ఏలూరు, అక్టోబర్ 20: ఏలూరు నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎంపి కావూరి సాంబశివరావు తెలిపారు. స్ధానిక పత్తేబాదలో 30లక్షల రూపాయలతో ఆధునికరించిన బృందావనం పార్కును శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కావూరి మాట్లాడుతూ కోటి రూపాయల వ్యయంతో గజవల్లివారిచెర్వు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని, చెర్వు మధ్యలో గౌతమబుద్దుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే ఈ పార్కును కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని ప్రధాన పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ మాట్లాడుతూ హేలాపురి నగరవాసులకు అహ్లదకర వాతావరణం కల్పించడానికి నిరుపయోగంగా ఉన్న పలు పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పార్కులోను సీనియర్ సిటిజన్స్ కోసం వాకింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటుచేస్తున్నామని, బృందావనం పార్కులో వాకింగ్ ట్రాక్, మంచి లైటింగ్ వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నగరపాలకసంస్ధ కమిషనర్ నాగరాజు, ఎస్‌ఇ మోహన్, ఇఇ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కత్తి రాము, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పులి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్ధానిక పాతబస్టాండు నుండి కోడేలు బ్రిడ్జి వరకు 14లక్షలతో, శాంతినగర్ వై జంక్షన్ నుండి మున్సిపల్ పరిధి వరకు ఏడులక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎంపి ప్రారంభించారు.
ఏలూరు నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి
english title:
b
Date:
Sunday, October 21, 2012