....................
తొలి చదువులు-14
............
ఆఫ్రికా విద్య అభివృద్ధి సంస్థ, యునెస్కోకి చెందిన విద్యా సంస్థ ఉమ్మడిగా ఆఫ్రికాలో అమలు అవుతున్న విద్యా విధానం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎందుకు విఫలం అవుతుందో తెలుసుకోవటానికి ఆ దేశంలో ఉన్న పలు రాష్ట్రాలలో పెద్ద పరిశోధన జరిపింది.
ఆఫ్రికా ప్రభుత్వాలకు మన ప్రభుత్వంలాగే పసి బిడ్డలు అందరికీ ఒకటో తరగతినుంచే అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్పించాలనే ఉబలాటం ఎక్కువ. కొన్ని ప్రభుత్వాలు పిల్లల మీద దయదలచి నాలుగో తరగతినుండి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. కొంతకాలానికి విద్యా ప్రమాణాలు మొత్తంగా పడిపోవటం మొదలు అయింది. అమలులో ఉన్న విద్యా విధానం ఎందుకు విఫలం అయిందో విచారించటానికి పై రెండు సంస్థలు రంగంలోకి దిగి కారణాలను వెతకటం మొదలుపెట్టాయి.
పిల్లలకు సొంత భాషను ఎదగనిచ్చి ఆ తరువాత దాని ద్వారా ఆంగ్లాన్ని సరిగా నేర్పకుండా నేరుగా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలోకి తొయ్యటంవల్ల ఈ అనర్థాలు జరుగుతున్నట్టు తేల్చి చెప్పాయి. పరిశోధనా ఫలితాలు ఇలా ఉన్నాయి.
పిల్లలు తమ సొంత భాషలో చదివినంత వరకూ విద్యా ప్రమాణాలు బాగా ఉంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంలోకి మారిన ఒకటి రెండేళ్ళలోనే వారి చదువు దిగజారటం మొదలు అయి ఉన్నత విద్య పూర్తి అయ్యే నాటికి సరాసరిన 30 శాతం విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. చాలా కొద్దిమంది పిల్లలు మట్టుకు ఆరో తరగతికి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమంలో నిలతొక్కుకోగలుగుతున్నారు. మిగిలిన పిల్లలు అసంపూర్ణ చదువులతో బడి మానేయటమో, అత్తెసరు ప్రమాణాలతో పాఠశాల నుండి బయటపడటమో జరుగుతుంది. సొంత భాషలో చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయి సరాసరి 69 శాతం కాగా అదే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లల జాతీయ సరాసరి విద్యా ప్రమాణాలు 32 శాతంగా ఉన్నట్టు తేలింది. అధ్యయన మొత్తం సారం ఇలా ఉంది.
1. కనీసం మూడో తరగతివరకూ సొంత భాషను బాగా ఎదగనివ్వటం అవసరం. కానీ అలా జరగటంలేదు. 2.ఆంగ్లాన్ని బోధనా భాషగా వాడాలి అంటే దాన్ని బాగా నేర్పించాలి. ఆంగ్లాన్ని బాగా నేర్చుకోవటానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. 3.ఆంగ్ల మాధ్యమం కోసం మధ్యలోనే సొంత భాషను వదిలేయటంవల్ల పిల్లల విద్య పెంపు, మానసిక ఎదుగుదల దెబ్బతింటున్నాయి. 4.సరిగా రాని భాషలో బోధన వల్ల గణితం, సైన్సులలో పిల్లలు రాణించలేకపోతున్నారు.
ఇది ఆఫ్రికా-యునెస్కో అధ్యయనం వల్ల తెలుస్తోంది.
తమిళనాడు అధ్యయనం
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో డా కె.రామస్వామి, డా శ్రీవాత్సవ 8, 9 తరగతుల పిల్లలతో ‘బోధనా భాష - నైపుణ్యం’ అనే అంశంమీద చేసిన పరిశోధనలో సొంత భాషలో చదివిన పిల్లల్లో, మానసిక వికాసం, భావప్రకటనా నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు చదవటం, రాయటం నైపుణ్యాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ (ఇది శిక్షణలో తేడావల్ల కనిపించే మార్పు) మిగిలిన విషయాలలో సొంత భాషలో చదివిన వారి కంటే వెనుకపడి ఉన్నారు. తమాషా ఏమిటంటే ఇదే ఇంగ్లీషు మీడియం పిల్లలకు ఎగువ తరగతులకు రాకమునుపు మంచి భావ ప్రకటనా నైపుణ్యం ఉంది. తరగతులు పెరిగేకొద్దీ చదవాల్సిన సిలబసు పెరగటం ఒక కారణం కాగా సొంత భాష ద్వారా పొందాల్సిన మానసిక వికాసం, మాటల చాతుర్యం తగ్గటం ఇందుకు కారణాలు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జరిగిన ప్రతి పరిశోధనలోనూ తేలిన నిప్పులాంటి నిజం ఏమిటంటే, తొలి ప్రాయంలో చెప్పే చదువును సొంత భాషలో చదివిన పిల్లల్లో ప్రతిభా పాటవాలు అత్యంత ఉన్నతంగా ఉంటున్నాయి అని. దీని అర్థం ప్రాథమిక విద్యను ఇతర భాషలో చదివిన పిల్లలకు ప్రతిభ లేదనే కదా.
బోధనా ప్రమాణాలు, వసతులు ఒకే రకంగా ఉన్నప్పుడు, ఉన్న తెలివి చేవను ఉపయోగించుకొని ప్రతిభగా మలచుకొనే దారిలో సొంత భాషలో చదివిన వారికంటే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుకబడి ఉంటారు. సొంత భాషలో విద్య నేర్చుకోవటంవల్ల పిల్లలకు ఉన్న సామర్థ్యాన్ని అత్యంత ఎక్కువగా చూపగలరు అనేది మొత్తం పరిశోధనల సారం.
ఆఫ్రికా విద్య అభివృద్ధి సంస్థ, యునెస్కోకి చెందిన విద్యా సంస్థ
english title:
swanta
Date:
Saturday, October 13, 2012