స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో పెద్ద మొత్తంలో క్షామ పరిస్థితులు నెలకొనలేదన్న మాట సత్యదూరం కానప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆకలి విపరీతంగా వ్యాప్తి చెందడమే కాదు, క్రమంగా ఇంకా పెరుగుతున్నదనేది మాత్రం వాస్తవం. అధికారిక అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 87శాతం గ్రామీణ ప్రజలకు రోజువారీగా అందాల్సినంత కెలోరీల ఆహారం లభించడంలేదు. మరి ఈ దుస్థితికి కారణమేంటి? వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవడం, ఆహార ధాన్యాలను కోళ్ళ పరిశ్రమకు, పశువుల దాణాకోసం మరలించడం, విదేశాలకు ఎగుమతులు చేపట్టడానికి వీలైన పంటలను ప్రోత్సహించడం, వాణి జ్య పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోవడం, అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలు దేశంలో ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. వీటికి తోడు అందుబాటులో ఉన్న వ్యవసాయ భూముల్లో, ‘జట్రోపా’ వంటి జీవ ఇంధన ఉత్పత్తి మొక్కల సాగును ప్రోత్సహించడం కూడా ఆహార సంక్షోభానికి తనవంతు పాత్ర పోషిస్తున్నది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పరిశ్రమల స్థాపనకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కేటాయించడం వల్ల, పంటలు పండే సుక్షేత్రమైన భూముల్లో పరిశ్రమలు వెలసి, వ్యవసాయం పూర్తి స్థాయిలో దెబ్బతినిపోతున్నది.
మనదేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయ రంగంలో పెట్టుబడులను వెనక్కి తీసుకొనడానికి కారణమయ్యాయి. దీని ప్రభావం వల్ల దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన 2/3వ వంతుమంది ప్రజల జీవనభృతి పూర్తిగా దెబ్బతిన్నది. వీరిలో అధికశాతం మంది చిన్న సన్నకారు రైతులే. తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడుతూ వచ్చిన ఈ కుటుంబాలు వీధినపడ్డాయి. ఇక పెట్టుబడుల ఖర్చులు తడిసిమోపెడవటం, పంట ఉత్పత్తులకు సరియైన ధర లేకపోవడం వల్ల అన్నదాతలే అన్నానికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక పంటలకు, పశువులకు సరియైన బీమా సదుపాయాలు కొరవడి, రైతులకు తగిన వడ్డీరేట్లకు రుణసదుపాయం లేకపోవడం కూడా దెబ్బతీసింది. అందుబాటులో ఉండే ఆహారం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950 నుంచి 1964 మధ్యకాలంలో, వార్షిక తలసని ధాన్యం అందుబాటు, 140 నుంచి 170 కిలోల వరకు ఉంది. ఇక 1979 నుంచి 1994 మధ్యకాలంలో అది 180 కిలోలకు చేరుకుంది. సంస్కరణల యుగం ప్రారంభమైన తర్వాత, తలసరి వార్షిక ధాన్యం అందుబాటు ఒక్కసారిగా 150 కిలోలకు పడిపోయింది. దీంతో అవసరమైన ధాన్యం, వాస్తవంగా అందుబాటులో ఉన్న ధాన్యానికి మధ్య వ్యత్యాసం బాగా అధికం కావడం మొదలయింది. ప్రస్తుతం నెలకొన్న ధాన్య సంక్షోభం నేపథ్యంలో, ఇదే వ్యత్యాసం పెరుగుతూ పోయినట్లయితే..ఇప్పటికే ఆకలితో బాధపడుతున్న వివిధ వర్గాల ప్రజలు మరింత పెనుప్రమాదంలో చిక్కుకోక తప్పదు.
