విశ్వాన్ని జగన్మాత ‘బ్రహ్మ’శక్తితో సృష్టిస్తుంది. ఆ సృష్టిని ‘విష్ణు’శక్తితో రక్షిస్తుంది. ‘రుద్ర’ శక్తితో సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది. ఒకప్పుడు సంహరించేందుకు బదులు, తన ఐశ్వర్య శక్తితో సృష్టిని తనలో లీనం చేసుకుంటుంది. ఇదే తిరోధానం. ఇది సంహారం కాదు, ఉపసంహారం. మరొకప్పుడు సదాశివరూపంలో ప్రాణికోటినంతటినీ అనుగ్రహిస్తుంది. ఇలా సృష్టి, స్థితి, లయ, ఉపసంహార, అనుగ్రహాలు- జగన్మాత చేసే పంచ మహత్కార్యాలు. ఎవరికి ఏది ఇవ్వాలో అది వారి తత్త్వాన్ని అనుసరించి అందిస్తుంది. ముందుగా తల్లి తత్త్వాన్ని అర్థం చేసికొంటే, ఆ ‘తత్త్వాసనిని’ సమీపానికి చేరుకోగలుగుతాం. ఆ తత్త్వ వెలుగును పొంది, ‘సోహం’ భావంతో ‘తత్త్వమసి’ అయి వెలుగు శక్తిలో లీనమవుతారు సాధకులు.
ఈ తత్త్వానే్న నవరాత్రుల్లో తొమ్మిదవరోజున పూజించే మహర్నవమి దేవత ‘మహిషాసుర మర్దిని’ వివరిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు- ఆరు, అరిషడ్వర్గములు. మన శరీరంలో ఉంటూ మన పతనానికి దారితీస్తాయి. ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకొని, మనస్సును స్వాధీనంలో ఉంచుకోటానికి ప్రయత్నిస్తూ, ధర్మంతో ఆనందానుభవాల్ని పొందాలి. విశృంఖలంగా కామదాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే పతనం తప్పదు. ఆ అధర్మాన్ని ఎంత మాత్రం సహించదు- రుద్ర రూప తిరోధానకరి, ఈశ్వరీ అయిన మహిషాసుర మర్దిని.
రావణాసురుడు తత్త్వవేత్త, ఉగ్ర తపస్వి, వేదాంత పరిజ్ఞాత. అతని పేరు వింటేనే ముల్లోకాధిపతులు భయపడేవారు. దీనికి కారణం- అతను ఇంద్రియాల్ని జయించాడు. కానీ సీతామాత సౌందర్యాన్ని చూచి, విని- ఇంద్రియాలకు వశమయ్యాడు, కామ, క్రోధాదులకు లోనయ్యాడు. ధర్మాన్ని తృణీకరించాడు. పతనం చెందాడు. యుద్ధ్భూమిలో పడి ఉన్న రావణునితో అతని భార్య, మహాసాధ్వి మండోదరి ‘‘ఇంద్రియాల్ని జయించిన రోజు నీవు మూడు లోకాల్నీ జయించావు. ఆ ఇంద్రియాలకు వశమై ఇప్పుడు ఘోర పతనాన్ని పొందావు, నిర్జీవుడవయినావు’’-అని అంటుంది. నవరాత్రి పూజ సందర్భంగా, రామాయణాన్ని పారాయణ చేసే వారూ వున్నారు. రావణ సంహారంతో తొమ్మిదవ రోజు పూజ సమాప్తమవుతుంది. ఇదే దేవీనవరాత్రులో- కామ క్రోధాదులకు లోనైన రంభుడి మరణం మహిషాసుర వధతో తొమ్మిదవరోజు పూజ జరుగుతుంది. ఆ మహాశక్తి, ఆ తత్త్వాసనియే ‘‘మహిషాసుర మర్దిని’’.
