అనంతసాగరం, అక్టోబర్ 13: ఉత్తర కాలువ పనులు చేపట్టి నాలుగేళ్ల కాలం పడుతోంది. ఇంకా పనులు నాలుగవ వంతు కూడా సాగలేదు. ఇచ్చిన కాలపరిమితి కంటే రెండేళ్లు అదనమైన ఉత్తర కాలువ పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్ల పై శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కాలపరిమితితో మరో జలాశయం నిర్మాణం చేపట్టవచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శనివారం నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం, ఆ పై ఉత్తరకాలువ జిరో కిలోమీటర్ల నుంచి 13వ కిలోమీటరు పరిధిలో జరుగుతున్న 11వ ప్యాకేజి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా 6వ కిలోమీటర్ ప్రాంతంలో సాగుతున్న కాంక్రీట్ పనులు పరిశీలించారు. తక్కువ యంత్రాలతో నత్తనడకన సాగుతున్న పనులు పనితీరు పై ఆయన అధికారులను కాంట్రాక్టర్లను నిలదీశారు. మరో 15రోజుల్లో ఉత్తర కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో పనులు ఇలా జాప్యం చేయడం పట్ల ఆయన అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లోపల సాగునీటి విడుదలకు కాలువను సుగమం చేయాలని యంత్రాలు మొత్తం తొలగించాలన్నారు. 2008లో మంజూరైన ఈ పనులు రెండేళ్లు ఈ కాంట్రాక్టర్ పట్టించుకోక పోవడం ఆపై మరో రెండేళ్లు కొనసాగించడం వల్ల రైతులకు తామేమి సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఇచ్చిన కాలపరిమితి లోపల పనులు పూర్తి చేయలేకపోతే మానుకొని వెళ్లండి అని అధికారులను ఉద్దేశించి అన్నారు. అంతకు ముందు ఆయన సోమశిల మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, శీతలీకరణ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికే కట్టుబడి పని చేస్తుందన్నారు.
* ఇరిగేషన్ అధికార్లపై మంత్రి ఆనం ఆగ్రహం
english title:
anam serious
Date:
Sunday, October 14, 2012