మూఢాచారాలకు, కుల పెద్దల దాష్టీకాలకు నిలయమైన హర్యానాలో ధిక్కార స్వరం వినిపించి సంచలనం సృష్టించింది ఓ గ్రామం. అంధ విశ్వాసాలు అంతం కావాలంటూ స్వేచ్ఛాగీతం వినిపించిన ఈ పల్లెసీమ నేడు వార్తల్లో నిలిచింది. ఓ కుటుంబం కారణంగా ఈ పల్లెకు జాతీయ స్థాయి ఖ్యాతి లభించింది. జిల్లా కేంద్రమైన జింద్ పట్టణానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీబీపూర్ నేడు హర్యానా రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలిచింది. భ్రూణహత్యల నివారణకు, మహిళా సాధికారత సాకారానికి ఈ గ్రామవాసులు కులపెద్దల సహకారం తీసుకుని ముందుకు సాగుతున్నారు. ‘ఖాప్ పంచాయతీల’ పేరిట సమావేశమై, ఆచార వ్యవహారాలపై ఏకపక్షంగా వింత వింత తీర్మానాలు చేసే కులపెద్దలు సైతం తమ ధోరణిలో మార్పు తెచ్చుకున్నారు.
బీబీపూర్‌కు చెందిన సుశీలా జగ్లాన్ (రీతూ) భ్రూణహత్యల నివారణకు గ్రామస్థుల్లో చైతన్యం రగిలించింది. బిఎడ్ చదివిన ఈమెను స్థానిక పరిస్థితులు ఎంతగానో కలవరపరిచాయి. యుక్తవయసు వ చ్చినా తమ గ్రామంలో ఎంతోమంది యువకులకు పెళ్లిళ్లు కాకపోవడాన్ని గమనించిన సుశీల అం దుకు కారణాలను తెలుసుకుంది. ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోవడం వల్లే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని అవగతమయ్యాక గ్రామస్థుల్లో మార్పు కోసం పరితపించింది. భ్రూణహత్యలను నివారించేందుకు స్థానికుల్లో తగిన అవగాహన అవసరమని భావించి, ఈ విషయంలో గ్రామ సర్పంచ్, తన సోదరుడైన సునీల్ జల్గాన్ సహకారం కోరింది. సర్పంచ్ సహాయంతో ఈమె గ్రామంలో సర్వే జరిపి ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి కారణాలను తెలుసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకూ గ్రామంలో 15 మంది ఆడశిశువులు, 25 మంది మగ శిశువులు జన్మించారని ఆ సర్వేలో తేలింది. తమ కుటుంబంలో ముగ్గురు అక్కచెల్లెళ్లు, సోదరుడు ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, సుశీల మాత్రం బిఎడ్ చదివినా ఉద్యోగం కోసం వెళ్లకుండా గ్రామస్థుల్లో మార్పు తేవాలని సంకల్పించి ఆ దిశగా ఒంటరి పోరాటం చేసింది. భ్రూణహత్యలను అరికట్టాలని, మహిళా సాధికరతను సాధించాలని ఈ ఏడాది జూన్‌లో సుశీల గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కులపెద్దలు కూడా ఇందుకు సహకరించడంతో గ్రామస్థుల వైఖరిలో క్రమంగా మార్పు వచ్చింది.
వధువుల కోసం ఇతర రాష్ట్రాలకు..
హర్యానాలో ప్రతి వేయి మంది బాలురకు 700 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, ఇది ఆందోళన కలిగించే పరిణామమని సుశీల గ్రామస్థుల్లో చైతన్యం రగిలించింది. తమ గ్రామానికి చెందిన యువకులు యుపి, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి యువతులను పెళ్లి చేసుకుంటున్నారని ఆమె చెబుతోంది. తన ఉద్యమంలో భాగంగా సుశీల తొలుత బీబీపూర్‌లో కాస్తాకూస్తో చదువుకున్న మహిళలను సమావేశ పరిచి వారికి అన్ని విషయాలు చెప్పేది.
