మెదక్, అక్టోబర్ 13: ఆసియా ఖండంలో పేరొందిన సిఎస్‌ఐ మెదక్ చర్చిని జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మూడు దేశాల ప్రతినిధులు శనివారం సాయంత్రం సందర్శించారు. జర్మనీ, కెనడా, ఇటలీ దేశాలకు చెందిన 11 మంది ప్రతినిధులు వచ్చారు. ప్రతినిధుల్లో ఇసాబెల్ డామ్, శైలాన్, మెగాన్(కెనడా) జులియ, అలెక్స్, యులియాన(జెర్మనీ), లీనా, అగిర్దాస్(ఇటలీ)లున్నారు. టూర్ గైడ్‌గా కేంద్ర పర్యాటక శాఖకు చెందిన కె.కరుణానిధి వారి వెంట వచ్చారు. 1914లో ఇంగ్లాండ్ దేశస్థుడు చార్లెస్ వాకర్ దొర ఈ అద్బుత చర్చిని నిర్మించారని ఆలయ గురువు జాన్ పీటర్ వారికి వివరించారు. కరువు ఏర్పడిన సమయంలో నిరుపేదలకు అన్నం పెట్టేందుకు ఈ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏక కాలంలో 5 వేల మంది దర్శించుకునే విధంగా దీన్ని రూపొందించారన్నారు. విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ చర్చి నిర్మాణం, ఉపయోగించి రాళ్లు, సూర్యరశ్మితో కూడిన అద్దాలను అమర్చి జీసస్ దృశ్యాలు తమను కట్టిపడేశాయని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
శ్రీకాకుళం, అక్టోబర్ 13: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో రాష్టవ్య్రాప్తంగా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖామంత్రి తోట నర్సింహం పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా అమ్మిన వారి భూమి ఎక్కడ ఉన్నా, రాష్ట్రంలో ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కలుగుతుందన్నారు. శ్రీకాకుళంలో శనివారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విశాఖపట్నంలో ప్రారంభించామని తెలిపారు. దీనిని రాష్టవ్య్రాప్తంగా విస్తరింపజేయనున్నట్లు చెప్పారు.
రాజమండ్రిలో త్వరలో నర్సరీ మేళా
రాజమండ్రి, అక్టోబర్ 13: రాజమండ్రిలో త్వరలో రాష్టస్థ్రాయిలో నర్సరీ మేళాను నిర్వహించాలని భావిస్తున్నట్టు రాష్ట్ర ఉద్యానశాఖ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శనివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ కడియం నర్సరీల కారణంగా రాజమండ్రికి ప్రత్యేక ఉందన్నారు. ఇక్కడి రైతులు చాలా అదృష్టవంతులని చెప్పారు. దేశంలో మన రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలోనూ ఉందన్నారు. కూరగాయల ఉత్పత్తిలో కూడా మొదటిస్థానాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నట్టు మంత్రి రామిరెడ్డి చెప్పారు. మామిడి రైతులకు మంచి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశ్యంతో, హైదరాబాద్‌లో ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్‌లో ప్రతి ఏటా అన్ని జిల్లాకు చెందిన రైతులు తమ మామిడి ఉత్పత్తిని తీసుకొచ్చి అమ్ముకునేందుకు సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ పాదయాత్రను కాపీ కొట్టిన చంద్రబాబు నాయుడు ఇపుడు పాదయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ం తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. అన్ని పార్టీలూ తెలంగాణను కోరుతున్నాయన్నారు.
అమ్మకానికి బాలిక!
కుప్పం, అక్టోబర్ 13: మద్యానికి బానిసైన తల్లిదండ్రులు బాలికను అమ్మకానికిపెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నివాసం ఉంటున్న ఉన్న జ్యోతి, రవిలకు సంతానం లేకపోవడతో 13 ఏళ్ల కిందట బెంగళూరు నుంచి ఏడాది వయస్సున్న బాలికను తెచ్చుకుని దివ్య అని పేరుపెట్టుకుని పెంచుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ మద్యానికి బానిసలై దివ్యను పొరుగిళ్లల్లో పని చేసేందుకు పంపించేవారు. బాలిక డబ్బులను సంసారానికే కాకుండా భార్యాభర్తలు మద్యం తాగేందుకు వాడుకొనేవారు. ఈ నేపథ్యంలో ఆ బాలికను విక్రయించి అదనంగా డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనతో కుప్పం మండల పరిధిలోని మల్లానూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, చంద్రమ్మలను సంప్రదించి వారికి దివ్యను అప్పగించారు. కాగా వారు ఆ బాలికను కేరళలో అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టపాలరాజువీధిలోని కొందరు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు జ్యోతి, రవిలను విచారించగా అలాంటిదేమి లేదని, దివ్య వాళ్ల అవ్వ ఇంటికి వెళ్లిందిని బుకాయించారు. అయితే వారి మాటలను నమ్మని పోలీసులు సాయంత్రం లోపు దివ్యను తీసుకురావాలని హెచ్చరించడంతో హుటాహుటిన మల్లానూరుకు వెళ్లి దివ్యను తీసుకు వచ్చి పోలీసులకు అప్పజెప్పారు.
వచ్చేనెల హైదరాబాద్‌లో సీమాంధ్ర నేతల సదస్సు
విశాఖపట్నం, అక్టోబర్ 13: సమైక్యాంధ్ర భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్‌లో సీమాంధ్ర నాయకులతో సదస్సు నిర్వహించనున్నట్టు సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులో సీమాంధ్రకు చెందిన మంత్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలియచేశారు. ఈనెల 16న మధురవాడలో సమైక్యాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సభకు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నాయకులు, కార్మిక, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు గ్రామాల్లో పర్యటించనున్నామని అన్నారు. కాగా ఈనెల 15న నెల్లూరులో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి సమావేశం నిర్వంచనున్నట్టు జెఎసి కో-కన్వీనర్ బి కాంతారావు తెలిపారు.
* జీవ వైవిధ్య ప్రతినిధుల కితాబు
english title:
medak church
Date:
Sunday, October 14, 2012