ఈ విపత్కర పరిస్థితికి తోడు పర్యావరణంలో వస్తున్న మార్పులు సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. వాతావరణశాఖ అంచనాల ప్రకారం దక్షిణాసియాలో పంటలు బాగా పండే ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా పడిపోయే అవకాశాలున్నాయి. వాతావరణంలో వేడి అధికమయిన కొద్దీ పంట మొక్కలు ఎదిగే కాలం కుంచించుకొనిపోయి, ఆహారధాన్యాల ఉత్పత్తి 40శాతం వరకు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో రైతులు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల బారిన పడనున్నారు. ఈవిధంగా వాతావరణ మార్పు వల్ల వ్యవసాయంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా, భూమి, నీరు, జీవవైవిధ్యం వంటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూతాపం వల్ల వచ్చే మార్పులపై రైతులకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలి. మానవుల కార్యకలాపాల వల్ల వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులను ఎదుర్కొనే విధానాలు ఇప్పటి వరకు రైతుల అనుభవంలోకి రాలేదు. నిలిపివేసిన విస్తృత వ్యవసాయ సేవలను తక్షణమే పునఃప్రారంభించాల్సిన అవసరం ఉంది. శిక్షణ మరి యు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల వల్ల వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. నేడు గ్రామీణ ప్రజలకు భూతాపం గురించి తెలియదు. ఒకవేళ తెలిసినా చాలా స్వల్పంగా మాత్రమే తెలియడం వల్ల, సంప్రదాయంగా తాను అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానాల్లో ఏవిధమైన లోపం లేనప్పటికీ దిగుబడులు దారుణంగా పడిపోతుండటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఊహించని విధంగా సంభవించే మార్పుల వల్ల కలిగే పంటనష్టం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆహార భద్రత మరియు జీవనభృతి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులకు ఏవిధంగా అలవాటు పడాలి..పంటలను ఏవిధంగా సంరక్షించుకోవాలన్న అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. కేవలం రైతులకు మాత్రమే కాదు, ఈ రంగంలో ఒక స్థాయిలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ శిక్షణ అవసరం. ముఖ్యంగా విధానకర్తలు, పంచాయతీరాజ్ సంస్థలు, బ్యాంకింగ్ రంగం, పౌర సమాజ గ్రూపులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు..మొదలైన వారికి, వాతావరణ సమస్యలకు అనుగుణంగా పంటలను ఏవిధంగా అనువర్తింపజేయాలన్న దానిపై సైద్ధాంతికపరమైన శిక్షణ అవసరం. ఇటువంటి శిక్షణా కార్యక్రమాల వల్ల విజయవంతంగా, అనువర్తనా వ్యూహాలను అమలు పరచవచ్చు.
ఆహార ఉత్పత్తిలో ప్రాథమికమైన వ్యూహాత్మక మార్పు అవసరం. ఇప్పటి వరకు అత్యధిక నీరు, పూర్తిస్థాయి యాంత్రీకరణ వ్యవసాయం నుంచి నీరు తక్కువ అవసరమయ్యే పంటలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరువును ఎదుర్కొనాలంటే, ‘ఒక్క చుక్క నీటికి అధిక మొత్తంలో పంట ఉత్పత్తి’ అనే వ్యూహాన్ని అనుసరించాలి. భూతాపం విసిరే సవాళ్ళను ఎదుర్కొనడానికి కూడా ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి వీలుగా ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తి విధానాలనుండి.. అందుబాటులో ఉండే వనరులను సమర్ధవంతంగా వినియోగించుకొని తక్కువ రిస్క్‌తో ఎక్కువ దిగుబడిని సాధించే పద్ధతులకు మారాలి. ఇటువంటి సుస్థిర విధాన నమూనాలను పంటలు, పశుసంపద, కోళ్ళ పరిశ్రమ, మత్స్యపరిశ్రమ, అడవుల పెంపకం వంటి