గుంటూరు, అక్టోబర్ 10: ప్రభు త్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి హెచ్చరించారు. బుధవారం గుంటూరుకు వచ్చిన సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇసుకపై తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలోనే అమలు చేసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ గృహాల కోసం 1.20 లక్షల క్యూబిక్ మీటర్లు, ప్రభుత్వ అవసరాలకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను విడుదల చేసినట్లు చెప్పారు. అన్ని రీచ్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇసుకను నిత్యావసర వస్తువుగా గుర్తించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఇసుక మైనింగ్ ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేశామని, ఇందుకు విరుద్ధంగా రాత్రివేళల్లో మైనింగ్ నిర్వహించినట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సిఎం పర్యటనతో రహదారులను జల్లెడపట్టిన పోలీసులు
నూజెండ్ల, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాటలో భాగంగా మండలంలో బుధవారం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా రూరల్ ఎస్పీ జె సత్యనారాయణ పర్యవేక్షణలో ఇద్దరు డిఎస్పీలు, ఐదు మంది సిఐలు, 12 మంది ఎస్సైలు, 200 మంది సిబ్బందితో చింతలచెర్వు, ఐనవోలు, చీకటీగలపాలెం అడ్డరోడ్టువరకు రహదారి మార్గంలో జల్లెడ పట్టారు. అడుగడుక్కి బదోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నుండి సిఎం బయలు దేరి గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన చింతలచెర్వుకు సిఎం కాన్వాయ్ చేరుకొని, ఐనవోలు, చీకటీగలపాలెం అడ్డరోడ్డు మీదుగా ప్రకాశం జిల్లా మేడపి వైపు వెళ్లింది. సిఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సు నుండి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సిఎం పర్యటనతో అధ్వానంగా మారిన కురిచేడు రహదారి బాగుపడటంటతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత మిర్చి రైతులకు
11.65 కోట్లు విడుదల
ప కలెక్టర్ సురేష్‌కుమార్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 10: జిల్లాలో గత ఏడాది జరిగిన కోల్డ్‌స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత రైతులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 11,65,30,000 రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం నాడు 2011లో శ్రీ సాయిసూర్య కోల్డ్‌స్టోరేజ్‌లో సంభవించిన అగ్నిప్రమాదానికి సంబంధించి ఇన్సూరెన్స్ విడుదలపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పొందిన మిర్చి బస్తాల వివరాలను తెలియజేస్తూ మేలురకం మిర్చి 32,598 బస్తాలు, తాలుగాయలకు సంబంధించి 5,096 బస్తాలకు ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత ఇన్సూరెన్స్ మొత్తాన్ని రైతులకు చెల్లించే విధంగా కోల్డ్‌స్టోరేజ్ పేరిట బ్యాంకులో జమ చేయాలని ఇన్సూరెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్, రైతు ప్రతినిధులు, సాయిసూర్య, నందిని, వెంగమాంబ కోల్డ్‌స్టోరేజ్‌ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
చైతన్య కెరటం అమరజీవి మల్లయ్యలింగం
ప సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నివాళి
గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 10: అభ్యుదయ భావజాళాన్ని నరనరాల్లో నింపుకున్న అమరజీవి మల్లయ్యలింగం చైతన్య కెరటమని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కొనియాడారు. బుధవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మల్లయ్యలింగం 40వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రమజీవుల కోసం పోరాటం చేస్తున్న ప్రతిఒక్కరికీ మల్లయ్యలింగం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మల్లయ్యలింగం ఆశయ సాధనకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అలుపెరగని పోరాట స్ఫూర్తికి మల్లయ్యలింగం ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అనంతరం మల్లయ్యలింగంతో సహచరునిగా పనిచేసిన పి భీమారావును సిపిఐ నగర సమితి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ నాయకుడు జివి కృష్ణారావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొల్లి సాంబశివరావు, కా ర్యదర్శి గని, ఎఐటియుసి నగర కార్యదర్శి జి సురేష్, నగర కమిటీ నాయకు లు అమీర్‌వలి, పిచ్చయ్య, మంగమ్మ, శ్రీనురెడ్డి, ఎంజె మోహనరావు, చల్లా చిన ఆంజనేయులు పాల్గొన్నారు.
చేపల చెరువుల వేలంను అడ్డుకున్న రైతాంగం
సత్తెనపల్లి, అక్టోబర్ 10: మండలంలోని వివిధ గ్రామాల్లో చేపల చెరువులు వేలం పాట నిర్వహించబోయిన అధికారులకు బుధవారం చుక్కెదురైంది. ఆయా చెరువుల కింద సాగునీటికి ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో హఠాత్తుగా చేపల చెరువులకు వేలం పాటలు నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతారని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ధూళిపాళ్లలోని చెరువు కింద దాదాపు 300 ఎకరాలు సాగవుతోందని, పన్నులంటూ పరిగెత్తుకొచ్చే పంట పండటానికి సహకరించాలని కోరారు. అలాగే మండలంలోని నందిగంలో కూడా రైతాంగం అధికారులకు ఎదురు తిరిగింది. గత్యంతరం లేని స్థితిలో అధికారులు పోలీసుల సహాయాన్ని కోరినా రైతుల ఆగ్రహంతో వేలం నిలిపి వేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమ నిర్వహణలో మండల తహశీల్దార్ గందం రవీంధర్, ఇఒఆర్‌డి లిల్లి పుష్పం, ఇఒ సుబ్బారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.