Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సాధించగలను, సాధిస్తాను.. ... కథ

$
0
0

ఆంధ్రభూమి-నాటా కథల పోటీలో
ఎంపికైన రచన
........................
మధ్యాహ్నం రెండు గంటలకు ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్-9లో నా సహచరులిద్దరుతో ప్రవేశించగా నా సీటులో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. డబ్బు కట్టాను, టిటిఇ ఇక్కడ కూర్చోవచ్చునని అన్నాడు. నువ్వే వెళ్లి మరోచోట కూర్చో- విసుగ్గా, విసురుగా అన్నాడాయన.
‘‘నా సీటులో మరొకరిని కూర్చోమని చెప్పే హక్కు టిటిఇకి లేదు. మీకు టిక్కెట్ ఉందా అసలు?’’ తిక్కగా అడిగాను.
ఆయనకు రోషం పొడుకుచు వచ్చింది. సాధారణ టిక్కెట్‌తో బాటు స్లీపర్ ఛార్జి రశీదు చూపాడు. ఆయన సీటు నెంబరు డెబ్భై. అక్కడికే వెళ్లి కూర్చోమన్నాను. సైడ్ బెర్త్‌మీద కూర్చున్న ఒక పెద్ద మనిషి జోక్యం చేసుకుంటూ ‘‘పాపం.. ముసలాయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీ సీటు ఆయనకిచ్చేసి మీరు ఆయన సీటుకి వెళ్లవచ్చుకదా?’’ అని సలహా పారేశాడు.
‘‘నేను మిత్రులతో వచ్చాను. మీరు ఒంటరిగా ఉన్నారు. మీరే ఆయనకు సీటిచ్చి మీరు డెబ్భైకి వెళ్లవచ్చు కదా?’’ అన్నాను చిరాగ్గా. అంతే. అతగాడు నోరు మూసుకోగా, ముసలాయన రుసరుసలాడుతూ వెళ్లిపోయాడు.
మేము మా బెర్త్‌మీద కూర్చున్నాం. ఎదుటి బెర్త్‌మీద ఉన్న ముగ్గురూ విశాఖ వెళ్లాలి. విజయనగరంలో బండి ఆగగానే బోలెడుమంది బిరబిరా బండెక్కారు. ఒక కుటుంబం- ముగ్గురు మహిళలు, ఒక పెద్దమనిషి- చరచరా వచ్చి మా కాళ్లు ఎత్తేసి మా బెర్త్ కింద, ఎదుటి బెర్త్ కింద సంచులు, మూటలు, సూట్‌కేసులు-మొత్తం పదహారు శాల్తీలు దూర్చేశారు. టిటిఇ వచ్చి ఆ పెద్దమనిషితో ఏదో మాట్లాడి వెళ్లాక నాకు అర్థం అయింది ఆ పెద్దమనిషి రైల్వే ఉద్యోగి అని.
‘‘బాబూ! లేడీస్ నిలబడిపోయారు. మీరు విశాఖలోనే కదా దిగేది. ఓ గంట ప్రయాణం. మీరు మరోచోట సర్దుకోండి’’ అన్నాడాయన ఎదుటి బెర్త్ వాళ్లతో- ఆనతో, వినతో తెలియని స్వరంలో.
ఆ మహిళల్లో ఒకామె నిండు గర్భిణి. ఆమెను చూడగానే ఎదుటి బెర్త్ వారిలో సానుభూతి ఉప్పొంగి లేచి వెళ్లిపోయారు.
గర్భవతి గీత కిటికీ వద్ద కూర్చోగా ఆమె పక్కన తల్లి, ఆ పక్కన మేనత్త. అత్తవారింట సీమంతం చేయించి అమ్మాయిని పుట్టింటికి విజయవాడ తీసుకెళ్తున్నారు. గీత ముఖంలో నీరసం, కళ్లలో అలసట తెలుస్తూనే ఉన్నాయి.
బండి ఎక్కినది మొదలు మేనత్త ఫోన్లు చేస్తూనే ఉంది.
