కామారెడ్డి, అక్టోబర్ 14: కామారెడ్డి డివిజన్‌లో ఇక నుండి బెల్టుషాపులు నిర్వహిస్తూ మద్యం అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తప్పవని డిఎస్పీ మనోహర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, బెల్టుషాపులపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు బెల్టుషాపుల కట్టడికి ఆదేశాలు జారీ చేశామని అన్నారు. గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి బెల్టుషాపులు నడుపుతున్న వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు సైతం గ్రామాల్లో మద్యం అమ్మకాలను చూస్తూ ఊరుకోరాదని, సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. బెల్టుషాపుల విషయంలో ఎలాంటి రాజకీయ వత్తిళ్లు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం, జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారుల్లో స్థాయిని మించి ప్రయాణికులను చేరవేస్తున్న వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆటోల్లో ఒకవైపు జాలీ పెట్టుకోవాల్సిందిగా ఆటోల వారిని ఆదేశించామన్నారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తి వాహనం నడితే విధిగా లైసెన్స్‌లు ఉండాలని, లైసెన్స్‌లు లేనివారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. సిఐలు, ఎస్‌ఐలు విధిగా ప్రతిరోజు గంటపాటు వాహనాలు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తున్నట్లు తెలిపారు. బెల్టుషాపులు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల సిఐ, ఎస్‌ఐలకు ఆదేశాలు అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా అందించామని అన్నారు.
కామారెడ్డి డివిజన్‌లో ఇక నుండి బెల్టుషాపులు నిర్వహిస్తూ మద్యం
english title:
action against belt shops
Date:
Monday, October 15, 2012