‘‘సరే! నీకేది బావుంటే అది చెయ్యి. ఈ ఇల్లు కాస్త ఇరుగ్గా ఉన్నది మాత్రం నిజమే అనుకో... కానీ ఏ అవసరమొచ్చినా నిర్మొహమాటంగా నన్నడుగు...’’ అన్నాడు భానుమూర్తి.
తొలి జీతం అందుకున్నాక మేనత్తకీ, మేనమామకీ కొత్త బట్టలు తెచ్చాడు పవన్. అర్చనకీ, కార్తీక్‌కీ చెరో రెండొందలూ ఇచ్చాడు ఏవన్నా కొనుక్కోమని. భానుమూర్తి కళ్లు అప్రయత్నంగా చెమర్చాయి.
పవన్‌కుమార్ ఆ మర్నాడు బ్యాగు సర్దుకుని వెంకట్రత్నం ఫ్రెండు నవీన్ ఫ్లాట్‌లోకి మకాం మార్చాడు. వెంకట్రత్నం ముందు రోజు ఫోన్ చేసి చెప్పి, పవన్‌నీ తీసికెళ్లాడు.
‘‘వెల్‌కమ్... నా పేరు నవీన్. పూర్తి పేరయితే నవీన్ పట్నాయక్.. అలాగని నేను ఒడిశా వాడిని కాదండి.. పక్కా ఆంధ్రావాడిని.. ఐమీన్ ఉత్తరాంధ్రావాడిని. ఈ ఫ్లాట్‌లోమీరు ఫ్రీగా ఉండొచ్చు.
ఏ రకమైన రిస్ట్రిక్షన్లూలేవు. మడులూ తడులూ లేవు. మీకున్నా నాకభ్యంతరం లేదు...’’ అంటూ గలగల మాట్లాడేశాడు నవీన్.
అతడి తొలి పరిచయమే పవన్‌కి సరదా వేసింది. సంతోషంగా చేయి కలిపాడు.
రూములో నేలమీద చాప, దానిమీద పరుపూ వేసి ఉన్నాయి. ఆ పరుపు మీదా, ప్రక్కనా పేపర్లూ, పుస్తకాలు, ఆ ప్రక్కనే సూటుకేసు, దానిమీద విడిచిన బట్టలూ ఉన్నాయి. హాల్లో పోర్టబుల్ టీవీ ఉంది.
‘‘రైస్ కుక్కర్ ఉంది సార్. అన్నం మాత్రం వండుకుంటాను. కర్రీ పాయింట్‌లో కావల్సినవని తెచ్చుకుంటాను. ఒక్కోసారి వండుకోవడం కుదర్దు. బయటే ఏదో తినేస్తుంటాను. రిపోర్టర్‌ని కదా ఒక టైమంటూ ఉండదు ఉద్యోగానికి...’’ నవీన్ చెప్పాడు.
ముగ్గురూ కాస్సేపు కబుర్లు చెప్పుకున్నారు లోకాభిరామాయణం. తర్వాత కిందికెళ్లి టీ తాగారు. వెంకట్రత్నం వెళ్లిపోయాడు ఇంటికెళ్లి తయారై ఆఫీసుకు రావాలిగనక.
‘‘సర్! మీ భోజనం?’’ ఫ్లాట్‌కొచ్చాక అడిగాడు పవన్‌ని నవీన్.
‘‘ముందు ఆ సర్ అన్నమాట తీసెయ్. ఇక నుంచి మనిద్దరం ఇక్కడుంటున్నవాళ్లం. పవన్ అని పిలు. నేను నవీన్ అంటాను’’ పవన్ అన్నాడు నవ్వుతూ.
‘‘ష్యూర్... ఇక చెప్పు.. నీ ఫుడ్ సంగతేమిటి ఈ రోజు?’’ అడిగాడు నవీన్ నవ్వుతూ.
‘‘ఇప్పుడేం అక్కర్లేదు. మా మేనత్త దండిగా ఇడ్లీలు పెట్టి మరీ పంపింది. మధ్యాహ్నం ఆఫీసు దగ్గరేదో తినేస్తాను...’’
‘‘ఆల్‌రైట్. సాయంత్రం ఎన్నింటికొస్తావ్?’’
‘‘ఆరున్నరా ఏడు గంటలకి’’
‘‘నీ దగ్గరో కీ ఉంచుకో... ఇకపోతే... నీకభ్యంతరం లేదంటే వంట చేసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి.. లేకపోతే ఎక్కడలేని డబ్బూ చాలదు..’’ సంశయంగా అన్నాడు నవీన్.
