కమ్మర్‌పల్లి, అక్టోబర్ 14: గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు నీళ్లను కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి లిఫ్ట్ ద్వారా అందించేందుకు కృష్టి చేసానని ప్రభుత్వ విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని నర్సాపూర్, ఉప్లూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అనిల్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు నర్సాపూర్ గ్రామానికి సమీపంలో ఉన్నప్పటికీ, ఎతె్తైన ప్రాంతంలో ఉండటం వల్ల కాల్వల ద్వారా సాగునీటిని అందించడం సాధ్యం కాలేదన్నారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులతో సర్వేలు నిర్వహించి, లిఫ్ట్ ద్వారా రైతులకు సాగునీటిని అదించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన దానికి సంబంధించి హమాలీ చార్జీలు కోటి 80 లక్షలు రావాల్సి ఉందని రైతులు విప్ దృష్టికి తీసుకరాగా, జిల్లాకు చెందిన మంత్రితో మాట్లాడి త్వరగా చెల్లింపులు జరిగే విధంగా చూస్తానని అన్నారు. వరదకాల్వకు క్రాస్ రెగ్యులేటర్ మంజూరు కావడంతో ఈ ప్రాంతంలో పుష్కలంగా భూగర్భ జలాలు పెరగనున్నాయని అన్నారు. వరదకాల్వకు తూములను ఏర్పాటు చేసి చెరువులు నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు అనిల్ వివరించారు. డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, సొసైటీలు అందిస్తున్న సేవల మూలంగా జిల్లా సహకార సంఘం అగ్రస్థానంలో ఉందన్నారు. కమ్మర్‌పల్లి సొసైటీ పరిధిలోని ఉప్లూర్ గ్రామాన్ని విడదీసి, ప్రత్యేక సొసైటీ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా 17.50 లక్షల రూపాయల వ్యయంతో ఉప్లూర్ గ్రామంలో నిర్మిస్తున్న గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన, ఎసిడిసి నిధుల నుండి ఉప్లూర్ గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం భవనానికి రెండు లక్షలు, గోసంగి సంఘ ప్రహారిగోడ నిర్మాణం పనులకు 2 లక్షలు, నర్సాపూర్ గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా 12 లక్షల రూపాయలతో చేపట్టిన మెటల్‌రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే నర్సాపూర్ గ్రామంలో 5.30 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్లు మురళీధర్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకెట రవి, సొసైటీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శెట్పల్లి నారాయణ, బోగ రామస్వామి, రఫీ, కొమ్ముల రాజేశ్వర్, బద్దం రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
మోర్తాడ్: మండలంలోని ఏర్గట్ల గ్రామంలో పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆదివారం పరామర్శించారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిమజ్జనం రోజున మరణించిన మనోహర్ కుటుంబాన్ని పరామర్శించి, 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నారాయణ, తిప్పరెడ్డి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించి మూడు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట నేతలు నారాయణ, అనిల్, గిర్మాజి గంగాధర్, సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో బుద్ధుని బోధనలను ఆచరించాలి
నిజామాబాద్ , అక్టోబర్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో బుద్ధుని బోధనలు ఆచరిస్తూ సమాజ హితానికి పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మగల్లిలో ఆదివారం 57వ దమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు టి.దయానంద్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పులి జైపాల్ మాట్లాడుతూ, 1956 అక్టోబర్ 14వ తేదీన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విజయదశమి రోజున 2500వ సంవత్సరం బౌద్ధమయాను పురస్కరించుకుని నాగ్‌పూర్‌లోని దీక్షా భూమిలో ఐదు లక్షల మందితో బౌద్ధదమ్మ దీక్షను స్వీకరించారని అన్నారు. భారతదేశంలో పుట్టిన బౌద్ధ దమ్మం నేడు ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందిందని అన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్, సింగాపూర్, అమెరికా, శ్రీలంక తదితర దేశాల్లో గౌతమ బుద్ధుని సూక్తులతో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయని అన్నారు. అదే పంథాలో మనం సైతం పయనిస్తూ సమాజాభివృద్ధికి పాటుపడదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుశీల్‌కుమార్ అధ్యక్షత వహించగా, ఒయు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, లుంబిని బుద్ధవిహార్ అధ్యక్షుడు పి.బాబు, అశోక్, జె.నారాయణ, రంజిత్, సంఘ సభ్యులు సురేష్, రాకేష్, అరుణ్, బంటి, ఆదిత్య, హరీష్, సుదా, భరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.