రాజకీయ పార్టీలన్నీ అన్యోన్య సహకారంతో అవినీతి చరిత్రను నిర్మిస్తుండడం కొత్త విషయం కాదు. దశాబ్దులుగా నడుస్తున్న ఈ దగుల్బాజీ నాటకంలో రోజుకొకటి, రెండు, మూడు, నాలుగు చొప్పున ఆవిష్కృతమైపోతున్న వికృత దృశ్యాలు అలజడి సృష్టించడం, అంతలోనే మరుగైపోవడం కూడ వింత కాదు. చట్టాలను అమలు జరుపవలసిన వారు కాని, సాధారణ జనంకాని ఎన్నని చూడగలరు? గుర్తు పెట్టుకోగలరు? అందువల్ల అరవింద కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘అవినీతి వ్యతిరేక భారత్’-ఐఏసి- వారు తమకు వ్యతిరేకంగా వెల్లడిస్తున్న ఆరోపణలను గురించి ఏ ప్రముఖ రాజకీయవేత్త కూడ పెద్దగా పట్టించుకోవడం లేదు. కొందరు ఆరోపణలను ఆర్భాటంగా ఖండిస్తున్నారు. మరికొందరు ప్రముఖులు సమాధానం చెప్పడం కూడ మానుకొని, నిమ్మకు నీరెత్తినట్టు పదవులను వదలకుండా పదిలంగా ఉండగలుగుతున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు మరింత బరితెగించి అరవింద కేజ్రీవాల్ బృందం వారి అంతు చూస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారు కూడ! ఇంత జరిగిపోతున్నప్పటికీ అవినీతి పెద్ద సమస్యగా జనంలో చర్చకు గురికాకపోవడం కూడ ఆశ్చర్యకరం కాదు. ప్రజలు నిస్సహాయులై అవినీతి రాజకీయానికి అలవాటు పడిపోయారు. గత రెండు వారాల వ్యవధిలో ‘ఐఏసి’ వారు మాత్రమే కాక ఇతరులు కూడ ప్రముఖ రాజకీయ వేత్తలకు, వారి బంధువులకు వ్యతిరేకంగాను గుప్పిస్తున్న ఆరోపణలు ఎలాంటి విస్ఫోటనాలను సృష్టించకపోవడం ఇందుకు సాక్ష్యం. ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా మాజీ కేబినెట్ కార్యదర్శి కెనమ్ చంద్రశేఖర్ చేసిన తీవ్రమైన ఆరోపణ అవినీతి ప్రహసనంలో సరికొత్త ఘట్టం! రెండవ శ్రేణి టెలికాం తరంగాల -2జి స్పెక్టరమ్- కేటాయిపు కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ విచారణ సమయంలో ఈ అత్యున్నత అధికారి ఈ సంగతులు బయటపెట్టడం విశ్వసనీయతను సంతరించుకున్న పరిణామం. తన మాటలను పెడచెవిని పెట్టి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ ఖజానాకు ముప్పయి ఆరువేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్ల చేశాడన్నది చంద్రశేఖర్ ఆరోపణ! ఈ ఆరోపణ ప్రాతిపదికగా ప్రధాని వెంటనే పదవికి రాజీనామా చేయాలన్న వాదాన్ని భారతీయ జనతాపార్టీ మరోసారి వినిపించవచ్చు. కానీ అవినీతి గ్రస్త రాజకీయ చరిత్రలో మొదటి స్థానం కోసం అధికార పార్టీతో ‘్భజపా’ పోటీ పడుతోందని కూడ కేజ్రీవాల్ బృందం మాత్రమే కాక ఇతరరులు సైతం వెల్లడించిన వివరాల వల్ల ధ్రువపడిపోయింది. పార్టీ అధ్యక్షడు నితిన్ గడ్కారీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు భాజపా వారిని నిజానికి బెంబేలెత్తించాలి. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఐఏసి చేసిన ఆరోపణలు అన్నీ నిజాలని నిర్ధారించడం ద్వారా ‘్భజపా’ వారు ఆ సంస్థ ప్రామాణికతను, నిష్పక్ష వైఖరిని ధ్రువీకరించి ఉన్నారు. అందులో ఐఏసి వారు గడ్కారీపై కూడ చేసిన ఆరోపణలను కూడ ‘్భజపా’వారు నిజమని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే తమపట్ల, ప్రత్యర్థుల పట్ల ‘్భజపా’వారు సమాన ప్రమాణాలను పాటించినట్టు కాగలదు. కానీ ‘ఐఏసి’ విశ్వసనీయత కోల్పోతోందని మాత్రమే ‘్భజపా’ అధిష్ఠానం వారు వ్యాఖ్యానించారు. మరి ఈ ‘విశ్వసనీయత లేని తనం’ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు, కాంగ్రెస్ అధ్యక్షురాలి అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వెల్లడించిన విషయాలకు కూడా వర్తిస్తుందా?? తమ నాయకులకు వ్యతిరేకంగా ఆరోపణలను గుప్పించిన కేజ్రీవాల్ విశ్వసనీయతను శంకించిన కాంగ్రెస్ పార్టీవారు, ‘ఐఏసి’ వారు గడ్కారీ వ్యతిరేక ఆరోపణలు మాత్రం నిజమని ప్రచారం చేస్తున్నారు. అంటే ఏమిటి?? రెండు ప్రధాన జాతీయ పార్టీలు అరవింద ఆరోపణల విషయంలో ‘గురివింద’లుగా రూపొంది ఉన్నాయి!!