పూర్వం ‘దనువు’ అనే అసుర రాజుకి, రంభుడు, కరంభుడు అనే ఇద్దరు పుత్రులున్నారు. ఆ రాక్షస సోదరులిద్దరూ సంతానం కోసం తపస్సు చేశారు. కరంభుడు పంచనదమందున్న సరస్సులో తపస్సు చేస్తుంటే, ఇంద్రుడు- మకర రూపంలో వచ్చి సంహరించాడు. చెట్టుపైనుండి తపస్సు చేస్తున్న ‘రంభుడు’ ఇదిచూసి సోదరుడు లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనుస్సు రాక, బాధపడుతూ ఆత్మహత్యకు ఉద్యుక్తుడైనాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆత్మహత్య మహాపాపమని హితబోధ చేసి రంభుడు చేసిన తపస్సుకు సంతోషించి, కామరూపాన్ని ధరించేవాడు, ముల్లోకాలను జయించేవాడు అయిన పుత్రుణ్ణి పొందగల్గునట్లుగా అనుగ్రహించాడు.
వరాన్ని పొంది వెడుతున్న రంభుడికి, యక్షుల సంరక్షణలోనున్న ఒక మహిషముతో క్రీడించాలనే నికృష్ట కోరిక కల్గింది. దాని ఫలితంగా ఆ మహిషం గర్భం దాల్చింది. రంభుడు మహిషాన్ని తీసికొని పాతాళంలోనికి వెడుతుండగా, అక్కడ వేరొక మహిషము, సహజ సిద్ధముగానున్న పశు ప్రవృత్తితో, ఈ మహిషాన్ని సంగమించటానికి వచ్చింది. రంభుడు అడ్డుకున్నాడు. మహిషములోని తీవ్ర కామము క్రోధాన్ని ప్రేరేపించటంతో తన వాడి కొమ్ములతో రంభుని సంహరించింది. రంభుని వలన గర్భం దాల్చిన మహిషి పాతాళము నుండి బయల్పడి యక్షులున్న చోటికి రాగా, యక్షులు బాణములతో మహిషాన్ని చంపి, రంభుని శరీరాన్ని, మహిష శరీరాన్ని దహనం చేశారు. ఆ మంటలయందు మరణిస్తున్న మహిషికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారే- మహిషుడు, రక్తబీజుడు.
కాలక్రమమున బ్రహ్మచేత వరాన్ని పొంది, సాటిలేని మేటి పరాక్రమంతో ముల్లోకాలను గడగడలాడిస్తూ, ప్రజాపీడనంగా రాజ్యం చేస్తున్నాడు- మహిషాసురుడు. పురుషుల చేతకాకుండా, స్ర్తి మూర్తి చేతనే మహిషాసురుడు సంహరింపబడతాడని తెలిసికొని, దేవతలందరూ ఆర్తితో శ్రీ భువనేశ్వరీ మాతను ప్రార్థించి, తమ విపత్తును విన్నవించుకున్నారు. మహా సామ్రాజ్ఞి అయిన జగన్మాత, మూల ప్రకృతి స్వరూపంతో త్రిమూర్త్యాత్మకము, త్రిగుణాత్మకము, త్రికాలాత్మకము అయి, తేజ స్వరూపిణిగా మహిషుని మంత్రులు సైన్యాధిపతులు అయిన- తామ్రుడు, బిడాలుడు, ధూమ్రాక్షుడు, చక్షుడు, అసిలోములను సంహరించింది.
