Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రత్నగిరిపై నిఘా కన్ను!

$
0
0

అన్నవరం, అక్టోబర్ 10: రత్నగిరి క్షేత్రంలో నిఘా కెమేరాలను దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవి రామ్‌కుమార్ బుధవారం ప్రారంభించారు. సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో రత్నగిరిపై ఏర్పాటు చేసిన 54 సిసి కెమేరాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ వద్ద ఛైర్మన్ రామ్‌కుమార్, ఇఓ పి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం రామ్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ రత్నగిరి కొండపై ప్రధానాలయంతో పాటు వ్రత మండపాలు, నిత్య కళ్యాణ మండపం, భక్తుల క్యూలైన్లు, నిత్యాన్నదానం, ప్రసాద విక్రయశాల, రూమ్‌లు తదితర ముఖ్య ప్రదేశాల్లో ఈ కెమేరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఇఓ మాట్లాడుతూ దేవస్థానానికి విచ్చేసే భక్తులకు రక్షణ నిమిత్తం ఈ కెమేరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎఇఓలు, ఎఇ బి ప్రసాదరావు, డిఇలు గుర్రాజు, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, అక్టోబర్ 10: స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో వైద్యారోగ్య శాఖ ఏర్పాటుచేసిన వైద్యాధికారుల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన మలేరియా, కలరా, స్లైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై విస్తృతరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కుటుంబ నియంత్రణ విషయంలో మన జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉందని, దీనిని ఒకటో స్థానంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకుడు డాక్టర్ జయచంద్రారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మందుల వాడకంపై వివరించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సి పద్మావతి, ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ పవన్‌కుమార్, టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ప్రసన్నకుమార్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ చెన్నయ్య, ఐసిడిఎస్ పిడి కామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

హై అలర్ట్
*మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూగా నిర్ధారణ*రెండు గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు
*ఇంటింటికీ మాత్రల పంపిణీ, ప్రజలంతా మాస్కులు ధరించాలని వినతి*బృందాలుగా చేరవద్దని హెచ్చరిక - దుకాణాలూ బంద్
తాళ్ళరేవు, అక్టోబర్ 10: తాళ్ళరేవు మండలం చినబొడ్డువెంకటాయపాలెంలో మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం మండలం అంతటా మెడికల్ హై అలర్ట్ ప్రకటించింది. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో ఉన్న ఏడుగురిని సోమవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారి రక్త నమూనాలు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించగా వారిలో వనమాడి సత్యవతి (40), పాలెపు వేణు (12), పెసింగి తేజస్వి (12)కి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లుగా బుధవారం సాయంత్రానికి నివేదికలు అందాయి. దీంతో మండలమంతా హై అలర్ట్ ప్రకటించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ గ్రామానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేసారు. చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో పాఠశాలలకు, అంగన్‌వాడీ సెంటర్లకు సెలవు ప్రకటించారు. ప్రతీ ఇంటికి మాత్రలు అందజేశారు. రెండు గ్రామాల నుండి కళాశాలలకు వెళ్ళే విద్యార్ధులకు దసరా సెలవులు ముగిసేంత వరకూ సెలవులు ప్రకటించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామంలో దుకాణాలను బంద్ చేయించారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించేవిధంగా ఏర్పాట్లు చేశారు. తక్షణ పారిశుద్ధ్యానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. రోడ్డు పక్కన మల మూత్ర విసర్జన చేసే వారిపై వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామంటూ గ్రామ పెద్దలు ప్రకటించారు. పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో కొందరు గ్రామస్థులు స్వచ్ఛందంగా సేకరించిన విరాళాలతో సిద్ధం చేసిన మూడు వేల మాస్క్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పారిశుద్ధ్య పనుల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
బుధవారం దండుప్రోలు కృప, ఓలేటి సత్యవతి, చెక్కా శ్రీనివాస్, పోతాబత్తుల నూకరాజు అనే వారిని స్వైన్‌ఫ్లూ లక్షణాలు గుర్తించి కాకినాడ తరలించారు. చెక్కా శ్రీనివాస్, పోతాబత్తుల నూకరాజులు గాడిమొగ గ్రామానికి చెందిన వారు. వీరిలో ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూ అనుమానితులుగా గుర్తించిన వారు పదకొండుకు చేరగా వీరిలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. బుధవారం తాళ్ళరేవు అంతటా తొమ్మిది సబ్ సెంటర్‌లు, పదమూడు మెడికల్ క్యాంపులు నిర్వహించి 700 మందిని ఎగ్జామిన్ చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లిక్, డాక్టర్ విజయ్, డాక్టర్ గిరీష్‌రావులతో పాటు తహశీల్దార్ గంపల నాగేశ్వరరావు, ఎంపిడివో జి రామశివాజీ, ఇఆర్‌డబ్ల్యు జెఇ మారుతీరావు, విఆర్‌వో ప్రభుదాస్‌లు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు.

