విశాఖపట్నం, అక్టోబర్ 20: స్టీల్ ప్లాంట్ భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి.చిరంజీవరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిరంజీవరావు నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారన్న ఆరోపణలు చాలా కాలంగా వెల్లువెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ భూ సేకరణ సమయంలో భూములు కోల్పోయిన వారికి అప్పట్లో ఆర్ కార్డులు జారీ చేశారు. ఇప్పుడు వారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయి, వేరు కాపురం ఉండడంతో, వారికి కూడా పరిహారం చెల్లించాలని గత కొంత కాలంగా ఆందోళన జరుగుతోంది. అలాగే ఆర్ కార్డుదారులపై ఆధారపడి జీవిస్తున్న కుమార్తెలకు కూడా భూముల కేటాయింపులో చిరంజీవిరావు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా, ఒకరికి కేటాయించిన భూమిని, మళ్లీ వేరొకరికి కేటాయించారన్న ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. అలాగే బినామీలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈయన వ్యవహారశైలి వలన శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తిందని పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ వీటన్నింటిపైనా దర్యాప్తు జరిపారు. దీనిపై కలెక్టర్ పంపిన నివేదిక మేరకు భూసేకరణ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేట, చిరంజీవిరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్
english title:
s
Date:
Sunday, October 21, 2012