జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 20: మీ వెంట నేనున్నాను... స్థిర నిశ్శయంతో ఉండండి... మనోధైర్యం కోల్పోకండి... దేవుడికి సైతం భయపడాల్సిన పని లేదు... నేను పచ్చినెత్తురు తాగేవాడికి సైతం భయపడను.. పార్టీలోనే కొనసాగండి! అని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు భరోసా ఇచ్చారు. స్థానిక పాతబస్టాండ్ వద్ద శనివారం జరిగిన జంగారెడ్డిగూడెం పట్టణ, మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని, సమర్థులను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని ఇటీవలే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తాను చెప్పానని, కనీసం లక్ష మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాలని చెప్పానని అన్నారు. గ్రామ స్థాయి నుండి కార్యకర్తలకు విలువ, గౌరవం ఇవ్వాలని, కార్యకర్తలను బలోపేతం చేస్తేనే పార్టీ బలపడుతుందని చెప్పినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు గడ్డితింటే కార్యకర్తలకు తెలియదనుకుంటే పొరపాటేనని, ప్రజాప్రతినిధి గడ్డితింటే అధికార్లు పనులు చేయరని, అది అధికార్ల తప్పుకాదని, ప్రజాప్రతినిధిదని అన్నారు.
కాలుదువ్వేదీ, తొడకొట్టేదీ వీరితోనా?
డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబుతో విబేధాలను పరోక్షంగా ప్రస్తావించిన కావూరి తాను రాంబాబుతో పోరాడి సాధించేది ఏమీ లేదని స్పష్టం చేసారు. 30 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తాను రాంబాబు, గురునాధరావు వంటి వారితో పోటీ పడతానా? కాలుదువ్వేదీ, తొడకొట్టేదీ వీరితోనా?, అలా చేస్తే, నేను చేతగానివాడిని కానా? అన్నారు. తాను జాతీయ స్థాయి నాయకుడినని, తాను పోటీపడేది ఆ స్థాయి వ్యక్తులతోనేనని స్పష్టం చేసారు. ఎవరికీ తనపై శత్రుత్వంగాని, అసూయగాని లేదని అన్నారు. తనను పొగిడేవారు మిత్రుడని, విమర్శించిన వారు శత్రువని భావించేంతటి అవివేకిని కాదని కావూరి స్పష్టం చేసారు.
ఓడిపోతామని వట్టి,కరాటమే చెప్పారు
ఉప ఎన్నికల్లో పోలవరం నుండి కాంగ్రెస్ ఓడిపోతుందని మంత్రి వట్టి వసంతకుమార్, డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబులే తనకు చెప్పారని, డిపాజిట్లు సైతం రావని చెప్పారని కావూరి వెల్లడించారు. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించితే గెలిచే అవకాశాలు ఉంటాయనే ఆశతో ఒక ప్రయోగం చేసామని కావూరి అన్నారు. పోలవరం నుండి ఇప్పుడు ఓడిపోయినా త్వరలో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ గురించి మాట్లాడుతూ మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే మన పార్టీలో లేనప్పుడు నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిని పెట్టడం తథ్యమన్నారు. సమర్థుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తామని కావూరి ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
2014లో ఓడినా అధికారం కాంగ్రెస్‌దే
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనా, రెండేళ్ళలో తిరిగి అధికారం కైవసం చేసుకుంటుందని కావూరి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, స్థిరమైన పార్టీ అని, పార్టీ ముందు ఏ పార్టీలూ ఆగలేవన్నారు. కొంత మంది వ్యక్తులు చేసిన తప్పుల వల్ల పార్టీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నాకు వచ్చిందనే అందరూ కలసి ఎదుర్కొనాలని, సమయం, సందర్భాన్ని బట్టి తాను మీవెంటే ఉంటానని కావూరి స్పష్టం చేసారు. పోలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ జెట్టి గురునాధరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎటు ఉన్నారో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అన్నారు. కావూరి సాంబశివరావు సమర్థుడైన నాయకుడని, ఆయన నాయకత్వంలో నడిచి, పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్దిలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని, మండలాన్ని కావూరి దత్తత తీసుకోవాలని కోరారు. సభలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, కొండపల్లి కేశుబాబు, పిపిఎన్ చంద్రరావు, వివిఎస్ రామారావు, ఎంబిజెఆర్ ప్రసాదరావు, మద్దాల ప్రసాద్, గౌతు సత్యేంద్రబాబు, నూపా పార్వతి, పరిమి సత్తిపండు, బల్లే రాజారావు, యాదాల ధర్మరాజు, సత్రం లక్ష్మణరావు, విజ్జు రామసుబ్బారావు, బుద్దాల సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, వైఎస్‌ఆర్ పార్టీలోకి వెళ్ళిపోకుండా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని సూచిస్తూ ప్రసంగాలు చేసారు.
*్ధర్యంగా పార్టీలో ఉండండి!*కాంగ్రెస్ కార్యకర్తలకు కావూరి భరోసా*సమర్థుడికే చింతలపూడి బాధ్యతలు
english title:
n
Date:
Sunday, October 21, 2012