‘‘ఏ మాత్రం అభ్యంతరం లేదు....’’ చెప్పాడు పవన్.
‘‘గుడ్! అయితే మొత్తం వంటకీ, పనిమనిషికీ అంతా ఖర్చుపెట్టి షేర్ చేసుకుందాం...’’
‘‘ఓకే! అలాగే చేద్దాం’’
‘‘లేదు. సెల్ కొనుక్కోవాలి’’
‘‘సరే! తొందరపడి కొనొద్దు. మా ఫ్రెండు దగ్గరో సెల్ ఉంది. వాడు అమ్మేస్తానంటున్నాడు కనుక్కుంటాను. మనీ కూడా వెంటనే ఇవ్వక్కర్లేదు’’
‘‘్థ్యంక్యూ...’’
‘‘కార్పొరేట్ కల్చర్ బాగా వంటబట్టేసింది’’ నవీన్ మాటలకి ఇద్దరూ నవ్వుకున్నారు.
9
వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ఆదివారం.
పవన్ బ్రష్ చేసుకొచ్చేసరికి నవీన్ కాఫీ కలిపి రెండు గ్లాసులలో పోసి తెచ్చాడు. ఆ వారం రోజులకే వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
నవీన్ కలివిడి మనస్తత్వం ఉన్న మనిషి. అతడు మనసులో ఏ కల్మషాలు పెట్టుకోడు. స్నేహం అంటే అతడు మనసారా చేయి అందిస్తాడు. ఈ పని నువ్వుచేయాలి. ఆ పని నేను చేస్తాను లాంటి నిబంధనల గీతలూ గీయడు.
జీవితం ఒక స్వచ్ఛమైన ప్రవాహం లాంటిదని, చిన్న చిన్న పిల్లకాలువల్ని కలుపుకుని దాన్ని ఎంత స్వచ్ఛందగా ప్రవహింపచేస్తే అంత నిండుగా ఉంటుందని నమ్మేవాడతడు.
సాటి మనిషి పట్ల సమాజం పట్ల, జీవితం పట్ల మనిషిగా కొన్ని బాధ్యతలున్నాయని, వాటిని సక్రమంగా నెరవేర్చాలని అంటాడతడు.
ఈ వారం రోజుల్లో నవీన్ ఏమిటో పవన్‌కి బాగా అర్థమయ్యింది. తన ఆలోచనలకి దాదాపు దగ్గరగా ఉన్న వ్యక్తి తనకి రూమ్‌మేట్ అయినందుకు అతడికి సంతృప్తిగా అనిపించింది. అందుకే ఎవరికి వీలున్నప్పుడు వాళ్లు వంట చేసెయ్యడం, గినె్నలు కడిగెయ్యడం, నావి, నీవి అనకుండా బట్టలు ఉతుక్కోవడం చేసేసుకుంటున్నారు.
‘‘నాలుగు వారాలుగా వీక్లీహాఫ్ లేక బోర్ కొట్టేస్తోంది... అందుకే ఈ రోజు డ్యూటీకి రానని చెప్పేశాడు. రేపు మండే నాకు వీక్లీహాఫ్. రెండు రోజులు రెస్టన్నమాట’’ కాఫీ గ్లాసు పవన్‌కిచ్చి అన్నాడు నవీన్.
‘‘మరీ వీక్లీ హాఫ్‌లు లేకుండా ఎలా? నువ్వన్నట్లు బోరే..’’ పవన్ అన్నాడు పరుపుమీద కూర్చుని గోడకి జారబడి.
‘‘మా డ్యూటీ అంతే పవన్! ఫోను చేస్తారు. వెళ్లక తప్పదు. అందుకే ఊళ్లో ఉండటం లేదని చెప్పాను. నిజానికి నాలుగు రోజులు సెలవు పెట్టి మా వూరు వెళదాం అనుకున్నాను...’’
‘‘వెళ్లాల్సింది మరి...’’
‘‘నెక్స్‌ట్‌మంత్ వెళతాను... మా వెడ్డింగ్ డే ఉంది.. ఇప్పుడూ వెళ్లి అప్పుడూ వెళ్లడం కుదర్దు సెలవు ఇచ్చి చావరు....’’
‘‘్ఫ్యమిలీ అక్కడ... నువ్విక్కడ.. చికాగ్గా లేదూ?’’
‘‘చికాగ్గానే ఉంది. అప్పుడప్పుడు జాబ్ రిజైన్ చేసి పోదామనిపిస్తుంది.. కానీ ఇంత శాలరీతో అక్కడ ఉద్యోగాలేం దొరుకుతాయ్?!’’
-ఇంకాఉంది