నిజామాబాద్, అక్టోబర్ 14: అధికారుల అండతో గ్రామాల్లో మద్యం వ్యాపారం సాగిస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులను అనే్వషిస్తున్నారు. బెల్టుషాపుల నిర్వహణపై ఆరోపణలు తీవ్రతరం కావడంతో ఇటీవలి కాలంలో అధికారులు అడపాదడపా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో గొలుసు దుకాణాల వ్యాపారులు సైతం తమ రూటు మార్చారు. అధికారుల దాడుల బారి నుండే కాకుండా, ప్రజల దృష్టిలో సైతం పడకుండా ఉండేందుకు డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని మెజార్టీ గ్రామాల్లో ఫోన్‌లలో సమాచారంతోనే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో మద్యం కోసం కొనుగోలుదారు బెల్టు దుకాణానికి వెళ్లేందుకు శ్రమ పడకుండానే, వారు కోరిన ప్రాంతానికి మద్యం రప్పించుకుంటున్నారు. నిర్వాహకులు సైతం గుట్టుగా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుని, అంతే గుట్టుగా సదరు ప్రాంతానికి మద్యం బాటిళ్లను చేరవేస్తూ డబ్బులను మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతితో నడిచే మద్యం షాపులు మినహా ఇతర అనుమతి లేని బెల్టు షాపులను ప్రోత్సహించేది లేదంటూ జిల్లా అధికారులు పైకి పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, గొలుసు దుకాణాల ద్వారానే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. జిల్లాలో 137 లైసెన్సులు కలిగిన వైన్‌షాపులుండగా, దానికి పదిరెట్లు ఎక్కువగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం అమ్మకాలు ఒకింత తగ్గినట్లుగా బయటకు కనిపిస్తున్నా, లోలోపల మటుకు జోరుగానే ఈ తరహా దందా కొసాగుతున్నట్లు పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దాడుల నుండి తప్పించుకోవడానికి బెల్టు వ్యాపారులు కొత్త రూటును ఎంచుకున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ వెనుక గ్రామ కమిటీల ప్రోత్సాహం వున్న విషయం బహిరంగ రహస్యం. అయితే సదరు వ్యాపారి గ్రామస్థులకు సుపరిచితుడై ఉండడంతో ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని డోర్ డెలివరీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మద్యంప్రియులు తమకు కావాల్సిన బ్రాండును, తాముండే స్థలాన్ని ఫోన్‌లో సమాచారం ఇస్తే చాలు సదరు వ్యాపారులు నేరుగా అక్కడికే మద్యం బాటిళ్లు చేరవేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ సౌకర్యం బాగానే ఉన్నప్పటికీ కాస్త ఖర్చు ఎక్కువేనని చెప్పక తప్పదు. ఈ డోర్ డెలివరీ కార్యక్రమానికి గాను బెల్టు వ్యాపారులు ఒక్కో బాటిల్ వెనుక అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారు. బీరు బాటిలైనా, క్వార్టర్ బాటిల్ అయినా తేడాలేదు. అదనపు భారం మాత్రం పది రూపాయలే కావడం గమనార్హం. గొలుసు దుకాణానికి వెళ్లి మద్యం తెచ్చుకుంటే అంతకుమించి ఖర్చవుతోందని, పైగా విందు ప్రాంతానికే నేరుగా సరుకు అందుతున్నందున తాము అదనంగా చెల్లిస్తున్న పది రూపాయలు పెద్ద భారం కాదని మద్యం ప్రియులు అంటున్నారు. ఒకవేళ తామే విందు ప్రాంతం నుండి గొలుసు దుకాణానికి వెళ్లి మద్యం తెచ్చుకోవాలన్నా పెట్రోలు ఖర్చవుతుందని, అనవసరపు శ్రమకు గురి కావాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో అనేకమంది ఫోన్లలోనే మద్యం తెప్పించుకుంటున్నారు. మరోవైపు బెల్టు దుకాణాల నిర్వహకులు సైతం ఒక్కో బాటిల్ వెనుక 10 రూపాయల చొప్పున అధిక చార్జీలు వసూలు చేస్తూ విందులు జరిగే ప్రాంతాలకు చేరవేయడం ద్వారా అదనపు లాభాలను మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏ గ్రామంలోనైనా ఈ ఫోన్‌లలో జరుగుతున్న బెల్టు మద్యం వ్యాపారం లాభసాటిగా మారింది. మద్యం నిల్వలు మాత్రం భారీగానే గ్రామాలకు తరలుతున్నా, అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాగూ రహస్యంగానే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో దీనికి సదరు వ్యాపారులు సాకుగా చేసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం కూడా అమ్ముతున్నారని మద్యంప్రియులు వాపోతున్నారు. మామూళ్లు భారీగానే చేతులు మారుతుండటం వల్లే ఈ అక్రమ వ్యాపారాలపై సంబంధిత అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి మద్యం అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పల్లెల్లో పచ్చని సంసారాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రూటు మార్చిన బెల్టు షాపులు * తెరపైకి సరికొత్త విధానం
english title:
liquor door delivary
Date:
Monday, October 15, 2012