అనంతపురం, అక్టోబర్ 13: అవినీతి సొమ్ముతో పాదయాత్ర నిర్వహించేందుకు కొన్ని పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయని పరోక్షంగా వైకాపానుద్ధేశించి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తనకు పోటీగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసమస్యలపై పాదయాత్ర నిర్వహించాలి గానీ తనతో పోటీ ఏంటని ఆయన ప్రశ్నించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర 12వ రోజు శనివారం గడేహోతూరు, గుంతకల్లులో బాబు మాట్లాడుతూ దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని కొన్ని పార్టీలు సవాలు చేస్తున్నాయన్నారు.
అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాలో వారికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టి తీరాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ పార్టీలకు లేదని పరోక్షంగా వైకాపానుద్ధేశించి అన్నారు. తాము అవిశ్వాసం పెడితే వైకాపా, టిఆర్‌ఎస్ బేరాసారాలు సాగిస్తాయని అన్నారు. అవిశ్వాసం పేరుతో టిఆర్‌ఎస్, వైకాపా సాగించే బేరసారాలకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అవకాశమివ్వమన్నారు. వారు చేసే పాపకార్యానికి మేముఒప్పుకోవాలా అని అన్నారు. మేం అవిశ్వాసం పెడితే వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. వైకాపా బ్లాక్‌మెయిల్ రాజకీయం చేస్తోందని బాబు దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా పాపంలో భాగస్వాములం కామన్నారు. ఎంపి, ఎమ్మెల్యేలను బజారులో పశువుల్లా కొనే సంస్కృతి ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లు అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పట్ల తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. సలహాలు, సూచనలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఏం చేయాలో తమకి తెలుసనని బాబు అన్నారు. అందుకే వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టామన్నారు. టిడిపిపై ఒత్తిడి తెచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టించడానికే షర్మిల పాదయాత్రఅన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు నాటి వైఎస్ నుంచి నేటి కిరణ్ వరకు అందరూ బాధ్యులేనన్నారు. రైతుమిత్రను నిర్వీర్యం చేశారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుమిత్ర గ్రూపులను పటిష్టం చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులను ఆదుకుంటామన్నారు. 12వ రోజు శనివారం బాబు గడేహోతూరు నుంచి పొట్టిపాడు, ఛాయాపురం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లుకు చేరుకున్నారు. శనివారం రాత్రి గుంతకల్లులో బస చేశారు. శనివారం 20 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఆదివారం గుంతకల్లులో పాదయాత్ర ముగిసిన అనంతరం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు.
భువనేశ్వరి పరామర్శ
చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి శనివారం గడే హోతూరులో పరామర్శించారు. గడిచిన రెండు రోజులుగా బాబు పలుమార్లు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళనకు గురైన భువనేశ్వరి శనివారం జిల్లాకు చేరుకున్నారు. పాదయాత్రలో బాబు అనారోగ్యానికి గురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ క్యాడర్‌కు, చంద్రబాబుకు భువనేశ్వరి చూచించినట్లు సమాచారం.
నేడు కర్నూలు జిల్లాలో ప్రవేశం
కర్నూలు,: టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఆదివారం నుంచి కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 21 వరకు ఆయన జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో సుమారు 130 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియెజకవర్గంలో ఆదివారంతో బాబు యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. (చిత్రం) అనంతపురం జిల్లా పొట్టిపాడు గ్రామంలో పొలం దున్నుతున్న బాబు
వైకాపా ప్రజాప్రస్థానంపై చంద్రబాబు విసుర్లు
english title:
chandra babu
Date:
Sunday, October 14, 2012