పిట్లం, అక్టోబర్ 14: మండలంలోని కారేగాం గ్రామంలో ఆదివారం విద్యుత్ సిబ్బంది సత్యం, షాదుల్, మొహియుద్దీన్‌లను స్థానిక గ్రామస్థులు గంట పాటు నిర్బంధించారు. గడిచిన ఐదు రోజుల నుండి వ్యవసాయ రంగానికి కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగడం లేదని, రికార్డుల్లో మాత్రం నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నట్టు పేర్కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల చేతికందిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సిబ్బంది మాట్లాడుతూ, కరెంట్ కోతలకు సంబంధించి తమ తప్పిదమేమీ లేదని, పైనుండే సరఫరాను నిలిపివేస్తున్నారని వివరణ ఇచ్చారు. చిన్నకొడప్‌గల్ సబ్‌స్టేషన్‌కు రెండు బ్రేకర్లపై నాలుగు ఫీడర్లు పనిచేస్తున్నాయని వివరించారు. ఇందులో ఒక బ్రేకర్ గత వారం రోజుల క్రితం చెడిపోయిందన్నారు. ఒకే బ్రేకర్‌పై నాలుగు ఫీడర్లు పనిచేస్తుండడం వల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అయితే ఎ.ఇ వచ్చేంత వరకు సిబ్బందిని విడిచిపెట్టేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. నిర్బంధంలో ఉన్న సిబ్బంది ఎ.ఇకి ఫోన్ చేయగా, తాను నిజామాబాద్‌లో ఉన్నానని తప్పించుకున్నారు. రైతులు డి.ఇ మల్లికార్జున్‌కు ఫోన్ చేయగా, బ్రేకర్ చెడిపోయిన విషయం తన దృష్టికి రాలేదని, సాయంత్రం ఐదు గంటల్లోపు బ్రేకర్‌కు మరమ్మతులు జరిపిస్తామని, పంటలకు ఏడు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ట్రాన్స్‌కో సిబ్బందిని విడిచిపెట్టారు. ఈ ఆందోళనలో రైతులతో పాటు మాజీ ఎంపిటిసి మోహన్‌రెడ్డి, రైతు ప్రతినిధులు మహిపాల్‌రెడ్డి, ఆగంరెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి సబ్ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
డిచ్‌పల్లి: దర్పల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషనన్ స్థానిక రైతులు ఆదివారం ముట్టడించారు. గత మూడు రోజులుగా వ్యవసాయ రంగానికి కేవలం రెండు గంటల పాటే విద్యుత్ సరఫరా చేయడంపై ఆగ్రహించిన రైతులు ఈ ఆందోళనకు పూనుకున్నారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, దర్పల్లిలో మాత్రం కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో దర్పల్లి సబ్ స్టేషన్ నిర్వహణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌ను సమయపాలన లేకుండా సరఫరా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి సబ్ స్టేషన్‌కు పూర్తిస్థాయి అసిస్టెంట్ ఇంజనీర్ లేకపోవడం వల్ల నిర్వహణ పూర్తి అస్తవ్యస్తంగా తయారైందని అన్నదాతలు ఆరోపించారు. వ్యవసాయానికి కేవలం రెండు గంటలు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా దర్పల్లి ఫీడర్‌లో వెయ్యి ఎకరాల వరిపంట ఎండిపోయితున్న పరిస్థితి ఉందని రైతులు వాపోయారు. గత సంవత్సర కాలంగా సబ్ స్టేషన్‌పై స్థానిక ప్రజలు, రైతులు విద్యుత్ శాఖ ఎస్‌ఇకి, సిఇకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యారని విమర్శించారు. ఇదిలా ఉండగా, దర్పల్లి సబ్ స్టేషన్‌లోని ముఖ్యమైన పరికరాలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రతి పదినిమిషాలకు ఒకసారి బ్రేక్‌డౌన్ అవుతుందని స్థానిక కాంట్రాక్ట్ సిబ్బంది తెలియశారు. సబ్‌స్టేషన్‌లోని ఫీడర్ చానళ్లు కూడా పూర్తి దెబ్బతిన్నాయని వారు అన్నారు. సబ్ స్టేషన్‌కు మరమ్మతులు చేయకపోతే వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదని కాంట్రాక్ట్ సిబ్బంది రైతుల సమక్షంలో స్పష్టం చేశారు. సబ్ స్టేషన్ మరమ్మతులకు ప్రతిపాదనలు చేయడంలో స్థానిక విద్యుత్ సిబ్బంది పూర్తిగా విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి దర్పల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌కు మరమ్మతులు జరిపించి, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు నాయకులు వై.గంగారెడ్డి, ఎ.చిన్నబాల్‌రాజ్, వజ్రం, నాగేశ్వర్‌రెడ్డి, నడ్పి గంగారెడ్డి, చిన్నలింగన్న, సాయన్న తదితరులు ఉన్నారు.
మండలంలోని కారేగాం గ్రామంలో ఆదివారం విద్యుత్ సిబ్బంది
english title:
vidyuth sibbandi
Date:
Monday, October 15, 2012