‘‘ఒరేయ్ రామం! మేము తొమ్మిదో కోచ్‌లో ఉన్నాం. ఒక అరగంటలో విశాఖ చేరుకుంటాం. గీతకి మిరపకాయ బజ్జీలు ఇష్టం. స్టేషన్‌కు పట్టుకు రారా!’’
‘‘ఒసేయ్ బుజ్జీ! గీతని విజయవాడ తీసుకెళ్తున్నాం. బండిలో ఉన్నాం. అత్తారు సీమంతం బాగానే చేశారులే’’
‘‘ఆఁ ఏం బాగులే! మా తోడి కోడలుకి చంద్రహారం పెట్టారు. నాకేం పెట్టారు? ఉంగరం ముక్కైనా పెట్టలేదు!’’ కిటికీలోంచి బయటకు చూస్తున్న గీత ఓపిక తెచ్చుకుని మరీ అంది- ఇటు వైపు ముఖం తిప్పి.
‘‘సరి సరి! మీ బావగారు రెండు చేతులా సంపాదిస్తున్నాడు. చంద్రహారం కకపోతే వడ్డాణం పెట్టగల సమర్థుడు. మరి నీ మొగుడికి చాదస్తం ఎక్కువ. నీతి, నిజాయితీ అంటూ జీతం రాళ్లతోనే నెట్టుకొస్తున్నాడు. అయినా నలుగురినీ పిలిచి ఘనంగా భోజనాలు పెట్టి ధూంధాంగా సీమంతం జరిపించాడు కదా’’ అల్లుడిని వెనకేసుకొచ్చింది అమ్మ.
అసంతృప్తిగా ముఖం అటు తిప్పుకుంది గీత.
‘‘ఇప్పుడైతే ఫర్వాలేదుగాని బిడ్డలు పుట్టాక ఖర్చులే ఖర్చులు. ఆడపిల్ల అయితే మరీనూ! నీ మొగుణ్ణి నెమ్మదిగా ముగ్గులోకి దించవే తల్లీ!’’ మేనత్త సలహా.
అమ్మ కొంచెం వంగి బెర్త్‌మీద ఉన్న సంచిని లాగి యాపిల్స్, ద్రాక్షలూ బయటకు తీసింది. గర్భవతి ద్రాక్ష తినకూడదని మేనత్త అనుమానం. గీతకు యాపిల్ ఇచ్చి అమ్మ, మేనత్త ద్రాక్షల పని పట్టారు.
రైల్వే సీజన్ టికెట్ చాలా చౌక. అందుకని సమీప పట్టణాల్లోని కాలేజీలకు, ఆఫీసులకూ వెళ్లి రావడానికి విద్యార్థులు, ఉద్యోగులూ రైళ్లను ఆశ్రయిస్తారు. వాళ్లు జనరల్ బోగీలో తప్ప స్లీపర్ కోచిలో ఎక్కకూడదు. కానీ స్లీపర్ కోచిల నిండా వాళ్లే ఉంటారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఇప్పుడు కూడా వాళ్లు ఒక కోచిలోంచి మరో కోచిలోకి మందలు మందలుగా వస్తున్నారు. ఎక్కడ అందమైన అమ్మాయిలుంటే అక్కడొక మంద వాలుతోంది. గోలగోలగా వాగుతూ, బిగ్గరగా నవ్వుతూ కోరస్‌గా అరుస్తున్నారు. వాళ్లని అదుపు చేసే వాళ్లే లేరు. ఘర్షణ పడితే టిటిఇని కూడా నడుస్తున్న రైలులోంచి బయటకు నెట్టేసే మంది బలం వాళ్లది.