వాటికి ఉపయోగించవచ్చు. రుతుపవన వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల, హిమానీనదాలు త్వరగా కరిగిపోయి, జీవనదుల్లో నీటి ప్రవాహం పడిపోతుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న పరిమిత నీటిని గరిష్టంగా వినియోగించుకునే విధానాలకు రైతులు అలవాటు పడాలి. సంప్రదాయంగా వర్షపు నీటిని నిల్వ చేసే వనరులైన, చెరువులు, కుంటలు, బావులు వంటి వాటిల్లో నీరు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల జీవావరణ వ్యవస్థల్లో వర్షపు నీటిని వినియోగించుకోవడం, ఆయకట్టు ప్రాంతాల్లో వాటర్‌షెట్ అభివృద్ధి, రీచార్చ్ ట్రీట్‌మెంట్లు వంటి కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. వర్షాలు తగ్గిపోవడం వల్ల, చెరువుల్లో, బావుల్లో, నీరు ఎప్పటికప్పుడు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే, పంటలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇక భూసార పరిరక్షణ కూడా వ్యవసాయోత్పత్తులు పెరగడానికి తమవంతు పాత్రను పోషిస్తాయి. రసాయన ఎరువుల వినియోగాన్ని నిలిపి, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తులను పెంచడం ద్వారా భూమిలో పోషకాలను మరింత వృద్ధి చేయవచ్చు. ఫలితంగా పంటల దిగుబడులను పెంచవచ్చు. అంతే కాకుండా పంట మార్పిడి విధానాలను అనుసరించడం ద్వారా, వ్యవసాయంలో పర్యావరణ వ్యవస్థల పరిరక్షణను సమర్ధవంతంగా నిర్వహించవచ్చు. అంతే కాదు భూమిలో స్థూల, సూక్ష్మ పోషకాల సమతుల్యతను సమర్ధవంతంగా కాపాడవచ్చు. చీడపీడలను అరికట్టడానికి జీవ సేంద్రీయ విధానాలను అనుసరించడం వల్ల, వ్యవసాయ క్షేత్రాల్లో వేగంగా మారిపోతున్న పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
పర్వత ప్రాంతాలు, ఏటవాలు తలాల్లో కాంటూరు కందకాలను తవ్వడం ద్వారా నీటి వృధాను సమర్ధవంతంగా అరికట్టడమే కాదు అధిక పంట దిగుబడిని సాధించవచ్చు. ఈ సందర్భంగా పశ్చిమ ఆఫ్రికాకు చెందిన బుర్కినా ఫాస్కో ప్రాంతాల్లో పూర్తిగా క్షీణించిన భూముల్లో పునరుత్పాదన శక్తిని పెంచే విధానాలను అనుసరించడం ద్వారా తొలి సంవత్సరమే అక్కడ నలబై శాతం అధిక ఉత్పత్తిని పెంచగలిగారు. లెగ్యుమినోసీ కుటుంబానికి చెందిన మొక్కలను బలహీన వ్యవసాయ క్షేత్రాల్లో పెంచడం ద్వారా వాటి సామర్ధ్యాన్ని వేగం గా పెంచవచ్చు. మనదేశంలో అటువంటి భూములు చాలా అధికంగా ఉన్నాయి. లెగ్యుమినోసి మొక్కలను పొలంలో వరుసగా నాటడం వల్ల నత్రజని స్థాపన జరగడమే కాకుండా, నేలకోతను కూడా సమర్ధవంతంగా అరికట్టవచ్చు. అంతేకాదు గడ్డిమొక్కలను పెంచడం ఇతర రకాలకు చెందిన మట్టిని పొలంలో పోయడం వల్ల, భూమిలో తేమశాతాన్ని వృద్ధి చేయవచ్చు. గడ్డిజాతి మొక్కలను పెంచడం వల్ల కలుపు మొక్కలను అరవైశాతం వరకు నివారించవచ్చు. ఇదంతా రాకెట్ యుగానికి చెందిన శాస్త్ర పరిజ్ఞానం కాదు. చాలాకాలంగా విధానాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన అంశాలివి. పర్యావరణ మార్పుపై జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సరియైన దృక్కోణంలో లేకపోవడం వల్ల వాస్తవిక పరిష్కారాలను అందించడం లేదు. ఈ నేపథ్యంలో మన వ్యవసాయాన్ని, ఆహార ఉత్పత్తిని భూతాపం నుంచి పూర్తి స్థాయిలో పరిరక్షించుకునేందుకు యుద్ధప్రాతిపదికన విధివిధానాలను రూపొందించి అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో పెద్ద మొత్తంలో క్షామ పరిస్థితులు నెలకొనలేదన్న మాట సత్యదూరం కానప్పటికీ,
english title:
pantala
Date:
Friday, October 19, 2012