‘‘సురవర వర్షిణి, దుర్ధర ధర్షిణి, దుర్ముఖ మర్షిణి, హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే, దనుజని రోహిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సుంధుసుతే...’’ -అని దేవతలందరూ ప్రార్థన చేస్తుండగా సింహ వాహనయై, మంత్ర మహోగ్రరూపంలో ‘కాళీ’ శక్తిగా మహిషాసురునితో భయంకరంగా పోరు సాగించింది. మహిషాసురునిలోని కామ, క్రోధ, మోహాదులను నశింపజేసి, ‘మహిషాసుర మర్దిని’గా అవతరించింది. కౌరవ, పాండవ యుద్ధము ప్రారంభానికి ముందు భీమసేనుని మనుమడు ‘బర్బరీకుడు’ కురుక్షేత్రానికి వచ్చాడు. బర్బరీకుడు- ఘటోత్కచుని కుమారుడు. ‘వౌర్వి’ అనే స్ర్తి వలన జన్మించిన వాడు. అసమాన పరాక్రమశాలి. దేవీ వరప్రసాద సంపన్నుడు అయిన బర్బరీకుడు కౌరవ సేననంతటినీ తానొక్కడినే హతమార్చగలనని చెప్పి, ధనువు నెక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి వదిలాడు. అందుండి ఎఱ్ఱని భస్మము వచ్చి- భీష్మునికి, ద్రోణ, కర్ణ, శకుని, ద్రుపదాదులందరిపై పడినది. శ్రీకృష్ణుని పాదముపై కూడా పడినది. పాండవులకు మాత్రం ఆ ఎఱ్ఱభస్మము తగులలేదు. అనగా, అందరి మృత్యు మర్మ స్థానములు బర్బరీకునికి తెలుసునని, కనుక అందరినీ చంపుట అతనికి తేలిక అని తేట తెల్లమయినది. వెంటనే శ్రీకృష్ణుడు చక్రముతో అతని శిరస్సును ఖండించాడు. పదునాల్గు రూపములతో జగన్మాత సాక్షాత్కరించింది. పుత్రోశోకముతో దుఃఖిస్తున్న ఘటోత్కచుని ఓదార్చుతూ ‘సూర్యవర్చుడు’ అను యక్షరాజు శాపవశమున బర్బరీకునిగా పుట్టినాడని, శ్రీకృష్ణుని వలన శరీరమును పోగొట్టుకున్నాడని తల మాత్రము ప్రాణముతో ఉండునని, మహాభారత యుద్ధానికి సాక్షిగా నిలిచేది ఆ తలయేనని చెప్పి మాత అదృశ్యమైనది.
యుద్ధానంతరం అర్జునుడు ‘‘యుద్ధంలో మన కంటి ముందుగా ఒక శక్తి నడుస్తూ, శత్రువులనందరినీ సంహరిస్తున్నట్లు నేను చూచాను’’ -అని సూ క్ష్మజ్ఞానంతో కృష్ణునికి చెప్పాడు. సందేహ నివృత్తికి పర్వతం మీద ఉన్న బర్బరీకుని శిరస్సు వద్దకు అందరూ వెళ్ళారు. ‘ఈ సైన్యమునంతనూ చంపినది- అర్జునుడు, భీముడు, మరింకెవరూ కాదు. మహారుద్ర కాశీశక్తిగా మహామారణ హోమం చేసిందని’’ చెప్పాడు. ఇదే శక్తితత్త్వం. మహిషాసుర మర్దిని వాహనం-సింహం. శత్రువులను సంహరించేది సింహం. శౌర్య, ధైర్యాలకు చిహ్నం- సింహం. జగన్మాతకు వాహనమై, మంత్రమయమై శత్రు సంహారాత్మకమై ప్రవర్తించునది- సింహం. ‘‘మృగాణాంచ మృగేం ద్రోహం’’ అ న్నారు గీతాచార్యులు శ్రీకృష్ణ్భగవానులు. సంసార ఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి, మద మాత్సర్యాది మత్త్భాల్ని అణచే శక్తికి ప్రతీక- సింహం.
దేవీ అనుగ్రహాన్ని పొందిన వాగ్గేయకార త్రయాద్యుడు, లయ బ్రహ్మ - శ్యామశాస్ర్తీ సర్వ మంగళకరమైన, శంకరాభరణ రాగంలో కాల స్వరూప అయి కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న జగన్మాతను ‘కాలానికి రాణి, సద్గుణ శీల కీరవాణి, త్రిలోక జనని, దేవి మహేశ్వరి భవాని’’ అని జగన్మాత కాల స్వరూపాన్ని వివరిస్తూ కీర్తించిన కీర్తన, మహిషాసుర మర్దిని శక్తికి- దీప్తి.
‘‘మహిషాసుర మర్దినీం నమామి మహనీయ కపర్దినీం...’’ అన్న ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన నవరాత్రి పూజకు స్ఫూర్తినిస్తుంది.
ప్రాప్తించిన ‘శక్తి’ సంపదను లోక కల్యాణానికి ఉపకరించి, కామాన్ని ధర్మంతో అనుభవించి, పూర్ణత్వాన్ని పొంది లోక కల్యాణాన్ని కాంక్షించే మోక్షమార్గాన్ని అనుసరించాలని తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని పూజ హెచ్చరిస్తోంది.
విశ్వాన్ని జగన్మాత ‘బ్రహ్మ’శక్తితో సృష్టిస్తుంది.
english title:
serannavaratri
Date:
Tuesday, October 23, 2012