కంఠేశ్వర్, అక్టోబర్ 14: బోర్గాం గ్రామ శివారులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు ఆదివారం తెల్లవారుఝామున తొలగించారు. అడ్టుకోవడానికి ప్రయత్నించిన సిపిఎం, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పెద్ది వెంకట్రాములు, సిద్ధిరాములు, ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్యతోపాటు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గుడిసెల తొలగింపు, నాయకుల అరెస్టుపై సిపిఎం, న్యూడెమోక్రసీ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు నగరంలోని బస్టాండ్ వద్ద వేర్వేరుగా అందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలుపగా, న్యూడెమోక్రసీ, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ, న్యూడెమోక్రసీ నాయకుడు సాయిబాబా మాట్లాడుతూ, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి, కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కానీ నిరుపేద ప్రజలు, కార్మికులు నిలువనీడ లేక జానెడు జాగాలలో గుడిసెలు వేసుకుంటే మాత్రం అధికారులు వెంటనే వాటిని బలవంతంగా కూల్చివేయడం, ధ్వంసం చేయడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులకు కొమ్ముకాస్తూ, పేద ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. నగరంలోని సుమారు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు కబ్జాచేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. దీనిపై సమగ్ర ఆధారాలతో తాము అధికారులకు ఆ వివరాలు తెలియజేసినా, కబ్జాకు గురైన భూముల్ని ఇప్పటివరకు స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. సంక్షేమ పధకాలన్నీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకునే ఉపాధి పథకాలుగా మారాయని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా నగరంలో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలు, దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవడం జరిగిందని అన్నారు. అధికారులు అర్ధరాత్రి సమయంలో దాడిచేసి గుడిసెలను తొలగించడం అమానుషమన్నారు. బాధితులకు అండగా నిలిచిన తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని, రాజకీయ పార్టీల నేతలు ఆక్రమించిన వందలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే పేద ప్రజలతో కలిసి తమ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు బాధితులు రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బోర్గాం బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. బస్టాండ్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో సిపిఎం, సిఐటియు నాయకులు రమేష్‌బాబు, గోవర్ధన్, విజయలక్ష్మి, గణపతి, శంషుద్దీన్, మధు, న్యూడెమోక్రసీ, పిడిఎస్‌యు నాయకులు సాయిరెడ్డి, లింగం, భాస్కర్, సౌందర్య, అనే్వష్‌తో పాటు ఆయా పార్టీల కార్యకర్తలు, బాధిత ప్రజలు పాల్గొన్నారు.
రాస్తారోకో, ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం అరెస్టు చేసిన నేతల విడుదలకు డిమాండ్
english title:
thatched huts
Date:
Monday, October 15, 2012