కొద్ది దూరంలో కిటికీ వద్దనున్న సింగిల్ సీటులో ఉన్న అందమైన అమ్మాయి చుట్టూ ఒక ముఠా మూగింది. అమ్మాయిని ఆట పట్టిస్తున్నారు. ఇక్కడకు మాటలు వినిపించకపోయినా చేష్టలు కనిపిస్తున్నాయి. అమ్మాయి తండ్రి కాబోలు- వాదనకు దిగాడు గానీ వాళ్లు లక్ష్య పెట్టలేదు. మిగిలిన వారు చోద్యం చూస్తున్నారు గానీ జోక్యం చేసుకోలేదు.
నాలో రక్తం మరిగిపోయింది. ఆవేశం తన్నుకొచ్చింది. చటుక్కున అక్కడకెళ్లి అమ్మాయిని వేధిస్తున్న జుట్టుపోలిగాడి కాలర్ పట్టుకొని నా బెర్త్ వరకు బరబరా లాక్కువచ్చాను. నా మిత్రులు వాడిని కింద కూర్చోబెట్టి పైకి లేవకుండా రెండు వైపులా వాడి భుజాల్ని నొక్కిపట్టారు. లిప్తకాలంలో జరిగిన ఈ ఘటనకు అందరూ షాక్ అయ్యారు. తేరుకున్న వాడి ఫ్రెండ్స్ నా మీద అరవడం మొదలుపెట్టారు.
‘‘షటప్! స్లీపర్ కోచిలో ఎక్కి ప్రయాణీకుల్ని ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏదో మూల సర్దుకుంటే పోనీలెమ్మని ఊరుకోవచ్చు. కానీ అమ్మాయిల్ని వేధించడం క్షమించరాని నేరం’’ గర్జించాను.
‘‘నువ్వెవడివిరా.. మాకు రూల్స్ చెప్తున్నావ్!’’ అరుస్తూ ఒక చిరుగుల ఫ్యాంట్ ఫ్యాషన్ల చిన్నోడు నామీదకు ఉరకడం, నేను వాడి చెంప ఛెళ్లు మనిపించడం, విద్యార్థుల గోల ఠక్కున ఆగిపోవడం- అన్నీ అర క్షణంలోనే!
అప్పర్ బెర్త్ మీద కూర్చున్న రైల్వే ఉద్యోగిని ఆదేశించాను. ‘‘టిటిఇని వెంటనే ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి’’.
ఆయన ఫోన్ చేసిన ఐదు నిమిషాలకు టిటిఇ వచ్చాడు.
‘‘విశాఖ రైల్వే పోలీసుకి ఫోన్ చెయ్యండి. మన బండి విశాఖ చేరగానే ఈ పోకిరి కుర్రాళ్లని అరెస్టు చేయడానికి మన కోచ్ వద్ద సిద్ధంగా ఉండా లి!’’ఆజ్ఞలాగా అన్నాను.
ఇటిఇ బిత్తరపోయాడు. పోలీస్ అన్నమాట చెవిలో పడగానే విద్యార్థుల నోళ్లు పడిపోయాయి. వాళ్ల ముఖాల్లో భయం. వ్యవహారం చాలా దూరం వెళ్లేట్టు కనిపించడంతో లెక్చరర్ కాబోలు కలగజేసుకుని ‘‘వాడిని వదిలేయండి సార్! అరెస్టు చేస్తే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది’’ అన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా జాలి కురిపించేసి వాడిని వదిలేయమన్నారు.
‘‘మీ చెల్లినో, కూతురునో వీళ్లు ఇలాగే వేధిస్తే అప్పుడు కూడా మీరు వీళ్లని వదిలేయమనే అంటారా?’’ అసహనంగా అడిగాను. ఎవరూ మాట్లాడలేదు.
‘‘మీరు లెక్చరర్. కనీసం మీరైనా క్రమశిక్షణతో మెలగాలి. కానీ మీరు కూడా సీజన్ టిక్కెట్‌తో స్లీపర్ క్లాసులో ప్రయాణం చేస్తున్నారు. మీ విద్యార్థులు ప్రయాణీకుల ప్రశాంతతకు భంగం కలిగిస్తోంటే చూస్తూ ఊరుకున్నారు గానీ మందలించలేదు’’ లెక్చరర్‌వైపు సూటిగా చూస్తూ అన్నాను.
