ఏలూరు, అక్టోబర్ 20 : పాదయాత్రలు దూసుకువచ్చేస్తున్నాయి... ఇందిరమ్మ బాటతో అధికార పార్టీ ముందుకు వచ్చింది... ఏ నేత ఏ నిమిషంలో ఏ పార్టీకి గుడ్‌బై చెబుతారో తెలియదు. సైన్యాన్ని సమీకరించుకుని మనోధైర్యాన్ని నింపి వారిని కదనోత్సాహంతో ముందుకు నడిపించాల్సిన సైన్యాధ్యక్షులు మాత్రం ముగ్గురూ ఏకాకులే. జిల్లా రాజకీయంలో ఇదొక ప్రత్యేక సందర్భంగా చెప్పుకోవాలేమో... ప్రధాన పార్టీలు మూడింటికి అధ్యక్షులు తప్ప ఇతర కార్యవర్గాలు లేకపోవడం ఒక ప్రత్యేకంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష టిడిపి, వై ఎస్ ఆర్ సిపిలకు ప్రస్తుతం ఆయా పార్టీలను బట్టి అధ్యక్షులు, కన్వీనర్లు మాత్రమే వున్నారు. ఇతర కార్యవర్గం గానీ ఇతరత్రా కమిటీలు, సభ్యుల నియామకాలు గానీ జరగనే లేదు. గత కొనే్నళ్లలో ఇటువంటి సందర్భం దాదాపు లేనేలేదని పలువురు రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గోకరాజు రామరాజు అధ్యక్షునిగా వున్నారు. అయితే ఆయనకు కార్యవర్గం లేదు. అలాగే టిడిపి జిల్లా అధ్యక్షురాలుగా తోట సీతారామలక్ష్మి ఇటీవలే మరోసారి ఎన్నికయ్యారు. ఆమెకు కూడా కార్యవర్గం లేదు. ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినా ఇదే సీను పునరావృతమవుతోంది. ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌గా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ పార్టీలోనూ జిల్లా కార్యవర్గాల నియామకం జరగనేలేదు. అన్నింటిలోనూ వెయిటింగ్ లిస్టు కార్యవర్గాలే దర్శనమిస్తున్నాయి. దాదాపు మూడు పార్టీల్లోనూ కూడా కార్యవర్గాల నియామకాలకు ఒక్కో రకమైన కధనం వినిపిస్తూనే వస్తోంది. అయినప్పటికీ ఆ కధలకు మాత్రం ముగింపు సీను రావడం లేదు. ఏది ఏమైనా ఒక వైపు చంద్రబాబు, మరోవైపు షర్మిల పాదయాత్రలు చేపట్టి రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించిన తరుణంలో మరోవైపు ఇందిరమ్మ బాటతో ముఖ్యమంత్రి జనంలోకి దూసుకువెళుతున్న సమయంలో జిల్లాలో మాత్రం మూడు ప్రధాన పార్టీలకు సైన్యాధ్యక్షులు మినహా సైన్యం ఇంకా కూడకపోవడం విచిత్రంగానే చెప్పుకోవాలి. అయితే కార్యకర్తల బలం మూడు పార్టీలకు దండిగానే ఉన్నప్పటికీ కార్యవర్గాల నియామకాలు మాత్రం జరగకపోవడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అదొక సుదీర్ఘమైన కధగా మారిపోయింది. గోకరాజు రామరాజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం, ఆ తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే ఆ పదవికి రాజీనామా సమర్పించడం ఒక రికార్డుగా నిలిచిపోయింది. ఆ తరువాత కూడా సర్దుబాట్లు, బుజ్జగింపులు వంటి వ్యవహారాలన్నీ నడిచి మళ్లీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గోకరాజు రామరాజు పగ్గాలు చేపట్టారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఆయన ఒక్కరే కొనసాగుతూ వస్తున్నారు. ఇంత వరకు కార్యవర్గ నియామకం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా మారిందంటే పిసిసి అధ్యక్షునికే కార్యవర్గం లేదని, ఇక డిసిసికి కార్యవర్గం ఎక్కడి నుంచి వస్తుందని పార్టీ నేతలే ప్రశ్నించే సీను వచ్చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే దీనిలో మరో విధమైన వ్యవహారం నడుస్తూ వస్తోంది. ఇటీవల సంస్థాగత ఎన్నికల నేపధ్యంలో తోట సీతారామలక్ష్మి మరోసారి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో టిడిపి కూడా ఈసారి కార్యవర్గాన్ని ఎన్నుకోలేని పరిస్థితిని ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో అధిష్టానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆ పరిణామాన్ని వాయిదా వేశారు. ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా పార్టీ కన్వీనర్‌గా వున్న కొయ్యే మోషేన్‌రాజును మార్చి ఆ స్థానంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియామకం జరిగిపోయింది. అయితే ఆ తరువాత నుంచి కూడా బాలరాజు కార్యవర్గం మాత్రం నియామకం కాలేదు. ఈ విధంగా మూడు పార్టీల్లోనూ దాదాపు సైన్యాధ్యక్షులు సిధ్ధమైనా సైన్యం మాత్రం ఇంకా తేలలేదు.
*వేడెక్కిన రాజకీయం*అయినా కార్యవర్గాలు కరువు*పార్టీల్లో అయోమయం
english title:
e
Date:
Sunday, October 21, 2012