రాజమండ్రి, అక్టోబర్ 13: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఒత్తిడి మొదలయ్యే సరికి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులకు సన్న రకం పాత బియ్యాన్ని కిలో రూ.36కు అమ్ముతుండటంతో వినియోగదారులకు హోల్‌సేల్ వ్యాపారులు రూ.38కు అమ్ముతున్నారు. ఇంత అధిక ధరలకు పాత సన్న బియ్యం అమ్మని పరిస్థితుల్లో రిటైల్ వర్తకులు స్టీమ్, పిఎల్ రకాలను అమ్మటానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ మధ్యకాలంలో బియ్యంలో కూడా బ్రాండ్లకు అలవాటుపడ్డ జనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా సంస్థలు బ్రాండ్లను బట్టి బియ్యాన్ని రిటైల్ మార్కెట్లో ఇప్పటికే రూ.40కి పైనే అమ్ముతున్నాయి. ప్రస్తుతం బియ్యం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మిల్లర్ల వద్దే కిలో పాత సన్న బియ్యం రూ.40పైనే ఉండవచ్చని హోల్‌సేల్ వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా మిల్లర్లు పాత సన్న బియ్యం ధర కిలో రూ.40కన్నా ఎక్కువే ఆశిస్తున్నారని హోల్‌సేల్ వ్యాపారి అరిగెల బాబునాగేంద్రప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.
మిల్లర్ల వద్ద బియ్యం నిల్వలు బాగానే ఉన్నప్పటికీ, కొంత మంది కృత్రిమ కొరతను సృష్టిస్తుండటం వల్ల బియ్యం ధరలు పెరుగుతుంటే, మరోపక్క విద్యుత్ కోత బియ్యం సరఫరాను దారుణంగా దెబ్బతీస్తోంది. కరెంటు కోత కారణంగా మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండటం లేదని దీంతో ధరను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కొంత మంది మిల్లర్లు జనరేటర్‌పై ఆధారపడి మిల్లును నడపటం ద్వారా బియ్యం సరఫరాచేస్తుండటంతో సహజంగానే బియ్యం ధరను పెంచాల్సి వస్తోంది. విద్యుత్ కోత నేపథ్యంలో జిల్లాల మధ్య బియ్యం రవాణాపై కూడా రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించటంతో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పర్మిట్ల నిబంధనలను తొలగిస్తే, బియ్యానికి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎగుమతవుతాయని, దీనివల్ల కచ్చితంగా ధరలు కొంత వరకు అదుపులోకి వస్తాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పర్మిట్ల విధానాన్ని తొలగిస్తామని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం ఎందుకో మీనమేషాలు లెక్కిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి కొత్త పంట చేతికొచ్చే ప్రస్తుత సమయంలో ధరలు తగ్గాలని, కనీసం పెరగకుండా నిలకడగా ఉండాలని, కానీ అందుకు భిన్నంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
* పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మరింత ప్రియం
english title:
rice prices to go up
Date:
Sunday, October 14, 2012