‘‘ఇది కాలేజీ కాదు!’’ రోషంగా అన్నాడాయన.
‘‘లెక్చరర్‌గా వద్దు.. కనీసం జంటిల్మన్‌గా అయినా వీడిని వారించవచ్చు కదా!’
ఆయనకు పౌరుషం పొడుచుకొచ్చింది ‘‘టిటిఇనే ఊరుకున్నాడు, మధ్యలో మీకెందుకు దురద?’’ అంటూ జారుకున్నాడు.
‘‘నన్ను వదిలేయండి సార్! ఇంకెప్పుడూ ఇలా చెయ్యను’’ జుట్టుపోలిగాడు ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. వీడికి ఈ మాత్రం శిక్ష చాలని బండి స్టేషన్‌లో ఆగగానే వదిలేశాను. విద్యార్థులందరూ బిలబిలా పారిపోయారు.
ఎదుటి బెర్త్ మేనత్త బండి దిగి కిటికీ సమీపంలో ప్లాట్‌ఫాం మీద నిలబడింది. రామం హడావిడిగా వచ్చి బజ్జీల ప్యాకెట్ గీత కిచ్చి తన ప్రతాపం చాటుకున్నాడు.
వాళ్ల ఆఫీసర్ చండశాసనుడట. సెలవులు, పర్మిషన్లు ఇవ్వడుట. అందుకని- బజ్జీలు తెమ్మని మేనత్త ఫోన్ చెయ్యగానే ఏడుపు ముఖంతో ఆఫీసర్ వద్దకెళ్లి ‘‘మా బామ్మకి హఠాత్తుగా సీరియస్ అయిందట. ఆస్పత్రిలో ఎడ్మిట్ చేశారట. వెళ్లిచూడాలి సార్!’’ కంటూ కన్నీళ్లు కురిపించాడట.
ఆ చండశాసన ఆఫీసర్ వెధవ కరిగిపోయి సరే వెళ్లమన్నాడట.
‘‘ఒరేయ్! నువ్వు మహానటుడివిరా! బజ్జీలు తెచ్చేందుకు రెండేళ్ల క్రితమే పోయిన మీ బామ్మని బతికించి ఆస్పత్రిలో పడేశావన్నమాట!’’ మెచ్చుకుంది మేనత్త. కాలర్ ఎగరేశాడు రామం.
బండి కదిలింది. బండితోబాటు నడుస్తూ గీతకు, వాళ్లమ్మకు తుది సలహాలు ఇస్తూ బండి వేగం అందుకోగానే ఫ్లాట్‌పాంమీద ఆగిపోయింది మేనత్త. ఆమె ఖాళీ చేసిన చోట ఈసారి రైల్వే ఉద్యోగి కూర్చున్నాడు.
విజయనగరం నుంచి విశాఖ వరకు వచ్చిన మేనత్త టికెట్ కొనలేదని తెలుస్తూనే ఉంది. రామం కూడా ఫ్లాట్‌పాం టికెట్ కొని ఉండడు. ఎందుకంటే వాళ్లది రైల్వేకుటుంబం కదా!
ఎదురుగా కూర్చున్న ఆ రైల్వే ఉద్యోగిని అడిగాను ‘‘ఈ బెర్త్ విశాఖ వరకు రిజర్వ్ అయి ఉంది కదా. మరి మీకెలా విజయనగరం నుంచి బెర్త్ ఇచ్చారు?’’
మాది రైల్వే కుటుంబం కదా!-అని నవ్వేశాడు. నాకర్థం అయిపోయింది.
వాళ్ల టిక్కెట్ విశాఖ నుంచి విజయవాడకు! కానీ వాళ్లు బండి ఎక్కింది విజయనగరంలో! అంటే విజయనగరం నుంచి విశాఖ వరకూ ఫ్రీ!
మళ్లీ మామూలే. సీజన్ టిక్కెట్ తండాలు!
