానికి చేరుకొని పట్టణంలో విస్తృతంగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం ఆరేకల్లు చేరుకొని రాత్రి చంద్రబాబు బస చేస్తారని వారు పేర్కొన్నారు. ఇందుకోసం గురువారం టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కె.ఇ.కృష్ణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మరోసారి స్థల పరిశీలన చేసి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మీనాక్షినాయుడు తనయుడు భూపాల్‌చౌదరి, ప్రముఖ కాంట్రాక్టర్ బాబునాయుడు, ముజీబ్ అహ్మద్, తిమ్మప్ప, నల్లన్న, ఈరన్నచారి, లక్ష్మినారాయణ, జయరాం, ఆరేకల్లు రామకృష్ణ, జిసి రంగయ్య, వెంకటేశులు, ఆంధ్ర, ఢణాపురం, నారాయణపురం గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ నుండి
పాదయాత్రలో పాల్గొంటా: అశ్వినీదత్
మంత్రాలయం, అక్టోబర్ 10: టిడిపి అధినేత చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా నుండి చంద్రబాబుతో పాటు పాదయాత్రలో పాల్గొంటానని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినిదత్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి రాఘవేంద్రస్వామి దర్శనార్థమై అశ్వినీదత్ మంత్రాలయం వచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మదేవిని దర్శించుకుని కుంకుమార్చన, మహామంగళహారతి పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అశ్వినిదత్, కుటుంబ సభ్యులకు మఠం పీఠాధిపతులు సుయాతీంద్రతీర్థులు స్వామివారి శేషవస్త్రం, ఫల మంత్రాక్షలు ఇచ్చి ఆశ్వీర్వదించారు. అనంతరం మఠం ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడుతూ 1975లో తొలిసారిగా సినీరంగ ప్రవేశం చేసి ఎన్టీఆర్‌తో ఎదురులేని మనిషి చిత్రానికి నిర్మాతగా చేశానన్నారు. ఇప్పటి వరకూ 52 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించానన్నారు.
ప్రస్తుతం రవితేజతో సారువస్తారు, మహేష్‌బాబు,రామ్‌చరణ్‌తో వచ్చే మే నెలలో మరో రెండు చిత్రాలు తీయనున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవితో జగదేకవీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, చూడాలని ఉంది చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. తెలుగుదేశంపార్టీకి తన వంతు మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట రమేష్, వ్యాసరాజ్‌ఆచార్ పాల్గొన్నారు.

నెల్లూరు...

ఎస్పీ సేవలు ఆదర్శంగా తీసుకోవాలి
నెల్లూరుఅర్బన్, అక్టోబర్ 10: ఎస్‌పి రమణకుమార్ చేస్తున్న సేవలను ఇతర జిల్లాల పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని బిసి సంక్షేమ కమిటీ చైర్మన్ జి తిప్పేస్వామి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నెల్లూరు పర్యటన సందర్భంగా స్థానిక కొండాయపాళెం గేట్ వద్ద ఉన్న క్యాప్ భవన్‌ను సందర్శించారు. అనంతరం అరగంటపాటు అక్కడ చదువుతున్న బోడిగాడితోట పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిప్పేస్వామి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎస్‌పి రమణకుమార్ సమాజ సేవలు ప్రత్యేక్షంగా చూశానన్నారు. శవాల మధ్య ఉన్న ఆడుతున్న పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చేర్పించడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం ఉన్నవారు కొందరే ఉంటారని, ఆ సేవలు ఆచరణలో పెట్టి అమలు చేయడం కొందరికే సాధ్యమన్నారు. ఆ కొందరిలో రమణకుమార్ ఉన్నారన్నారు. పిల్లలందరూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. భవిష్యత్‌లో బిసి సంక్షేమ కమిటీ ద్వారా క్యాప్‌కు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. క్యాప్ ఆధ్వర్యంలో బోడిగాడితోట పిల్లలకు అందిస్తున్న విద్య, సౌకర్యాలు గురించి చైర్మన్, కమిటీ సభ్యులకు ఎస్‌పి బివి రమణకుమార్ వివరించారు. అనంతరం తిప్పేస్వామి పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు, కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ కృష్ణప్రసాద్, జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, బిసి జాయింట్ డైరెక్టర్ మాధవీలత, బిసి వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జివి కృష్ణ, నగర ఇన్‌చార్జ్ డిఎస్పీ బాల వెంకటేశ్వరరావు, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