పూణె నగర సమీపంలో పట్టణ వాటికలను నిర్మించే నెపంతో ‘లావాసా’ అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థకు వేలాది ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం ఇప్పుడు పాత కధ. కానీ ఇందులో దాదాపు మూడు వందల యాబయి ఎకరాల భూమి మహారాష్ట్ర ప్రభుత్వానిదన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఇలా ప్రభుత్వ భూమిని ‘లావాసా’ సంస్థకు అప్పగించడంలో కేంద్ర మంత్రి శరద్‌పవార్ కుటుంబం పాత్ర ఉందన్నది మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన యోగేశ్ ప్రతాప్ అనే న్యాయవాది బయటపెట్టిన విషయం. పవార్ సోదరుని కుమారుడు అజిత్ పవార్ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండిన సమయంలో ఈ కుంభకోణం జరిగిపోయిందట. ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండిన సమయంలో విదర్భ ప్రాంతంలో అనేక పథకాలు అవినీతి గ్రస్తమయ్యాయన్నది బహిరంగ రహస్యం. ఈ ఆరోపణ ప్రాతిదదికగా ఇటీవల అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడ చేయవలసి వచ్చింది. ఇప్పుడు బయటపడిన కుంభకోణం ఆయన అపకీర్తి కిరీటంలో బహుశా మరో అవినీతి రత్నం కావచ్చు! ఈ భూముల బదిలీ కారణంగా 2006 నాటికి వాణిజ్య సంస్థలలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కుటుంబం వారి వాటాల విలువ ఏడువేల కోట్ల రూపాయలకు పెరిగిందట! కానీ సూలే 2009లో తమ ఆస్తుల విలువను కేవలం రూ.15కోట్లుగా నిర్ధారించిందట. అజిత్ పవార్ నీటి పారుదల మంత్రిగా నడిపిన భూముల కుంభకోణం వల్ల నితిన్ గడ్కారీ కూడ భారీగా లాభపడ్డాడన్నది కేజ్రీవాల్ ఆరోపణ. రాజకీయ ప్రత్యర్థి పక్షాల మధ్య బయట యుద్ధం నడుస్తున్నప్పటికీ తెరవెనుక ఈ పక్షాలన్నీ చేతులు కలిపి నడుస్తున్నాయన్న వికృత వాస్తవానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే కావచ్చు.
ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ-ఎన్‌జిఒ-ను నడిపించడం ద్వారా ‘సేవ’ పేరుతో లక్షలాది రూపాయలు కాజేసిన ఆరోపణను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వీధిపోరాటానికి సిద్ధపడడం రాజకీయ దిగజారుడు తనానికి ఇంకొక ఉదాహరణ. తన నియోజకవర్గం ఫరూకాబాదుకు కేజరీవాల్ వచ్చినట్టయితే తిరిగి వెళ్ళలేడని ధ్వనించే విధంగా మంత్రి ప్రకటించడం ప్రభుత్వ బీభత్స కాండకు ప్రతీక. ఈ బీభత్స కాండకు పాల్పడిన సల్‌మాన్ ఖుర్షీద్‌ను పదవినుంచి తొలగించడం ప్రధాని తక్షణ కర్తవ్యం. కాని అదేమీ జరగడంలేదు. ఖుర్షీద్ అవినీతికి పాల్పడినాడా లేదా అన్నది ఋజువు కావలసిన అంశం. కానీ కేజ్రీవాల్‌కు ప్రాణహాని జరుగుతుందన్న అర్థం వచ్చే విధంగా మంత్రి బెదిరించడం మాత్రం ప్రసార మాధ్యమాలు ధ్రువీకరించిన దృశ్యం! గురువారం ‘ఐఏసి’ కార్యకర్తలపై ఫరూకాబాద్‌లో దాడులు జరిగాయి. దుండగులు వారిపై రాళ్ళు విసిరి గాయపరిచినట్టు తెలుస్తోంది. వాద్రా-టిఎల్‌ఎఫ్ భూమి బదిలీ వ్యవహారం దేశ విదేశాలలో ప్రచారమైన తరువాత కూడ, దర్యాప్తు జరుప తలపెట్టిన ఉన్నత అధికారి అశోక్ ఖేంకాను హర్యానా ప్రభుత్వం బదిలీ చేయించడం భయపడని రాజకీయ దౌష్ట్యానికి మరో నిదర్శనం. ఆ అధికారి ఈ భూమి కుంభకోణం ఫైళ్ళను తెప్పించి పరిశీలించడం పసిగట్టిన ప్రభుత్వం వెంటనే ఆయనను బదిలీ చేసింది. రాజకీయ నాయకులు ఒత్తిడులకు లొంగిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘బదిలీ’ ఉత్తర్వులు చేయవలసి రావడం మన రాజ్యాంగ వ్యవస్థను కుదేలుమనిపిస్తున్న ‘పౌరాధికార ఆధిపత్యం’! ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని రాజకీయ పార్టీలను తొలగించి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ‘ఐఏసి’ సంకల్పానికి ఇదంతా వైఫల్యం...కానీ సంకల్పసిద్ధికోసం ప్రజలు కలిసి రావాలి కదా!!
రాజకీయ పార్టీలన్నీ అన్యోన్య సహకారంతో అవినీతి చరిత్రను నిర్మిస్తుండడం కొత్త విషయం కాదు
english title:
rajakeeya
Date:
Saturday, October 20, 2012