వారిమధ్యనుంచి దారి చేసుకొని కాఫీ, టీ, సమోసా, నీళ్ల సీసాలు, కూల్‌డ్రింక్స్ అమ్మకాలు. అవి చాలనట్లు కూరగాయలు, సపోటాలు అమ్మకాలు! రెండు రూపాయలు విలువ చేసే కాఫీ, టీలు ఐదు రూపాయలకు సంకోచం లేకుండా జనం కొనుక్కుంటున్నారు. మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్ కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువకే కొంటున్నారు. అధిక ధరల మీద ఎవరికీ పట్టింపు లేదు. ఎక్కువ ధరకు కొనడం అవినీతిని ప్రోత్సహించడమే. అమ్మేవాళ్లతో గొడవ పడడం నామోషీ. కొనడం మానెయ్ అంటాడు వాడు. కొనకుండా ఉండలేడు వీడు! అవినీతి సాగిపోతూనే ఉంటుంది.
అందుకనే నేను ప్రయాణాల్లో టీ, బిస్కెట్లు, మంచినీళ్లు తెచ్చుకుంటాను. కొనుక్కోను. అలా అవినీతిని ఒక పిసరు అరికట్టినందుకు నాకు అదో సంతృప్తి.
ఈలోగా టిటిఇ నన్ను రమ్మని తన సీటు వద్దకు తీసుకెళ్లి తన ఫ్లాస్క్‌లోని టీ ఇచ్చాడు. వద్దన్నా వినలేదు. ‘‘నిన్ను చూస్తూంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నట్లుంది బాబూ!’’ అన్నాడు. ఆయన పక్కన కూర్చుని టీ కప్పు అందుకున్నా.
‘‘ఏం చేస్తున్నావ్ బాబూ!’’ ఆప్యాయంగా అడిగాడు.
చెప్పాను. నేను ఒక జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ని. ప్రభుత్వం కారు ఇచ్చింది. ట్రెయిన్‌లో అయితే ఫస్ట్ ఏసీ క్లాసులో ప్రయాణం చేయవచ్చు. కాని సామాన్య ప్రజల్లో ఉండాలని వీలైనంత వరకు స్లీపర్ కోచ్‌లోనే ప్రయాణిస్తూ ప్రజల మనోభావాలు గమనించడం ఒక సరదా. ప్రభుత్వం నుంచి స్లీపర్ ఛార్జీలే తీసుకుంటా.
ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి చూశాడు. ఆయన వైఖరి మారిపోయింది.
‘‘ఎదుటి బెర్త్ మీదున్న యువకుల కబుర్లు విను బాబూ’’ అన్నాడు వినయంగా. అక్కడున్న ఇద్దరిలో ఒకడికి కలెక్టర్ అవ్వాలన్న ఆశ. రెండోవాడి ఓటు రెవెన్యూ సర్వీస్‌కి. ఎందుకంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ సంపాదన కలెక్టర్ సంపాదనకంటే ఎక్కువ! ఒక ఎమ్మార్వో ఐదు వందల కోట్లు సంపాదించాడు.
‘‘ఏం లాభం? ఆ ఎమ్మార్వోని ఏసిబి పట్టుకుంది కదా’’
‘‘ఏసిబి పట్టుకుంటే ఏమవుతుంది? మంత్రిగారికి పది కాకపోతే పాతిక కోట్లు పారేస్తే చాలు ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇవ్వకుండా రక్షిస్తాడు!’’
‘‘చూశావా బాబూ, నేటి యువతరం ఆలోచనలు!’’ వినమ్రంగా అన్నాడు టిటిఇ. టీ కప్పు కడిగేసి తెచ్చి ఆయనకిచ్చాను.
‘‘ఇరవై ఏళ్లుగా ఈ కోచిల్లో అందమైన అమ్మాయిల్ని వేధించే కుర్రాళ్లని చూస్తూనే ఉన్నాను. ఎవరూ పట్టించుకోరు. ఇనే్నళ్లకు నువ్వు కనిపించావు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబూ’’ అని కాసేపాగి చెప్పాడు.
