కోదాడ, అక్టోబర్ 14: జీవవైవిధ్య సదస్సుకు సంఘీభావంగా సత్యమేవజయతే సేవాసమితి ఆద్వర్యంలో విద్యార్ధులు తమ మొహాలకు వివిద జీవరాశుల మాస్క్‌లను ధరించి ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన ప్రదర్శన అందరిని ఆకట్టుకొంది. గాంధీపార్కులోని గాంధీజీ విగ్రహనికి పూలమాలవేసి కోదాడ రూరల్ సిఐ పి.శ్రీనివాస్‌నాయుడు జీవవైవిధ్య సంఘీభావ ర్యాలీని ప్రారంభించారు. జాతీయరహదారిమీదుగా రాజీవ్‌ఛౌక్ నుండి ఖమ్మం క్రాస్‌రోడ్‌వరకు విద్యార్ధులు వివిద పక్షులు, జీవరాశులు మాస్క్‌లను మొహాలకు ధరించి నిర్వహించి ప్రదర్శన ప్రజల్లో ఆలోచనను కలిగించింది. ‘జీవరాశులను రక్షించండి - పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వాడకం మానండి- పర్యావరణాన్ని కాపాడండి, వృక్షసంపదే జాతిసంపద, పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు, ప్రకృతే ప్రాణకోటికి తల్లివంటిది, పచ్చదనం, పరిశుభ్రతే ప్రగతికి నాంది’ తదితర నినాదాలున్న ప్లకార్డులను చేతపట్టుకొని విద్యార్ధులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదాడ సిఐ పి.శ్రీనివాస్‌నాయుడు మాట్లాడుతూ పక్షిజాతులు, జీవరాశులను కాపాడటం ద్వారానే మానవుడి మనుగడ సాధ్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ మానవుని బాధ్యతని, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘీభావ ర్యాలీని నిర్వహించిన సత్యమేవజయతే సేవాసమితి వ్యవస్ధాపకులు నాదెళ్ల బాలకృష్ణ మాట్లాడుతూ సృష్టిలోవున్న జీవరాశులు, వృక్షజాతుల సమాహారమే భారతదేశమని చెప్పారు. రేడియేషన్‌వలన పక్షులు అంతరించిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్ధితి కొనసాగితే పక్షులు ముందుతరాలకు తెలియకుండా పోయే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు జీవహింసను మాని జీవరాశుల పరిరక్షణకు కృషి చేయాలని బాలకృష్ణ కోరారు. కార్యక్రమంలో 1104 డివిజన్ కార్యదర్శి భాస్కర్, పి.ఇ.టి కె.ప్రభాకర్, టి.నారపరెడ్డి, వి.గోపి, సురేష్, విజయ్, భరణి, ప్రసన్నకుమార్, తమ్మర హైస్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు.
- పక్షులు, జీవరాశుల మాస్క్‌లతో ఆకట్టుకొన్న చిన్నారులు -
english title:
masks
Date:
Monday, October 15, 2012