విశాఖపట్నం, అక్టోబర్ 13: పర్యాటక శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆ శాఖ అధికారులు శనివారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. 2010 సంవత్సరంలో తమతో పర్యాటక శాఖ కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విశాఖ ఏజెన్సీలోని టైడా జంగిల్ బెల్స్, అనంతగిరి టూరిజం రిసార్ట్స్, అరకులోని పున్నమి, మయూరి టూరిజం గెస్ట్‌హౌస్‌లు, బొర్రా గుహలు మూతపడ్డాయి. ఈనెల మొదటి వారం నుంచి విశాఖలో టూరిజం సీజన్ ఆరంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, చత్తీస్‌గడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. జనవరి 19వ తేదీ వరకూ ఈ సీజన్ కొనసాగుతుంది. అరకు, అనంతగిరి, బొర్రా ప్రాంతాలకు రోజుకు 250 మంది వరకూ పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు సుమారు రెండు, మూడు నెలల కిందటే గెస్ట్ హౌస్‌లను బుక్ చేసుకున్నారు. అయితే ఉద్యోగుల సమ్మె కారణంగా తమతమ హోటల్స్, గెస్ట్ హౌస్‌లలో ముందుగా గదులు బుక్ చేసుకున్న పర్యాటకులను ఈ ప్రాంతానికి రావద్దంటూ టూరిజం అధికారులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించారు. దీంతో పర్యాటక శాఖకు రోజుకు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. కొంతమంది పర్యాటకులు అరకు వచ్చినా అక్కడ బస చేయకుండా విశాఖకు వచ్చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అమిత్ సింగ్, ట్రాన్స్‌పోర్ట్ అధికారి లక్ష్మణరావు పర్యాటక శాఖ ఉద్యోగులతో శనివారం చర్చలు జరిపారు. కార్మికుల తరపున అరకు ఎమ్మెల్యే సివేరి సోమ చర్చల్లో పాల్గొన్నారు. 2010 నాటి ఒప్పందాలు అమలు చేయాలని పట్టుపట్టారు. ఈ సమ్మెకు భద్రాచలం, నాగార్జునసాగర్, రాజమండ్రి, శ్రీశైలంలోని ఆ శాఖ కార్మికులు మద్దతు తెలిపారు. 18వ తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా పర్యాటక కార్మికులు ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. ఈనెల 15 నుంచి జరగాల్సిన అరకు ఉత్సవ్ జరుగుతుందా.. లేదా.. అన్న అనునాలు వ్యక్తం అవుతున్నాయి.
18 నుంచి రాష్టవ్య్రాప్త ఆందోళనకు సిద్ధం * మూతపడ్డ బొర్రా గుహలు
english title:
tourism employees on indefinite strike
Date:
Sunday, October 14, 2012