‘‘నేను సర్వీసులో చేరిన కొత్తలో నేనూ నీలాగే ఉండేవాడిని. అవినీతిని సహించేవాడిని కాను. పోకిరీ కుర్రాళ్లతో ఘర్షణపడితే వేగంగా వెళ్తున్న రైలులోంచి నన్ను బయటకు తోసేశారు. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలు తగలలేదు. కానీ నేను కేసు పెడతానేమో అని భయపడి ఆ కుర్రాళ్లలో ఒకడు నామీదనే పెట్టాడు -కులం పేరుతో దూషించానని! రెండేళ్లు కోర్టుల చుట్టూ తిరిగి చివరకు నా నిజాయితీ నిరూపించుకున్నాను. ఇంట్లో ఒక మతం, వీధిలో మరో మతం పాటిస్తూ రెండు మతాల ప్రయోజనాలు పొందే అవినీతిపరులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ల గురించి తెలిసినా మనం రిపోర్ట్ చేయకూడదన్న ఖరీదైన పాఠం నేర్చుకొని వ్యవస్థతో రాజీపడి ఏదో ఇలా బతికేస్తున్నా’’ అంటూ పక్క కోచిలోకి వెళ్లిపోయాడు టిటిఇ.
నేను ఆలోచిస్తూ నా బెర్త్‌వద్దకు వెళ్లి కూర్చున్నా.
లంచాలు ఒక్కటే అవినీతి కాదు. నీతి, రీతి తప్పిన ప్రతి పనీ అవినీతే. అమ్మాయిల్ని వేధించే కుర్రాళ్లు, అధిక ధరలకు అమ్మేవారు, కొనేవారు, టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారు, మరొకరి సీటులో కూర్చుని అది తనదే దబాయించేవారు, కబ్జాదారులూ అందరూ అవినీతిపరులే. అయితే శోచనీయం ఏమంటే ఎవరూ తాము చేస్తున్నది అవినీతి అనుకోవడం లేదు. వాళ్ల దృష్టిలో తమకంటే పైస్థాయిలో ఉన్నవాడు, తమకంటే ఎక్కువ సంపాదించేవాడు అవినీతిపరుడు! అందరూ ఎవరి స్థాయిల్లో వాళ్లు లంచాలు మేస్తున్నా అటెండర్ దృష్టిలో గుమాస్తా, అతని దృష్టిలో సూపరింటెండెంట్, అతని దృష్టిలో బాస్, బాస్ దృష్టిలో కలెక్టరు, ప్రజల దృష్టిలో రాజకీయ నాయకులూ అవినీతిపరులు!
ప్రజలు మొదట తమ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చి తర్వాత దేశంలో మార్పు గురించి ఆలోచించాలని అన్నాహజారే అన్నారు. నేను చేస్తున్నది అదే.
నిజాయితీగల అధికారిగా మా జిల్లాలో పేరుంది. నాకు ఏసి క్లాసు, ప్రభుత్వ కారులో కాక సాధ్యమైనంతవరకు స్లీపర్ క్లాసులోనే ప్రయాణిస్తూ ప్రభుత్వం నుంచి స్లీపరు ఛార్జిలే తీసుకుంటూ ప్రజలమధ్య ఉంటూ వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నా. నాతో ఇప్పుడున్న మిత్రులిద్దరూ ఆఫీసర్లే. వాళ్లని మార్చి నా మార్గంలోకి తెచ్చుకోగలిగాను. ఈ వ్యవస్థను మార్చడానికి చేయగలిగినదంతా చేస్తాను. సాధించగలను. సాధిస్తాను!

పిసి పట్నాయక్ (ప్రఫుల్లచంద్ర),
2-28-5 (మేడమీద), చేడూరి వారి వీధి,
శ్రీనగర్, కాకినాడ- 533 003.

మధ్యాహ్నం రెండు గంటలకు ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో
english title: 
story
author: 
- ప్రఫుల్లచంద్ర

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>