రాజమండ్రి, అక్టోబర్ 13: ఇసుక ర్యాంపుల వేలానికి రాష్ట్రప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటిస్తూ శనివారం జిఓ నెం. 142 జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక తవ్వకాలు, లీజుల విధానంలో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కొత్త జిఓను జారీచేసింది. తాజా జిఓ ప్రకారం ఇక నుండి ఇసుక ర్యాంపుల వేలానికి సంబంధించిన పూర్తి అధికారాలు వాల్టా కమిటీకి లభిస్తాయి. ప్రస్తుతం వాటర్, ల్యాండ్, చెట్టు చట్టాన్ని పర్యవేక్షించి, అమలుచేసేందుకు ప్రతి మండలంలోనూ వాల్టా కమిటీ ఉంది. మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు వాల్టా కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే.
ఈ వాల్టా కమిటీలకే ఇపుడు ఇసుక ర్యాంపుల వేలం, తవ్వకాలు తదితర అంశాలపై పూర్తి అధికారాలు లభించనున్నాయి. కొత్త జీవో ప్రకారం ఒక మండలంలోని ఇసుక ర్యాంపును వేలం వేయాల్సి వచ్చినపుడు, దానికి సంబంధించిన పూర్తి లాంఛనాలు వాల్టా కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయి. ఈ జీవోలో మరో కొత్త అంశం ఏమిటంటే ఇసుక ర్యాంపులకు లాటరీ విధానంలో వేలం నిర్వహిస్తారు. గతంలో ఒకసారి రాష్ట్రప్రభుత్వం లాటరీ విధానంలో వేలం నిర్వహించేందుకు కొన్ని ర్యాంపులకు వేలం నోటిఫికేషన్ జారీచేసినప్పటికీ, అప్పట్లో పాత లీజుదారులు కోర్టుకెళ్లి లాటరీ విధానాన్ని అడ్డుకున్న సంగతి విదితమే. ఇప్పుడదే లాటరీ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్రప్రభుత్వం జీవో 142లో స్పష్టంగా పేర్కొంది. ఈ జీవోతో పాత లీజులు రద్దయి, పాత ర్యాంపులు కూడా కొత్త విధానంలోకి మారతాయి. అయితే పాత లీజులను రద్దుచేయటం వల్ల, పాత లీజుదారులు చెల్లించిన లీజు మొత్తాలను ఎలా చెల్లించాలన్న అంశాన్ని తరువాత నిర్ణయిస్తారు. నదుల స్థాయిని నిర్ణయించే కేటగిరిల్లో, 5వ ఆర్డర్‌లో ఉన్న గోదావరి, పెన్నా, కృష్ణా వంటి నదులకు లాటరీ విధానంలో వేలం నిర్వహించినప్పటికీ, చిన్న చిన్న నదులు, ఏరుల్లోని ఇసుక తవ్వకాలకు పర్మిట్లు జారీచేసే అధికారాన్ని గనులశాఖ అధికారుల నుండి పంచాయతీ కార్యదర్శులకు, తహసీల్దార్లకు అప్పగించారు. మూడవ ఆర్డర్‌లో ఉన్న చిన్న చిన్న నదుల్లో ఇసుక తవ్వకాలకు ఇక నుండి ఆయా ప్రాంతాల్లోని పంచాయతీ కార్యదర్శులే పర్మిట్లు జారీచేస్తారు.
కాస్తంత పెద్ద ఏరుల్లోని ఇసుక తవ్వకాలకు ఆయా మండలాల తహసీల్దార్లు పర్మిట్లు జారీచేస్తారు. 5వ ఆర్డర్‌లోని గోదావరి, పెన్నా, కృష్ణా వంటి నదుల్లో తవ్వకాలకు మాత్రమే వాల్టా కమిటీలు లాటరీ విధానంలో వేలం నిర్వహిస్తాయి. లాటరీ విధానంలో నిర్వహించే వేలంలో ర్యాంపును దక్కించుకున్న లీజుదారుడు అప్పటి ఎస్‌ఎస్‌ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేటు)పై 20శాతం వరకు అదనంగా అమ్ముకునేందుకు అనుమతి ఉంది.
* ‘వాల్టా’కు పూర్తి అధికారాలు: పాత లీజులు రద్దు * కొత్త పాలసీతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
english title:
orders issued
Date:
Sunday, October 14, 2012