రాయచోటి, అక్టోబర్ 13: కడప జిల్లా రాయచోటిలో పరువుహత్యలు జరిగాయి. తక్కువ కులం వాడిని ప్రేమించిందంటూ నెల రోజుల క్రితం యువతిని చంపిన బంధువులు శనివారం యువకుడిపై వేటకొడవళ్లతో దాడిచేసి నరికారు. తీవ్రంగా గాయపడిన యువకుడు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. రాయచోటి మాసాపేట రెడ్డివారిపల్లె శివారులో నాగరాజు(23)ను అతికిరాతకంగా నరికి గాయపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుండుపల్లె మండలం మాతమ్మహరిజనవాడ కొలిమిమిట్టకు చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన ప్రశాంతి ప్రేమించుకున్నారు. ఇది గమనించిన అమ్మాయి తరఫువారు నాగరాజును హెచ్చరించారు. అయినప్పటికీ అతని తీరు మారకపోవడంతో నెల రోజుల క్రితం ప్రశాంతి హత్య చేశారు. అయితే ఈ విషయం వెలుగుచూడలేదు. నాగరాజును హతమార్చేందుకు పథకం పన్నారు. ఇది తెలుసుకున్న నాగరాజు వీరబల్లె మండలం గంగాపురం హరిజనవాడకు మకాం మార్చాడు. నాగరాజును రాయచోటి రప్పించేందుకు అతనితో పరిచయం ఉన్న ఓ యువతితో ఫోన్ చేయించారు. శనివారం నాగరాజు రాయచోటి ఆటోలో వస్తుండగా అమ్మాయి తరఫు బంధువులు శివమల్లయ్యనాయుడు, వీరమల్లయ్యనాయుడు, నారాయణ, నాగయ్య స్కూటర్‌ను అడ్డుగా పెట్టి ఆటోని ఆపారు. వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో నాగరాజును నరికి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కాగా చనిపోవడానికి ముందు నాగరాజు పోలీసులకు మరణవాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాను ప్రేమించిన ప్రశాంతిని ఆమె బంధువులు నెల రోజుల క్రితం చంపారని, తనను చంపాలని పథకం పన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి సిఐ శ్రీరాములు తెలిపారు.
దారికాచి యువకుడిపై వేటకొడవళ్లతో దాడి * ప్రాణాపాయస్థితిలో రుయాకు తరలింపు * నెల క్రితమే యువతి హత్య
english title:
honour killings
Date:
Sunday, October 14, 2012