జిల్లాకు ‘ఆధార్’ అవార్డు
20న రాజస్థాన్‌లో ప్రదానం
కాకినాడ సిటీ, అక్టోబర్ 10: నేషనల్ ఆధార్ గవర్నెన్స్ అవార్డుకు జిల్లా ఎంపికైందని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ చెప్పారు. ఆధార్ నమోదు డేటా అనుసంధానంతో పౌర సరఫరాల పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించిందన్నారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2012 నేషనల్ ఆధార్ గవర్నెన్స్ అవార్డుకు జిల్లా ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవార్డును ఈ నెల 20వ తేదీన తాను, జెసి బాబు రాజస్థాన్‌లోని దుడులో జరిగే కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సొనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు చేతుల మీదుగా అవార్డును అందుకొనున్నామన్నారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు జిల్లాలోని అన్ని శాఖలతో కలిసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ జి చంద్రుడు, ఇన్‌ఛార్జ్ ఆర్డీవో సుబ్బారావు పాల్గొన్నారు.

సిఎం వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం
టిడిపి నేత ఎర్రన్నాయుడు
రావులపాలెం, అక్టోబర్ 10: విచారణలో వున్న ఐఎంజి భూముల కేటాయింపు కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడనుందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సిబిఐ విచారణ జరగబోతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రన్నాయుడు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెదిరేశ్వరం గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన పల్లె పల్లెకు టిడిపి పాదయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత తొమ్మిది రోజులుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకనే సిఎం కిరణ్ ప్రకాశం జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు అంటున్న సిఎం కిరణ్ అధికారాన్ని దగ్గర పెట్టుకుని ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఐఎంజి వ్యవహారానికి సంబంధించి చంద్రబాబుపై పెట్టిన నాలుగు కేసులను ఇప్పటికే వివిధ కోర్టులు కొట్టివేసాయని, అయితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియనీయకుండా కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్ పార్టీల దుష్టత్రయం తిరిగి చంద్రబాబుపై కేసు వేసి బురదజల్లే యత్నం చేస్తున్నాయన్నారు. అవినీతి ఆరోపణలతో ఇంత వరకు సుమారు 40 ఎంక్వయిరీలు చంద్రబాబుపై జరిగాయని, ఆయన సశ్శీలుడుగా బయటపడ్డారని గుర్తుచేసారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, నిద్ర కరువైందని, వారికి ఇంత బాదెందుకో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తాజాగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ ఆధారాలతో 500 కోట్ల రూపాయల మేర అవినీతి చేసినట్లు ఆరోపిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న ప్రధాని, కేంద్ర కేబినెట్ మంత్రులు ఆయనపై వస్తున్న ఆరోపణలను మాత్రం ఎందుకు ఖండిస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్టప్రతిని కలిసిన వైఎస్ విజయమ్మ, తదితర నాయకులు జగన్‌ను త్వరగా విడుదల చేయాలని వేడుకున్నారే తప్ప రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని, ఆ పార్టీ ఎజెండా స్వలాభం, దోపిడీ అనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో 10 జన్‌పధ్ ముందు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ రాబర్ట్ వాద్రాపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి లేదా స్వచ్ఛంద విచారణ సంస్థ చేత విచారణ జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసానన్నారు. మరో ముఖ్య అతిథి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ టిడిపి హయాంలో అడిగిన వారందరికీ దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, నేడు రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండటం టిడిపి ఘనతే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తగ్గించిన గ్యాస్ సబ్సిడీని తాము అధికారంలోకి వస్తే పెంచుతామన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు జ్యోతుల చంటిబాబు, గంగుమళ్ళ సత్యనారాయణ, సయ్యపురాజు రామకృష్ణంరాజు, రెడ్డి రామకృష్ణ, గుత్తుల పట్ట్భారామారావు, మంతెన గోపాలరాజు, పెచ్చెట్టి చిన్నారావు, బండారు వెంకట సత్తిబాబు, దండంగి రామారావు, రామానుజల శేషగిరిరావు, కొత్తపల్లి కృష్ణ, పెద్దింటి మంజుల, నామాల సీత, కుసుమే ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

-సిసి కెమెరాలు ప్రారంభం-
english title: 
r

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>