ఏలూరు, అక్టోబర్ 20 : గేదెల పెంపకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు సబ్సిడీ మంజూరు చేసారన్న అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ ఛైర్మన్, ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు జిల్లా అదనపు జెసి ఎంవి శేషగిరిబాబును ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జరిగిన విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు మాట్లాడుతూ పశుక్రాంతి పధకం కింద దెందులూరు మండలంలో వివిధ బ్యాంకులలో 70 మంది పేద లబ్ధిదారులకు గేదెలు కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారన్నారు. ఈ మేరకు గేదెల పెంపకానికి దరఖాస్తు చేసుకోమని పశుసంవర్ధక శాఖ అధికారులు పేదలను ప్రోత్సహించి ఇందుకు సంబంధించి డబ్బులు కట్టిన తర్వాత ఆ లబ్ధిదారులకు సబ్సిడీ ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే బ్యాంకులు రుణాలివ్వడం లేదని మభ్యపెడుతున్నారని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. దీనిపై కావూరి స్పందిస్తూ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు గేదెలు పంపిణీ చేయకుండా బయట వ్యక్తులకు ఎలా సబ్సిడీ విడుదల చేసారని పశుసంవర్ధక శాఖ జెడి బక్కయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ప్రోత్సహించి గేదెల పెంపకానికి రుణాలు అందించాల్సిన బాధ్యత పశుసంవర్ధక శాఖాధికారులపై ఉందని అయితే రుణాలిస్తామని ఆశపెట్టి ఆ రైతులకు ప్రభుత్వపరంగా సబ్సిడీ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడం సమంజసం కాదని ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌ను కావూరు సాంబశివరావు ఆదేశించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు విచారణ జరిపి నివేదిక సమర్పిస్తారని, దాని ఆధారంగా సంబంధిత పశుసంవర్ధక శాఖాధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తనకు రెండు గంటలు సమయం ఇస్తే ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు. పశుసంవర్ధక శాఖ జెడి బక్కయ్య మాట్లాడుతూ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 70 పాడిగేదెల యూనిట్లు కేటాయించి అన్ని బ్యాంకులకు తగు చర్యలు నిమిత్తం లేఖలు అందించామని కానీ గేదెలు పెంపక యూనిట్లకు బ్యాంకు అధికారులు ముందుకు రాలేదని చాటపర్రు కెనరాబ్యాంకు పరిధిలో పది యూనిట్లు, విజయరాయి ఎస్‌బిఐ పరిధిలో పదకొండు యూనిట్లు మంజూరు చేసినట్లు బక్కయ్య చెప్పారు.
జెసికి ఎంపి కావూరి ఆదేశం
english title:
g
Date:
Sunday, October 21, 2012