స్థానిక అధికారులు కూడా ఈమె ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కుల పెద్దలను కూడా సమావేశ పరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని భావించి ఆ దిశగా సుశీలతో పాటు సర్పంచ్ సునీల్ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఖాప్ పెద్దల సహాయం తీసుకునేందుకు ఈ ఏడాది జూలైలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుశీల ఆహ్వానం మేరకు సుమారు వంద ఖాప్ పంచాయతీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై మద్దతు ప్రకటించారు. హర్యానా, రాజస్థాన్,పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాప్ పంచాయతీ పెద్దలు భారీగా తరలిరావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘సర్వ్ ఖాప్ పంచాయతీ’ పేరిట జరిగిన ఈ సమావేశంలో తొలిసారిగా మహిళలు మాట్లాడడం సంచలనం సృష్టించింది. మహిళల ప్రాతినిధ్యం లేనిదే భ్రూ ణహత్యల గురించి చర్చించడం అర్థరహితమని భావించి ఈ సమావేశానికి స్ర్తిలను అధిక సంఖ్యలో ఆహ్వానించి, మంచి ఫలితాలు పొందినట్లు సుశీల చెబుతోంది. భ్రూణహత్యల నివారణకు సందేశాలు, ప్రసంగాలతో పాటు నాటక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు ఎంతగానో ఆసక్తి చూపారు. గతంలో ఖాప్ పంచాయతీలకు హాజరు కావడం గానీ, అక్కడ మాట్లాడడం గానీ మహిళలు ఎరగరు. సుశీల నిర్వహించిన సమావేశంలో మహిళలు వారు ప్రసంగించేందుకు అవకాశం దక్కింది.
ఆడపిల్లలు పెళ్లి కాగానే అత్తవారింటికి వెళ్లిపోవాలని, కొడుకులైతే పొలం పనులు, ఇంటి వ్యవహారాలు చూసేందుకు కడవరకూ ఉంటారని గ్రామీణ మహిళలు తమ అభిప్రాయాలను ఆ సమావేశంలో తెలిపారు. ఇలాంటి కారణాలను చూపి ఆడపిల్లలు జన్మించేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సుశీల చెప్పడంతో మహిళల్లో మార్పు వచ్చింది. కాగా, సుశీల తల్లి అనితా దేవి కూడా మహిళలను సమావేశ పరుస్తూ లింగ నిర్థారణ పరీక్షలు, భ్రూణహత్యలను అరికట్టాలని చైతన్య పరుస్తోంది. తమ ప్రయత్నాలు ఫలించి, ఇపుడు గ్రామంలో గర్భవతులు లింగ నిర్థారణ పరీక్షలకు, గర్భ స్రావాలకు అంగీకరించడం లేదని అనాతా దేవి ఎంతో ఆనందంగా చెబుతోంది. గ్రామస్థుల్లో వెల్లి విరిసిన ఈ చైతన్యాన్ని గమనించి బీబీపూర్‌కు హర్యానా ప్రభుత్వం కోటి రూపాయలను బహుమతిగా ప్రకటించింది. ప్రభుత్వం కేటాయంచిన ఈ నిధులను రహదారులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సర్పంచ్ సునీల్ చెప్పారు. కోటి రూపాయల బహుమతి కంటే, తమ గ్రామానికి మంచిపేరు రావడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన చెబుతున్నారు. సామాజిక చైతన్యం కోసం తాము చేస్తున్న కృషికి ఇంతటి ప్రాముఖ్యత లభించడం పట్ల సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భ్రూణహత్యలకు నిరసనగా జరిగిన సమావేశానికి 26 మేజర్ పంచాయతీలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో బీబీపూర్‌కు రావడం మరచిపోలేని సంఘటనగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ చైతన్య స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
మూఢాచారాలకు, కుల పెద్దల దాష్టీకాలకు నిలయమైన హర్యానాలో
english title:
ada
Date:
Tuesday, October 23, 2012