జలధంకిలో ఆయకట్టు రైతుల రాస్తారోకో
జలదంకి, అక్టోబర్ 10: మండల కేంద్రం జలదంకి పెద చెరువు ఆయకట్టు రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. చెరువు భూముల ఆక్రమణలు తొలగించాలనే డిమాండ్‌తో వీరు చేపట్టిన ఆందోళనలో భాగంగా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం కూడలి వద్ద కావలి- ఉదయగిరిరోడ్‌పై బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతుల నాయకులు మాట్లాడుతూ ఇటీవల లోకాయుక్త జోక్యం చేసుకుని చెరువు భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు.
రాస్తారోకో కారణంగా కావలి నుంచి వచ్చే వాహనాలతోపాటు ఉదయగిరివైపునుంచి వస్తున్న అనేక వాహనాలు నిల్చిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలోవినతిపత్రం అందచేసారు.
రక్తదానోద్యమంలో భాగస్వాములవ్వాలి
కావలి, అక్టోబర్ 10: సామాజిక బాధ్యతలను గుర్తెరిగి యువత ప్రధానంగా రక్తదానోద్యమంలో భాగస్వామ్యులవ్వాలని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజారామిరెడ్డి కోరారు. బుధవారం కావలి పట్టణంలోని విఎస్‌యు అనుబంధ పిజి కళాశాలను ఆయన సందర్శించిన సందర్భంగా విద్యార్థులు స్వచ్చందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఇలా విద్యార్థి దశలోనే సామాజిక స్పృహను అలవర్చుకుని ఎంతోకీలకమైనరక్తదానం చేయడం హర్షణీయమన్నారు. తరచూ రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆపన్నులకు ప్రాణదానం చేయవచ్చన్నారు.అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈశిబిరంలో 70మంది రక్తదానం చేయగా త్వరలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగాన్ని కూడా ప్రారంభించనున్నట్లు పిజి సెంటర్ ప్రత్యేకాధికారి శివశంకర్ తెలిపారు. అధ్యాపకులు వినోదిని, చంద్రయ్య, రవీంద్రపసాద్, రాధాకృష్ణయ్య, విద్యార్థి సంఘ చైర్మన్ శ్రీహరి, కావలి రెడ్‌క్రాస్ సభ్యులు అమరా సునీత, తన్నీరుమాల్యాద్రి, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న మత్స్యకారుల దీక్ష
నెల్లూరురూరల్, అక్టోబర్ 10: హరనాధపురం ప్రాంతంలో రోడ్డు వెడల్పు విస్తరణలో భాగంగా తొలగించిన చేపలు, రొయ్యల దుకాణాలకు సంబంధించి మత్స్యకారులు ఆర్‌డివో కార్యాలయం చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారానికి మూడవ రోజుకు చేరింది. ఈ సందర్బంగా పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయంగా ఏసి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న కోనేరు స్థలాన్నికేటాయించాలన్నారు. అధునాతన వసతులతో రొయ్యలు, చేపలు హోల్‌సేల్ రిటైల్ మార్కెట్‌ను నిర్మించాలని, గతంలో కూల్చిన ప్రభుత్వ ఐస్ ఫ్యాక్టరి, కోల్డ్ స్టోరేజ్‌ను కోనేరు స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.
సిజెఎఫ్‌ఎస్ భూముల పరిశీలన
ఓజిలి, అక్టోబర్ 10: మండలంలోని బట్లకనుపూరు, వీర్లగుణపాడు, సగుటూరు గ్రామాలలో ఉన్న సిజెఎఫ్‌ఎస్ భూములను బుధవారం తహశీల్దార్ ఈశ్వరమ్మ పరిశీలించారు. గ్రామాలలో నిరుపేదలను గుర్తించి 6వ విడత భూ పంపిణీలో ప్రభుత్వ భూములను పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగుచేస్తున్న భూస్వాములు స్వచ్చందంగా ఆ భూములను రెవెన్యూ అధికారులకు అప్పజెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌వోలు రామరాఘవయ్య, శ్రీనివాసులు ఉన్నారు.

పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌లో జరిగిన ఘర్షణలు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>