అనకాపల్లి , అక్టోబర్ 14: ఇతర జిల్లాల నుండి వచ్చి విశాఖ జిల్లాలో ఎంపి, ఎమ్మెల్యే, మంత్రి పదవులను వెలగబెడుతున్న వలస రాజకీయ వాదులను రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని మాజీమంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుండి పొట్టకూటికోసం వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు ఒక ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎంపిగా, మరో ఎన్నికల్లో చోడవరం నుండి ఎమ్మెల్యేగా, తిరిగి అనకాపల్లి నుండి శాసనసభ్యులుగా మంత్రి పదవిని వెలగబెట్టి తమ వ్యక్తిగత, స్వార్ధప్రయోజనాల కోసమే రాజకీయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. నక్కపల్లి నుండి పోర్టును తన సొంత జిల్లాకు స్వార్ధ ప్రయోజనాల కోసమే మంత్రి గంటా తరలించుకు పోయారని ఆరోపించారు. మంత్రిగా తనవెంట ఎవరూ తిరగక పోవడంతో సొంత మనుషులను కార్లలో తిప్పుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అవహేళన చేశారు. కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి కూడా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారన్నారు. అనకాపల్లినుండి ఎంపిగా ఎన్నికైన సబ్బం హరి ఈ నియోజకవర్గం ఎంపి నిధులను వేరొక ప్రాంతాలకు ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉంటూ మాకవరపాలెం భూములను అన్‌రాక్ కంపెనీకి కట్టబెట్టారని, ఆ కంపెనీ యాజమాన్యం నిర్వాసితులకు తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 16వ తేదీ నుండి తాను మాకవరపాలెం నుండి తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేశం శాసనమండలి పక్షం నేత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ కిరణ్ సర్కార్ వైఫల్యాలపై గ్రామాల్లో పార్టీశ్రేణులు విస్తృత ప్రచారం చేసి చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరు సాగించేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఆవశ్యకతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత స్వార్ధంతోనే ఎస్‌ఇజెడ్ భూములను పరిశ్రమలకు గత కాంగ్రెస్ పాలకులు ధారాదత్తం చేశారని ఆరోపించారు. నిరుపేదలకు మూడు సెంట్లు భూమిని ఇచ్చేందుకు వెనుకాడుతున్న ప్రభుత్వం కంపెనీలకు మాత్రం పెద్దమొత్తంలో భూములను కట్టబెడుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవటానికి తహతహలాడుతున్నారే తప్ప పేదల సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అసెంబ్లీ దేశం కన్వీనర్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అనకాపల్లికి మంత్రి పదవులు దక్కినా ఈ ప్రాంత అభివృద్ధి కానరాలేదన్నారు. జిల్లాదేశం ఉపాధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ తెలుగుయువత అధ్యక్షులుగా మళ్ల సురేంద్ర, పట్టణ దేశం అధ్యక్షుడు బుద్ధ నాగజగదీష్, జిల్లాదేశం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీనేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
‘కార్మికుల సమస్యలు
పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం’
అరకులోయ, అక్టోబర్ 14: పర్యాటక అతిధి గృహాలలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగ, ఒప్పంద, దినసరి వేతన కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని మాజీ శాసనసభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ నాయకుడు కుంభా రవిబాబు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు ఉంటుందంటూ కార్మికులకు మద్దతుగా దీక్ష శిబిరం వద్ద బైఠాయించి ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ వివిధ రూపాలలో గిరిజన ఉద్యోగ, కార్మికులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. 2006, 2010వ సంవత్సరంలో కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను యధావిధిగా అమలు చేయకపోవడం తగదని ఆయన చెప్పారు. న్యాయమైన డిమాం డ్ల పరిష్కారం కోసం గిరిజనులు పోరాడుతున్నా పర్యాటక యాజమాన్యం, పాలకులు, అధికార యంత్రాంగం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రకటనలు, ఒప్పందాలను మానుకుని గిరిజన కార్మికులకు న్యాయం జరిగేలా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తే మంచిదని ఆయన అన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థలోని కిందిస్థాయి అధికారులు, ఏజెన్సీలోని ఇతర శాఖల అధికారులు చర్చలు జరిపితే కార్మికుల సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్డర్ చందనాఖాన్ స్వయంగా కార్మికులతో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారం కాగలవన్నారు. ఇప్పటికే సంస్థ అధికారులు కాలయాపన చేస్తుండడంతో సంస్థకు నష్టాలు సంభవిస్తున్నాయే త ప్ప ఎటువంటి ప్రయోజనం లేదనే విషయాన్ని గుర్తించాలని రవిబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాంగి చిన్నారావు, విజయకుమా ర్, గంగునాయుడు పాల్గొన్నారు.