నెల్లూరుఅర్బన్, అక్టోబర్ 10: ఎస్‌పి రమణకుమార్ చేస్తున్న సేవలను ఇతర జిల్లాల పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని బిసి సంక్షేమ కమిటీ చైర్మన్ జి తిప్పేస్వామి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నెల్లూరు పర్యటన సందర్భంగా స్థానిక కొండాయపాళెం గేట్ వద్ద ఉన్న క్యాప్ భవన్‌ను సందర్శించారు. అనంతరం అరగంటపాటు అక్కడ చదువుతున్న బోడిగాడితోట పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిప్పేస్వామి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎస్‌పి రమణకుమార్ సమాజ సేవలు ప్రత్యేక్షంగా చూశానన్నారు. శవాల మధ్య ఉన్న ఆడుతున్న పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చేర్పించడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం ఉన్నవారు కొందరే ఉంటారని, ఆ సేవలు ఆచరణలో పెట్టి అమలు చేయడం కొందరికే సాధ్యమన్నారు. ఆ కొందరిలో రమణకుమార్ ఉన్నారన్నారు. పిల్లలందరూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. భవిష్యత్‌లో బిసి సంక్షేమ కమిటీ ద్వారా క్యాప్‌కు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. క్యాప్ ఆధ్వర్యంలో బోడిగాడితోట పిల్లలకు అందిస్తున్న విద్య, సౌకర్యాలు గురించి చైర్మన్, కమిటీ సభ్యులకు ఎస్‌పి బివి రమణకుమార్ వివరించారు. అనంతరం తిప్పేస్వామి పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు, కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ కృష్ణప్రసాద్, జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, బిసి జాయింట్ డైరెక్టర్ మాధవీలత, బిసి వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జివి కృష్ణ, నగర ఇన్‌చార్జ్ డిఎస్పీ బాల వెంకటేశ్వరరావు, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
జలధంకిలో ఆయకట్టు రైతుల రాస్తారోకో
జలదంకి, అక్టోబర్ 10: మండల కేంద్రం జలదంకి పెద చెరువు ఆయకట్టు రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. చెరువు భూముల ఆక్రమణలు తొలగించాలనే డిమాండ్‌తో వీరు చేపట్టిన ఆందోళనలో భాగంగా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం కూడలి వద్ద కావలి- ఉదయగిరిరోడ్‌పై బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతుల నాయకులు మాట్లాడుతూ ఇటీవల లోకాయుక్త జోక్యం చేసుకుని చెరువు భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు.
రాస్తారోకో కారణంగా కావలి నుంచి వచ్చే వాహనాలతోపాటు ఉదయగిరివైపునుంచి వస్తున్న అనేక వాహనాలు నిల్చిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలోవినతిపత్రం అందచేసారు.
రక్తదానోద్యమంలో భాగస్వాములవ్వాలి
కావలి, అక్టోబర్ 10: సామాజిక బాధ్యతలను గుర్తెరిగి యువత ప్రధానంగా రక్తదానోద్యమంలో భాగస్వామ్యులవ్వాలని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజారామిరెడ్డి కోరారు. బుధవారం కావలి పట్టణంలోని విఎస్‌యు అనుబంధ పిజి కళాశాలను ఆయన సందర్శించిన సందర్భంగా విద్యార్థులు స్వచ్చందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఇలా విద్యార్థి దశలోనే సామాజిక స్పృహను అలవర్చుకుని ఎంతోకీలకమైనరక్తదానం చేయడం హర్షణీయమన్నారు. తరచూ రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆపన్నులకు ప్రాణదానం చేయవచ్చన్నారు.అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈశిబిరంలో 70మంది రక్తదానం చేయగా త్వరలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగాన్ని కూడా ప్రారంభించనున్నట్లు పిజి సెంటర్ ప్రత్యేకాధికారి శివశంకర్ తెలిపారు. అధ్యాపకులు వినోదిని, చంద్రయ్య, రవీంద్రపసాద్, రాధాకృష్ణయ్య, విద్యార్థి సంఘ చైర్మన్ శ్రీహరి, కావలి రెడ్‌క్రాస్ సభ్యులు అమరా సునీత, తన్నీరుమాల్యాద్రి, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న మత్స్యకారుల దీక్ష
నెల్లూరురూరల్, అక్టోబర్ 10: హరనాధపురం ప్రాంతంలో రోడ్డు వెడల్పు విస్తరణలో భాగంగా తొలగించిన చేపలు, రొయ్యల దుకాణాలకు సంబంధించి మత్స్యకారులు ఆర్‌డివో కార్యాలయం చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారానికి మూడవ రోజుకు చేరింది. ఈ సందర్బంగా పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయంగా ఏసి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న కోనేరు స్థలాన్నికేటాయించాలన్నారు. అధునాతన వసతులతో రొయ్యలు, చేపలు హోల్‌సేల్ రిటైల్ మార్కెట్‌ను నిర్మించాలని, గతంలో కూల్చిన ప్రభుత్వ ఐస్ ఫ్యాక్టరి, కోల్డ్ స్టోరేజ్‌ను కోనేరు స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.
సిజెఎఫ్‌ఎస్ భూముల పరిశీలన
ఓజిలి, అక్టోబర్ 10: మండలంలోని బట్లకనుపూరు, వీర్లగుణపాడు, సగుటూరు గ్రామాలలో ఉన్న సిజెఎఫ్‌ఎస్ భూములను బుధవారం తహశీల్దార్ ఈశ్వరమ్మ పరిశీలించారు. గ్రామాలలో నిరుపేదలను గుర్తించి 6వ విడత భూ పంపిణీలో ప్రభుత్వ భూములను పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగుచేస్తున్న భూస్వాములు స్వచ్చందంగా ఆ భూములను రెవెన్యూ అధికారులకు అప్పజెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌వోలు రామరాఘవయ్య, శ్రీనివాసులు ఉన్నారు.